- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వెసులుబాటా? వెన్నుపోటా?
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ సంబంధ బిల్లులపై ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. చాలా రాష్ట్రాలు ఈ బిల్లుల్ని వ్యతిరేకిస్తున్నాయి. రాజకీయ పార్టీలూ నిరసన తెలుపుతున్నాయి. రాజ్యసభలో గందరగోళం నడుమనే ఈ బిల్లులు మూజువాణి ఓటుతో ఆమోదం పొందాయి. ఈ బిల్లుల ద్వారా రైతులకు మేలు కంటే ముప్పే ఎక్కువగా ఉంటుందని రైతు సంఘాలు చెబుతున్నాయి. వ్యాపారులు ఉత్పత్తులకు కృత్రిమ కొరత సృష్టిస్తే అడిగే దిక్కు కూడా ఉందడని స్పష్టం చేస్తున్నాయి.
దిశ తెలంగాణ బ్యూరో: రైతులు వారు పండించిన పంటను ఎక్కడైనా స్వేచ్ఛగా అమ్ముకునే వెసులుబాటు లభిస్తుందని కేంద్రం ఈ బిల్లుల గురించి గర్వంగా చెబుతోంది. క్షేత్రస్థాయిలో మాత్రం దానికి భిన్నమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. రైతులకు వెసులుబాటు కల్పించే సంగతేమోగానీ, కంటికి తెలియకుండా వెన్నుపోటు పొడుస్తుందని రైతు సంఘాల నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. బిల్లులపై అసంతృప్తితో కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చిందంటే ఇవి ఎంతటి రాక్షస చట్టాలో అర్థం చేసుకోవచ్చని పార్లమెంటు వేదికగానే పన్నెండు పార్టీల ఎంపీలు ప్రశ్నించారు. రైతులకు, వ్యవసాయ రంగానికి, వినియోగదారులకు నష్టం కలుగుతుందని అంటూ టీఆర్ఎస్ ఈ బిల్లుల్ని వ్యతిరేకించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం వీటిని ‘తేనె పూసిన కత్తి’ అంటూ ధ్వజమెత్తారు. రైతులకు ఈ బిల్లుల గురించి పూర్తి అవగాహన లేకపోవడంతో భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఇప్పటికే రైతులు అనేక అవస్థలు పడుతుతున్నారు. గిట్టుబాటు ధరల కోసం గళమెత్తుతున్న సమయంలోనే అనేక పంటలను నిత్యావసర వస్తువుల జాబితా నుంచి తొలగించడంతో, కనీస మద్దతు ధరకు అవకాశం లేకుండా పోయింది.
కమిటీల వ్యవస్థ నిర్వీర్యం
తాజా బిల్లులతో ఇకపైన గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీల వ్యవస్థ నిర్వీర్యం అవుతుంది. వీటిపై ఆధారపడి బతుకుతున్న వేలాది మందికి ఉపాధి కరువయ్యే ప్రమాదం ముంచుకొచ్చింది. వ్యవసాయ చెక్ పోస్టులు ఎత్తేయాల్సి వస్తున్నందున అందులో పనిచేసే సిబ్బంది, వాటిపై ఆధారపడి బతికే కార్మికులు రోడ్డున పడక తప్పని పరిస్థితులు తలెత్తుతాయి.
ప్రస్తుతం రైతులు పంటలను సమీపంలోని మార్కెట్ కమిటీలకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ కమిటీలు నిర్ణీత ధరను నిర్ణయించి కొనుగోలు చేస్తాయి. వ్యాపారులకు లైసెన్సు, గుర్తింపు, వార్షిక ఫీజు తదితరాలన్నీ అమలవుతూ ఉంటాయి. ఎవరికి నష్టం జరిగినా కమిటీలు జవాబుదారీగా ఉంటున్నాయి. కొత్త చట్టంతో రైతులు వారి ఉత్పత్తులను మార్కెట్ కమిటీతో సంబంధం లేకుండా ఏ వ్యాపారికైనా నచ్చిన రేటుకు అమ్ముకునే వెసులుబాటు కలుగుతుంది. రేటు నిర్ణయంలోగానీ, ఆర్థిక లావాదేవీల్లోగానీ, తూకాల్లో తప్పులకుగానీ, మోసాలకుగానీ మార్కెట్ కమిటీతో సంబంధం ఉండదు. రైతుకు అన్యాయం జరిగితే నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరించే సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కు మొరపెట్టుకోవాల్సిందే. వ్యాపారికి, రైతులకు మధ్య జరిగే వ్యాపార లావాదేవీల్లో ఆధారాలు, లిఖితపూర్వక ఒప్పందాలు లాంటివాటిపై ఇప్పటికింకా స్పష్టత లేదు.
చెక్‌పోస్టులు మాయం
వ్యవసాయ ఉత్పత్తుల రవాణాలో అక్రమాలను నివారించడానికి ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు మూతపడినట్లే. రైతులు, వ్యాపారులు ఎక్కడి నుంచైనా కొనుగోలు, అమ్మకాలు చేసేందుకు వెసులుబాటు ఉన్నందున చెక్‌పోస్టుల అవసరం లేకుండా పోతుంది. వాటిలో పనిచేస్తున్నవారికి ఉపాధి పోయింది. వేలాది మంది హమాలీలకు పని దొరకకుండా పోతుంది. రాష్ట్రంలో జూన్ నుంచి చెక్‌పోస్టులు దాదాపు పని చేయడం లేదు. ఇప్పుడు చట్టం రావడంతో వాటి అవసరమే ఉండదు. రైతుల నుంచి ఉత్పత్తులు ఏ వ్యాపారి ఏ మోతాదులో కొన్నారో, మార్కెట్ యార్డు వ్యవస్థ ఉంటే తెలిసిపోతుంది. మార్కెట్ బయట జరిగే లావాదేవీలతో ఏ వ్యాపారి ఎంత మొత్తంలో కొన్నారు, ఎక్కడ దాచిపెట్టారు, కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా లాంటి అవకతవకలను చెక్ చేసే వ్యవస్థ ఉండదు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే రెవెన్యూ లేదా పౌర సరఫరాల విభాగం అధికారులు తనిఖీ చేయవచ్చు. ఎంత మొత్తంలోనైనా వ్యాపారులు నిల్వ చేసుకునే వెసులుబాటు ఈ చట్టంతో లభించినట్లయింది.
నియంత్రణ ఉండదు : నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు
మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో క్రయ విక్రయాలు జరిగితే రైతులకు, వ్యాపారులకు జవాబుదారీతనం ఉంటుంది. రైతును మోసం చేస్తే కమిటీ జోక్యం చేసుకుంటుంది. కొత్త విధానంలో వ్యాపారులకు ఎలాంటి లైసెన్సు ఉండదు. పాన్ కార్డు ఉంటే చాలు. రైతు నుంచి వ్యాపారి సరుకు కొన్న తర్వాత డబ్బులు చెల్లించకుండా ఎగ్గొడితే జవాబుదారీతనం ఉండదు. రాష్ట్రంలో 189 మార్కెట్ యార్డులతో పాటు అనుబంధంగా మరో పాతిక వరకు ఉన్నాయి. యార్డుల్లో జరిగే వ్యాపారం ద్వారా సగటున ఏటా రూ. 150 కోట్లు, చెక్‌పోస్టుల్లాంటి వాటి ద్వారా రూ. 200 కోట్ల మేరకు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. వీటిల్లో పనిచేసే ఉద్యోగులకే రూ. 200 కోట్లు ఖర్చవుతాయి. ఇప్పుడు చెక్‌పోస్టులన్నింటినీ ఎత్తేయాల్సి రావడంతో సుమారు రూ. 200 కోట్ల మేర ఆదాయం పోతుంది. ఉద్యోగుల జీతాలకు ఇబ్బందులు ఏర్పడతాయి. వ్యాపారుల ధరలతో పోటీపడి రైతులను మార్కెట్‌కే రప్పించేలా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది.
కార్పొరేట్ కంపెనీల కోసమే : సారంపల్లి మల్లారెడ్డి, రైతు సంఘం నాయకులు
దేశంలోని ఆహార సరఫరా గొలుసును బహుళజాతి సంస్థలు, కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుల్ని తీసుకొచ్చింది. అంబానీ, అదానీ, టాటా, బిర్లాలాంటి సంపన్నులతో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, డీ-మార్ట్ లాంటి కంపెనీలకు వ్యవసాయ ఉత్పత్తులను కారు చౌకగా అమ్మించడానికే ఈ చట్టం ఉపయోగపడుతుంది. పప్పులు, నూనెలు, కూరగాయలు తదితరాలను నిత్యావసర వస్తువుల చట్టం పరిధి నుంచి తొలగించారు. దీంతో వాటిని అక్రమంగా నిల్వ చేసుకోవడం, ధరల పెంపు తదితర అంశాలపై ప్రభుత్వానికి నియంత్రణ ఉండదు. కృత్రిమ కొరతనూ ప్రభుత్వం పట్టించుకోదు. దేశంలో సుమారు 86% మంది చిన్నసన్నకారు రైతులే కాబట్టి దూర ప్రాంతాలకు పంటలను తీసుకుళ్ళి అమ్ముకునేంత స్థోమత ఉండదు. వ్యాపారి ఎంత ధర నిర్ణయిస్తే ఆ మేరకు అమ్ముకోక తప్పదు. నాణ్యత లేదంటూ ధర తగ్గించినా రైతులు వారి గోడును ఎవ్వరికీ చెప్పుకోలేరు.