- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘పెగాసస్’తో పెను విధ్వంసం..?
ప్రపంచంతో పాటు భారత్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తున్న పెగాసస్ స్పై వేర్ నిఘా వ్యవహారం ప్రభుత్వాల, ప్రభుత్వ సంస్థల లేదా ప్రభుత్వ రక్షణ సంస్థల స్వయంకృతాపరాధమేనని అర్థమవుతున్నది. ఇందుకు సంబంధించి ప్రతిపక్షాలు పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సన్నివేశాలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ వ్యాసం రాస్తున్న సమయానికీ పార్లమెంటులో ఈ విషయమై ఇంకా గొడవ జరుగుతూనే ఉండాలి. పెగాసస్ వ్యవహారంలో ప్రధాని మోడీ నోరు విప్పాలని, జాయింట్ పార్లమెంటరీ దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలని లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడంలో ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు, అధికారులు, కొందరు ముఖ్య వ్యక్తులపై పెగాసస్ సంస్థ నిఘా పెడుతున్నదనేదే అందరి ఆరోపణ.
ఇంతకూ ఏమిటీ పెగాసస్..?
పెగాసస్ అనేది ఇజ్రాయిల్ దేశానికి చెందిన ఒక అత్యంత ఆధునిక నిఘా వ్యవహారాల సంస్థ. దాని మాతృ సంస్థ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఎంఎస్ఓ కంపెనీ. ఇది ఇజ్రాయిల్ ప్రభుత్వ అనుమతితో పలు దేశాల అధినాయకులు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, కార్యకర్తల ఫోన్లపై నిఘా పెడుతోందని అంటున్నారు. అయితే, ఈ గొడవ నేపథ్యంలో, క్లయింట్లు కోరితేనే తాము నిఘా పెడతామని, వారి డేటాను అందిస్తామని, తమకు తాము ఏమీ చేయబోమని పెగాసస్ సంస్థ ప్రకటించింది. అసలు తమ సాంకేతికత వలననే, తమ నిఘా వలననే అనేక దేశాలలో ప్రజలు సుఖశాంతులతో నిద్రపోతున్నారని కూడా వ్యాఖ్యానించింది. ప్రభుత్వాలకు, ప్రజలకు ఉగ్రవాదుల నుంచి, ఉగ్రవాద సంస్థల నుంచి, అసాంఘిక శక్తుల నుంచి తమ సాంకేతికతను ఉపయోగించి రక్షణ కల్పిస్తున్నామని తేల్చిచెప్పింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రోన్ ఈ విషయంలో ఇజ్రాయిల్ ప్రధానికి ఫోన్ చేశారు. నిఘా పెడుతున్నారనే అంశం తమ దృష్టికి వచ్చిందని, దీనిని సీరియస్‌గా తీసుకుంటామని చెప్పారు. ఇజ్రాయిల్ ప్రధాని బెన్నెట్ ఇందుకు స్పందిస్తూ, ఇది తాను ప్రధానిగా రాకముందు జరిగిందని, ఇప్పుడు ఈ విషయంలో దర్యాప్తు జరుపుతామనీ ఫ్రాన్స్ అధ్యక్షుడికి హామీ ఇచ్చారు. భారతదేశంలో రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌కు చెందిన కొందరు ఇతర నేతలు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని, ఇజ్రాయిల్‌కు చెందిన పెగాసస్ సంస్థ ఈ దుశ్చర్యకు పాల్పడుతోందని గ్లోబల్ ఎక్స్‌పోజ్ సంస్థ బయటపెట్టింది. ఆనాటి నుంచి ప్రపంచంతో పాటు, మన దేశంలో కూడా తీవ్ర అలజడి రేగింది.
141 దేశాలలో నిఘా..
పెగాసస్ సంస్థ 141 దేశాలలో ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోందని అంతర్జాతీయ, జాతీయ మీడియా ప్రకటించడం అందరికీ తెలిసిన విషయమే. ఈ సంస్థ 189 మంది పాత్రికేయులు, 600 మంది నాయకులతోపాటు 50 వేల మంది ఫోన్లపై నిఘా పెట్టిందని మీడియా సంస్థలు వెల్లడించడం అందరికీ దిగ్భ్రాంతి కలిగించింది. అయితే, తాము ఆయా దేశాలకు చెందిన క్లయింట్ల కోరిక మేరకే ఈ పని చేస్తున్నామంటూ పెగాసస్ చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తోంది. తాము ఒక లైసెన్స్‌కు రూ.50 కోట్లు తీసుకుంటామని, ఇందుకు అవసరమైన సాంకేతికతతో లైసెన్స్ జారీ చేసిన ఫోన్‌ను లక్ష్యంగా పెట్టుకుంటామని తెలిపింది. పెగాసస్ సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నవారిలో ఫ్రాన్స్ అధ్యక్షుడు, సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు, భారత కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ, డబ్ల్యూహెచ్‌ఓ అధ్యక్షుడు ఉన్నారని, ఇంకా 14 దేశాల నేతలపైనా నిఘా చర్యలకు పాల్పడుతున్నదని తెలిసింది. తాము నిఘా పెట్టినవారిలో 51 శాతం ఇంటెలిజెన్స్ సంస్థలు, 38 శాతం లయన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు, 11 శాతం మిలటరీ బలగాలు ఉన్నాయని ఆ సంస్థ ప్రకటించడంతో పలు దేశాల ప్రభుత్వాలు తమకు తామే ఇందుకు పూనుకున్నట్టు అర్థం అవుతున్నది. ఈ చర్యల ద్వారా సొంత ప్రభుత్వాలే, సొంత ప్రభుత్వ సంస్థలే నిఘా ఉంచి కొందరి భావ ప్రకటనకు అడ్డంకులు కల్పిస్తున్నారని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పై ఆ దేశ ప్రచ్ఛన్న దళాలు పెగాసస్ సంస్థ ద్వారా నిఘా ఉంచినట్లు తెలిసింది. మరొక రాజుపై ఆ దేశ రక్షణ దళాలే నిఘా పెట్టాయని, సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడిపై రువాండా దేశం నిఘా కోరిందని తెలుస్తున్నది.
ఆయా దేశాల అభ్యర్థన మేరకే..
ఈ విషయాలన్నీ గమనిస్తే ఇజ్రాయిల్ సంస్థ తనకు తాను ఏమీ చేయడం లేదని, ఆయా వ్యక్తులు లేదా సంస్థల అభ్యర్థన మేరకే నిఘా చర్యలకు పాల్పడుతున్నదని తెలుస్తున్నది. అయితే, ఎవరు ఎలా విజ్ఞప్తి చేసినా, ఇలాంటి నిఘాలకు పాల్పడే హక్కు ఎవరికీ లేదన్నది అందరూ అంగీకరించాల్సిన విషయం. మరి పెగాసస్ ఇజ్రాయిల్ చట్టాల ప్రకారం ఇతర దేశాల కార్యక్రమాలలో జోక్యం ఎలా చేసుకుంటుందో అర్థం కాని విషయం. ఈ సంస్థ ఇలాంటి చర్యలకు 2016 నుంచి పాల్పడుతున్నట్టు మీడియా సంస్థల ద్వారా తెలుస్తున్నది. ప్రపంచం నుంచి వస్తున్న విమర్శల కారణంగా సదరు ఎంఎస్ఓ కంపెనీపై విచారణ జరుపుతామని ఇజ్రాయిల్ ప్రకటించడం హర్షణీయం. ఫ్రాన్స్ కూడా విచారణకు ఆదేశించింది. మన దేశంలో కూడా ఫ్రాన్స్ లాగే విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. ప్రతిపక్షాలన్నీ ఒక్క తాటిపై నిలిచి దుశ్చర్యకు పాల్పడిన మోడీని నిలదీయాలని తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా ఇజ్రాయిల్ ఎంఎస్ఓ నిఘా పెట్టిన ఫోన్ లిస్టు నిజమే కావచ్చని ప్రకటించింది. మరి ప్రధాని మోడీతో తమకున్న స్నేహం దృష్ట్యా ఇజ్రాయిల్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.