- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పంచాయతీ సెక్రటరీ చేతివాటం.. అక్రమ వెంచర్లకు తనదైన స్టైల్లో..!
దిశ, మునుగోడు : పంచాయతీరాజ్ చట్టానికి కొత్త భాష్యం నేర్పుతూ పంచాయతీ కార్యదర్శి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు. నూతన పంచాయతీ రాజ్ చట్టంలో గ్రామపంచాయతీ నుండి NOC ఇవ్వకూడదనే నిబంధన ఉన్నా ఓ గ్రామ పంచాయతీ కార్యదర్శి మాత్రం యదేచ్ఛగా ఎన్వోసీలు జారీ చేస్తుండటం పలువురిని విస్మయానికి గురి చేస్తోంది. అక్కడ భూముల విలువకు రెక్కలు రావడంతో రియల్టర్లతో కలిసి అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పరిధిలోని రాచకొండ గ్రామపంచాయతీలో 2007వ సంవత్సరంలో ఓసియన్ ప్రెస్టేజ్ సంస్థ 924 ఎకరాలలో లే అవుట్ ను నిర్మించింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఈ లే అవుట్‌ను నిర్మించడంతో ఇక్కడ ప్లాట్లు కొన్నవారు నానా ఇబ్బందులు పడుతున్నారు.
అక్రమం అంటూనే NOC జారీ..
గతంలో రాచకొండ పంచాయతీ కార్యదర్శిని ఈ లేఅవుట్ పై వివరణ అడగగా అది అక్రమ లే అవుట్ అని సమాధానం ఇచ్చాడు. కానీ ఇప్పుడు అదే లే అవుట్లో తాత్కాలికంగా నివాసం ఏర్పాటు చేసుకొనుటకు పంచాయతీరాజ్ చట్టంలో లేని ఎన్వోసీలు జారీ చేయడంతో అసలు కథ బయటపడింది.ఈ లే అవుట్లో సుమారు 92 ఎకరాల గ్రామపంచాయతీ భూమిని స్వాధీనం చేసుకోవాలని పలువురు స్థానికులు కోరగా అది అక్రమ లే అవుట్ అని, తమకు సంబంధం లేదని పంచాయతీ కార్యదర్శి సమాధానం ఇచ్చారు. కానీ, చివరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పంచాయతీ కార్యదర్శి, ఎంపీఓ కలిసి లే అవుట్‌లో నాటిన కడీలను తొలగించారు.
నివేదికకు తాత్సారం..
అక్రమ లే అవుట్‌పై జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించడంలో మండల పంచాయతీ అధికారి తాత్సారం చేస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ లే అవుట్లో గ్రామపంచాయతీ భూమి ఎక్కడ ఉందో తమకే తెలియదంటూ పంచాయతీ కార్యదర్శి, ఎంపీవో సమాధానం ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గతంలో పంచాయతీ భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామని తెలిపి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వెంచర్ నిర్వాహకుడికి ఫోన్ చేశామని పంచాయతీ భూమి ఎక్కడ ఉందో అతను చూపిస్తాను అన్నాడు అని సమాధానం ఇవ్వడం వారి బాధ్యత రాహిత్యాన్ని బట్టబయలు చేసింది.
భారీగానే ముడుపులు..?
హైదరాబాద్‌కు అతి దగ్గరలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో ఇక్కడ భూమికి ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. అంతేకాకుండా రాచకొండను టూరిస్ట్ హబ్‌గా మార్చనున్నారనే వార్తలతో అందరి కన్ను ఇక్కడి భూమిపై పడింది. దీంతో రియల్టర్ల వద్ద ముడుపులు తీసుకుని పంచాయతీ అధికారులు ఈ ధ్రువ పత్రాలను జారీ చేస్తున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఒక్కో ఎన్వోసీ పత్రానికి ఒక్కో రేటును నిర్ణయించి స్థానిక ప్రజా ప్రతినిధులు, పలు స్వచ్ఛంద సేవా సమితి ప్రతినిధుల మధ్యవర్తిత్వంతో ఈ దందా జోరుగా సాగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, ఇదే విషయంపై పంచాయతీ కార్యదర్శి రామకృష్ణను దిశ వివరణ కోరగా ఎన్ఓసీ కావాలని ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారం జారీ చేస్తామని తెలిపారు. గతంలో ఇదే వెంచర్ నిర్వాహకులు గ్రామపంచాయతీ కేటాయించాల్సిన భూమి, డెవలప్మెంట్ చార్జీలు ఎగవేశారనే విజిలెన్స్ శాఖ లేఖతో ఇట్టి లే అవుట్‌లో రిజిస్ట్రేషన్ చేయవద్దంటూ పంచాయతీ కార్యదర్శి సబ్ రిజిస్టార్‌కు లేఖ రాశారు. రిజిస్ట్రేషన్‌లు నిలిపివేయాలంటూ సబ్ రిజిస్టార్‌కు లేఖ రాసిన పంచాయతీ కార్యదర్శి నేడు ఎన్ఓసీలు జారీ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ మాత్రం ఇప్పటివరకు తాము గ్రామపంచాయతీ నుండి ఎలాంటి ఎన్ఓసీలు జారీ చేయలేదంటూ సమాధానం ఇవ్వడం ఆశ్చర్యకరం.
త్వరలోనే విజిలెన్స్ కేసు నమోదయ్యే అవకాశం : డీఎల్పీవో సాధన
జిల్లా కలెక్టర్ ఆదేశాలతో త్వరలోనే రాచకొండలోని అక్రమ లే అవుట్ల పై విజిలెన్స్ కేసు నమోదు అయ్యే అవకాశం ఉంది. నూతన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామపంచాయతీలో ఎన్ఓసీ అనే పదం తొలగించబడింది. గ్రామ పంచాయతీ నుంచి ఎన్ఓసీలు జారీ చేసే అధికారం ఎవరికీ లేదు. ఒకవేళ జారీ చేసినా అవి చెల్లవు.