పంచాయతీ కార్యదర్శులపై ‘ఫుల్ ప్రెషర్’

by Shyam |
పంచాయతీ కార్యదర్శులపై ‘ఫుల్ ప్రెషర్’
X

దిశ, మహబూబ్ నగర్ :
ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే చాలు హాయిగా పని చేసుకోవచ్చనే భావనతో యువత ఉన్నది. కానీ, ప్రస్తుతం పరిస్థితులు భిన్నంగా మారినట్లు ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలతో తెలుస్తోంది. రాత్రింభవళ్లు కష్టపడి..కోటి ఆశలతో ప్రభుత్వ ఉద్యోగం సాధించిన వారు.. నేడు ఒత్తిడితో పనిచేస్తున్నారు. ఓవైపు పై అధికారులు మరోవైపు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో సతమతం అవుతున్నారు. వేధింపులకు తాళలేక కొందరు రాజీనామా చేస్తుండగా, మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఇటీవల జిల్లాలోని హన్వాడ మండలం యారోనిపల్లి గ్రామ కార్యదర్శి సర్పంచ్, వార్డు సభ్యుల ఒత్తిళ్లకు తాళలేక ఆత్మహత్య చేసుకోగా, ఆరు నెలల కిందట నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం గుమ్మకొండలో ఓ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య చేసుకుంది.

163మంది రాజీనామా..

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గతేడాది నుంచి సుమారు 163 మంది పంచాయతీ కార్యదర్శులు రాజీనామా చేశారు. అయితే వీరిలో అత్యధికంగా రాజకీయ, అధికారుల ఒత్తిళ్లు, వేధింపులు తాళలేకనే రాజీనామాలు చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా గ్రామాల్లో గ్రూపు రాజకీయాల కారణంగా కిందిస్థాయి సిబ్బంది నలిగిపోవాల్సి వస్తోంది. జిల్లాల వారీగా గమనిస్తే మహబూబ్ నగర్‌లో అత్యధికంగా 60 మంది కార్యదర్శులు రాజీనామా చేయగా, వీరిలో దేవరక్రద మండలం నుంచి గత 6 నెలల కాలంలో నలుగురు రాజీనామా చేశారు. నాగర్ కర్నూల్‌లో 51 మంది జోగుళాంబ గద్వాల జిల్లాలో 16, వనపర్తిలో 30, నారాయణపేటలో ఆరుగురు పంచాయతీ కార్యదర్శులు రాజీనామా చేశారు. వీరితో పాటు మరికొంత మంది వీఆర్వోలు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర ఏపీవో ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడి కారణంగా మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసుకోగా, ప్రస్తుతం సీరియస్ కండీషన్‌లో ఉంది.

రాజకీయ వర్గపోరు

టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నాయకులతో పాటు తమ అనుచరగణం కూడా అధికార పార్టీలోకి రావడంతో ఆయా జిల్లా, మండల, గ్రామ స్థాయి వరకు రాజకీయాలు పెరిగిపోయాయి. ఆధిపత్య పోరు కూడా తీవ్ర స్థాయికి చేరింది. ప్రభుత్వం చేపట్టే వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపికలో రెండు వర్గాల నాయకులు కూడా తమకంటే తమకే ప్రాధాన్యత ఇచ్చి తమ వారికే పథకాలు అందేలా చూడాలని సిబ్బందిపై ఒత్తిళ్లు పెంచుతున్నారు. ఇలా రెండు వర్గాల్లో ఏఒక్క వర్గానికి మద్దతు ఇచ్చినా మరో వర్గం వారు ఏదో రకంగా సిబ్బందిని ఇబ్బందులకు గురి చేయడం పరిపాటిగా మారింది.

అధికారుల ఒత్తిళ్లు

రాజకీయ వర్గపోరులో నలిగిపోతున్న సిబ్బందికి బాసటగా నిలవాల్సిన అధికారులు కూడా సిబ్బందిపై వివిధ అంశాల్లో ఒత్తిళ్లు పెంచుతుండటంతో మరింత ఇబ్బంది పడుతున్నారు. తమకు అండగా నిలవాల్సిన అధికారులు ఏదో ఒక వర్గం వారికి సహకరించి సిబ్బందిపై నెట్టేస్తున్నారు. ఇటీవల మిడ్జిల్ మండల తహశీల్దార్ మాకు వద్దంటూ ఈ మండల కార్యాలయ సిబ్బంది మొత్తం కూడా ఆర్డీఓను సంప్రదించారు. టీఎన్జీఓ నాయకులతో కలిసి మొత్తం మండల కార్యాలయ సిబ్బంది ఆర్డీవోకు ఫిర్యాదు చేయడమంటే అధికార ఒత్తిళ్లు సిబ్బందిపై ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

భర్తల పెతనం

మహిళలకు స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్ అమలు కావడంతో అటు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లుగా, ఎంపీటీసీలుగా ఎంపికైన చాలా మంది మహిళలు ఇళ్లకు పరిమితం అవుతున్నారు. మహిళలు పదవులను చేపట్టినా పెత్తనం మాత్రం మొత్తం భర్తలే నడిపిస్తున్నారు. మహిళలు కేవలం సమావేశాలకు హాజరు కావడం ఇతరత్రా నిర్ణయాల్లో వారి భాగస్వామ్యం కింది స్థాయి సిబ్బంది కూడా ఎవరి మాటలు వినాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ విషయాల పై అధికారులకు విన్నవించినా కూడా ప్రభుత్వ ఉద్యోగంలో రాజకీయ, అధికార ఒత్తిళ్లు సహజంగానే ఉంటాయని వాటిని తట్టుకుని నిలబడాల్సిందే అని సూచిస్తున్నారని వాపోతున్నారు. అవసరమైన సమయంలో అధికారులు కూడా తమకు కాకుండా రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతూ తమపై కక్ష్యసాధింపు చర్యలకు పూనుకోవడం, లేదా బదిలీలు చేయడం తమలో ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తుందని వాపోతున్నారు.

Advertisement

Next Story