- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అగమ్యగోచరంగా ఔట్ సోర్సింగ్ నర్సుల భవితవ్యం
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : కరోనా ఉదృతి కొనసాగుతున్న తరుణంలో గతేడాది ఏప్రిల్‌లో నియమించబడి ప్రభుత్వాస్పత్రులలో రోగులకు సేవలందించిన ఔట్ సోర్సింగ్ నర్సుల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రులలో ఉద్యోగమంటే భవిష్యత్ లో రెగ్యులర్ అయ్యే అవకాశం ఉంటుందనే భావనతో చేస్తున్న ఇతర ఉద్యోగాలను సైతం వదిలి ఔట్ సోర్సింగ్ అయినా విధులలో చేరారు. అయితే ప్రభుత్వం మాత్రం వారి ఆశలపై నీళ్లు చల్లింది. రాత్రికి రాత్రే వారిని నిర్ధాక్షిణ్యంగా విధుల నుండి తొలగించింది. దీంతో గత ఏడాది విధులలో చేరిన 1,640 మంది ఆశలపై నీళ్లు చల్లినట్లు కాగా భవిష్యత్ కోసం వారు ఆందోళన చెందుతున్నారు.
ప్రాణాలను పణంగా పెట్టి…
కొవిడ్ కష్ట సమయంలో విధులలో చేరిన ఔట్ సోర్సింగ్ నర్సులు ప్రభుత్వ ఆస్పత్రులలో రోగులకు వైద్య సేవలందించే క్రమంలో వందలాది మంది కొవిడ్ బారిన పడ్డారు. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులు నిర్వహించారు. ఏనాటికైనా తమను ప్రభుత్వం రెగ్యులర్ చేయకపోతుందా అనే ధీమాతో పని చేస్తున్న క్రమంలో వారి తొలగింపు ఆందోళనలకు దారి తీసింది. నిజానికి ప్రభుత్వ ఆస్పత్రులలో వేల సంఖ్యలో నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఎంఎన్‌జే, సుల్తాన్ బజార్, పేట్లబుర్జు ప్రసూతి ఆస్పత్రులే కాకుండా రాష్ట్రంలోని పలు పీహెచ్సీ, యూపీహెచ్సీ, ఏరియా, జిల్లా దవాఖానలలో నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిల్లో ఔట్ సోర్సింగ్ నర్సులను నియమించే అవకాశాలు సైతం ఉన్నాయి. అయినా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకుండా ఏకపక్షంగా తొలగించడం వివాదాన్ని రాజేస్తుంది.
అర్ధరాత్రి వరకు డ్యూటీలు చేయించి…
ప్రభుత్వ ఆస్పత్రులలో పని చేస్తున్న నర్సులు షిప్ట్‌ల వారీగా విధులు నిర్వహించవలసి ఉంటుంది. మొత్తం మూడు షిప్టులలో పని చేస్తుండగా వీరితో ఈ నెల 5వ తేదీ రాత్రి వేళ మూడవ షిప్టులో కూడా డ్యూటీలు చేయించారు. నిజానికి వీరి తొలగింపు ముందు రోజే ఖరారైంది. అయితే వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు మాత్రం వీరిని తొలగిస్తున్నట్లు ముందుగా చెప్పకుండా ఆఖరి నిమిషం వరకు పని చేయించారు. ఈ క్రమంలో 5వ తేదీన డ్యూటీలు చేసిన వారు ఆరవ తేదీన డ్యూటీలకు వెళ్లగా మిమ్మలను తొలగించారని చెప్పి ఆస్పత్రి అధికారులు వారిని విధులకు హాజరు కానివ్వ లేదు. దీంతో వారు ఆందోళనలకు దిగారు. ఇందులో భాగంగా 6వ తేదీన డీఎంఈ కార్యాలయాన్ని, 7వ తేదీన ప్రగతిభవన్ ను ముట్టడించారు.
రెగ్యులర్ పోస్టులు అడగడం లేదు…
సుమారు పదిహేను నెలల పాటు ఔట్ సోర్సింగ్ విభాగంలో విధులు నిర్వహించాం. మేమేం పర్మినెంట్ చేయమని డిమాండ్ చేయలేదు. అయినా మమ్ములను తొలగించడం ఎంత వరకు న్యాయం. ఒక సంవత్సరం కాంట్రాక్ట్ కు మాత్రమే తీసుకున్నామని ప్రభుత్వం చెప్పి చేతులు దులుపుకుంది. అయితే ప్రభుత్వం అన్ని చెప్పినట్లుగా చేస్తోందా..? ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్
ఉద్యోగులనేది లేకుండా చేస్తానని పలుమార్లు ప్రకటించారు. నేడు రాష్ట్రంలో లేకుండా చేశారా..? అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో వారు పని చేస్తున్నట్లుగానే మాకు కూడా అవకాశం కల్పించాలి. లేని పక్షంలో ఆందోళనలు కొనసాగిస్తాం.
-తొలగించబడిన నర్సులు…