జలమండలిలో ఓటీఎస్‌ పద్ధతి మరోసారి పొడిగింపు !

by Shyam |
జలమండలిలో ఓటీఎస్‌ పద్ధతి మరోసారి పొడిగింపు !
X

దిశ, తెలంగాణ బ్యూరో: జలమండలిలో ఓటీఎస్ పద్ధతిని ప్రభుత్వం మరో 15రోజులు పొడిగించింది. నీటి బిల్లుల పాత బకాయిలు వన్ టైమ్ సెటిల్‌మెంట్ పద్ధతిన చెల్లించేందుకు తుది గడువు నవంబర్‌ 15గా ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. ఓటీఎస్ పద్దతితో బిల్లులు చెల్లిస్తే కేవలం బిల్లు బకాయిల మొత్తం చెల్లించాలి. కానీ, బకాయిపై ఉన్న వడ్డీని పూర్తిగా రద్దుచేస్తారు. ఆ ఓటీఎస్ పద్దతి అక్టోబర్ 31తో తుదిగడువు ముగిసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నీటి బిల్లులు క్రమంగా చెల్లించకుండా బకాయి పడుతోన్న వారి సౌలభ్యం కోసం జలమండలి వన్ టైమ్ సెటిల్‌మంట్ పద్దతిని అమలులోకి తీసుకొచ్చింది. గత ఆగష్టు 1వ తేదీన అమలులోకి తీసుకొచ్చిన ఓటీఎస్ పద్దతి సెప్టెంబర్ 15వ తేదీ తుదిగడువుగా ప్రకటించారు. అనంతరం మరో 45 రోజులు పొడిగిస్తూ 31అక్టోబర్ తుది గడువుగా ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం, ఇప్పుడు మరో మారు 15రోజులు ఓటీఎస్ పద్దతిలో బకాయిలు చెల్లించేందుకు తుది గడువు నవంబర్ 15వరకు పొడిగించింది. ఈ ఓటీఎస్ పద్దతిన గత నెల అక్టోబర్ 26వ తేదీ వరకు 3,38,042 కనెక్షన్‌ల నుంచి పాత బకాయిలను చెల్లంచారు. మొత్తం బిల్లు బకాయిదారులు 5,40,690లుగా ఉన్నారు. ఓటిఎస్ పద్దతి అమలులోకి వచ్చిన తర్వాత రూ. 241.02 కోట్లు జలమండలికి చేరాయి.

Advertisement

Next Story