- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పాత జీపీఏల సంగతేంటి?
దిశ, తెలంగాణ బ్యూరో: మూడేండ్లు కష్టపడి రూపొందించిన ‘ధరణి’ పోర్టల్ తో సమగ్రత లభించడం లేదు. ఒక్కొక్కటిగా ఆప్షన్లు ఇస్తున్నా వాటిపై స్పష్టత లేకుండాపోతోంది. అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రెవెన్యూ అధికారులు వాపోతున్నారు. సాంకేతిక సహకారం కూడా అందక స్లాట్ల బుకింగ్‌లో ఆటంకాలు ఎదురవుతున్నాయి. తాజాగా సాగు భూముల లావాదేవీలలో జీపీఏ చేసుకునేందుకు ఆప్షన్ ఇచ్చారు. దీనిలోనూ అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఏం చేయాలో అధికారులకు, క్రయవిక్రయదారులకు తోచడం లేదు.
కొత్తగా జీపీఏ చేసుకుంటే పట్టాదారు పాస్ పుస్తకం వస్తుందా? రాకపోతే ధరణి పోర్టల్ లో కొనుగోలు చేసినవారి పేర్లను ఎలా నమోదు చేస్తారు? సాధారణంగా జీపీఏలో ఒకరి కంటే ఎక్కువ మంది పేర్లు నమోదు చేయించుకునేవారే ఎక్కువగా ఉంటారు. పోర్టల్ లో హక్కుదారుడిగా ఒక్కరి పేరు నమోదు చేయడానికే అవకాశం ఉంది. రెండో పేరు నమోదు చేసేందుకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని తెలుస్తోంది. ఆప్షన్లు ఇచ్చేటప్పుడు అధికారులకు అవగాహన కల్పించాలి.
జనాలను జాగృతం చేసే కార్యక్రమాలు చేపట్టాలి. ఇప్పటి దాకా ధరణి పోర్టల్ ద్వారా క్రయ విక్రయాలు, ఇతర సమస్యల పరిష్కారానికి అవసరమైన అవగాహన కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం మొగ్గు చూపడం లేదు. దీంతో సీఎం కేసీఆర్ ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. యుద్ధప్రాతిపదిక సేవలందించేందుకు, 100 శాతం పారదర్శకత సాధించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రూపొందించిన ధరణి పోర్టల్ పై అవగాహన కల్పించని కారణంగా దుమారం రేగుతోంది. పోర్టల్ రూపకల్పనలో కీలక భూమిక పోషించిన సీనియర్ ఐఏఎస్ అధికారులెవరూ అటు వైపుగా ఆలోచించడం లేదని రెవెన్యూ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. తాజాగా అమలులోకి తెచ్చిన జీపీఏ పైన తహసీల్దార్లకే స్పష్టత లేదని, సామాన్యులు అడిగే ప్రశ్నలకు వారి నుంచి సమాధానం రావడం లేదనే సమాచారం.
పాత డాక్యుమెంట్లు చెల్లవా?
ధరణి సమస్యలపై సమగ్ర అధ్యయనం చేయకుండానే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అవుతున్నాయి. వాటిని అమలు చేయలేక రెవెన్యూ ఉద్యోగులు సతమతమవుతున్నారు. ఏజీపీఏ, జీపీఏలు రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నాయి. పట్టాదారు పాస్ పుస్తకాలు ఉంటే తప్ప మరొకరికి విక్రయించే వెసులుబాటు లేదు. ఏజీపీఏ, జీపీఏ చేయించుకున్న కొనుగోలుదారులు, హక్కుదారులకు కనీసం మ్యూటేషన్ చేయించుకునే అధికారం, హక్కులు లేవు. దీంతో ఏండ్ల కింద ఆ భూములను కొనుగోలు చేసినవారి పేర్లు ధరణికి నోచుకోలేదు. ఏయే భూములు ఏజీపీఏ చేశారో కూడా రెవెన్యూ అధికారులకు తెలియదు.
ఏజీపీఏల సమాచారం సేల్ డీడ్లలోనే నిక్షిప్తమై ఉంటుంది. అవి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలోనే ఉన్నాయి. పాత హక్కుదారులు మరోసారి విక్రయిస్తే అడ్డుకునే వ్యవస్థ ధరణి పోర్టల్ కు, తహసీల్దార్లకు లేదు. మరి ఏజీపీఏ, జీపీఏ హోల్డర్లకు ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తుందో అంతు చిక్కడం లేదు. కొత్తగా జీపీఏ చేసుకోవచ్చునంటూ ఆప్షన్లలో చేర్చినా, పాత వాటి సంగతేమిటో ఎవరూ చెప్పడం లేదు. కొత్తగా చేసుకుంటే పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తారో, చేయరో కూడా తేలని ప్రశ్న. ధరణి పోర్టల్ లో మాత్రమే హక్కుదారుల వివరాలు నమోదు చేసి క్రయ విక్రయాలకు చిక్కులు లేకుండా చేస్తారని ఓ రెవెన్యూ అధికారి అన్నారు.
వారి దృష్టికి వెళ్లినా
రియల్టర్లు సాగు భూములను యథాతథంగా, లేదా ప్లాట్లుగా చేసి విక్రయించడం పరిపాటి. రైతుల నుంచి ఏజీపీఏ లేదా జీపీఏ చేసుకొని ఇతరులకు విక్రయించడం ఆనవాయితీ. ధరణి పోర్టల్ రానంత కాలం ఇబ్బందులు లేకుండా సాగాయి. ఇప్పుడేమో అమ్మేందుకు హక్కులు లేకుండా చేసేశారు. ఇప్పుడు మళ్లీ వారికి విక్రయించిన రైతుల దగ్గరికి వెళ్లి మరోసారి సంతకాలు చేయించాలన్న నిబంధన విధిస్తే మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని రియల్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన భూముల ధరల నేపథ్యంలో ఇబ్బందిగా మారుతుందంటున్నారు.
ఏజీపీఏ చేసుకున్న వారు కూడా యజమానికి పూర్తిగా డబ్బులు చెల్లిస్తారు. ఆరు శాతం స్టాంపు డ్యూటీ కట్టి చేసుకుంటారు. ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అయినా రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కదు. జీపీఏ చేసుకుంటే యజమానికి వారి భూమిని అమ్మేందుకు ఓ ఏజెంట్‌ను నియమించుకోవడం లాంటిదన్నమాట. ఒక శాతం మాత్రమే స్టాంపు డ్యూటీ చెల్లిస్తారు. జీపీఏ, ఏజీపీఏ హక్కులకు భంగం కలుగుతోంది. సమస్యలు తలెత్తుతున్నాయని రెవెన్యూ సంఘాల ప్రతినిధులు కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పరిష్కార దిశగా అడుగులు వేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.