- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీళ్ల యుద్ధం.. కేసీఆర్‌ను దింపితేనే..!
దిశ, న్యూస్ బ్యూరో :
‘‘పోరాడి సాధించుకున్న తెలంగాణలో నీళ్ల కోసం మరో ఉద్యమానికి నాంది పలకాల్సిన అవశ్యం ఏర్పడింది.. నీటి వాటాల సాధనలో తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యాన్ని ఎండగట్టాల్సిన సమయం వచ్చింది.. కృష్ణా జలాల తరలింపులో ఏపీ దూకుడును అడ్డుకోలేకపోతోంది’’ అంటూ ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు మండిపడ్డాయి. కృష్ణా నదిపై దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ముక్తకంఠంతో నినదించాయి. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవికుమార్ అధ్యక్షతన హైదరాబాద్ సెంట్రల్ కోర్టు హోటల్లో ‘కృష్ణా నది – తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులు’ అనే అంశంపై గురువారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. వలసలు, కరువు, ఫ్లోరోసిస్ సమస్యలతో అల్లాడుతున్న దక్షిణ తెలంగాణ భవిష్యత్తులో ఎడారిగా మారే ప్రమాదం తప్పాలంటే పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ చేస్తున్న జల దోపిడీని అడ్డుకునేందుకు కలిసికట్టుగా సాగాలని డిమాండ్ చేశారు.
కల్వకుంట్ల కమీషన్..
రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ తెలంగాణపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నదని ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యాన్ని పెంచి, నిబంధనలకు విరుద్ధంగా రోజుకు మూడు టీఎంసీల నీటిని తరలించుకుపోయేందుకు ప్రయత్నిస్తుంటే సీఎం కేసీఆర్ ధృతరాష్ర్టుడిలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కల్వకుంట్ల కుటుంబం కాళేశ్వరం ప్రాజెక్టును కమీషన్‌ల వర ప్రదాయినిగా మార్చుకుందని ఆరోపించారు. ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలంటూ అరిచి గీపెట్టిన పెద్దలు ఇప్పుడు ప్రభుత్వంలోనే ఉన్నారని, వారంతా ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ అనే బొంతను కప్పుకొని తిరుగుతున్నారని ఆరోపించారు. ఆ బొంత తొలిగిపోతే కేసీఆర్ గతి అథోగతేనన్నారు. మొత్తం కృష్ణా బేసిన్ మీద తెలంగాణ ఎత్తిపోసింది కేవలం ఒక్క టీఎంసీ మాత్రమేనని, అటు ఏపీ సర్కార్ రోజుకు 12 టీఎంసీల నీటిని దండుకుంటోందని, కనీసం దీనిపై కేసీఆర్ నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ దిట్ట అని, తెలంగాణలో ఉన్న విద్యుత్, నీటి ప్రాజెక్టులను విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. లిఫ్ట్, ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో తెలంగాణను ఆర్థికంగా దోచుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళిక వేసుకున్నారన్నారు.
కేసీఆర్‌ను దింపితేనే ..
సీఎం కేసీఆర్‌ను దింపితే తప్ప తెలంగాణ మంచి రోజులు రావని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు ఎలా నిర్మించుకోవాలి, వాటికి సంబంధించిన టెక్నికల్ అంశాలను రాష్ట్ర సాధనకు ముందే మేధావులతో చర్చించామని, ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ జరగకపోయి ఉంటే తెలంగాణలో ఉన్న అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి అయ్యేవని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాల్లో తెలంగాణకు వచ్చిన తాత్కాలిక కేటాయింపులు 300 టీఎంసీలని, నిజమైన కేటాయింపులు తేల్చకుండానే ఏపీ సీఎం జగన్‌తో ఎలా ఏకీభవిస్తారని కోదండరాం ప్రశ్నించారు.
కృష్ణా జలాల విషయంలో సీఎంలు కేసీఆర్, జగన్‌కు రహస్య ఒప్పందం జరిగిందని మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ ఆరోపించారు. మెగా కృష్ణారెడ్డిని మధ్యవర్తిగా పెట్టుకున్నారని, మంత్రి కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి, అందుకు జగన్ సహాయాన్ని తీసుకోవడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. కమీషన్‌ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును ముందుకు తెచ్చి, తెలంగాణను దగా చేస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ కుట్రను ఛేదించడానికి అందరూ ఐక్యపోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఒప్పందం ప్రకారమే నీళ్ల డ్రామా..
ఎన్నికలకు ముందు జగన్, కేసీఆర్‌కు మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగానే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలని టీటీడీపీ అధ్యక్షుడు రమణ అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటుందని ఎన్నడూ ఊహించలేదని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు సస్యశ్యామలం అవుతుందని, వలసలు ఆగుతాయని భావించామని, కేసీఆర్ పాలనలో అంతా అన్యాయమే జరిగిందన్నారు. జల దోపిడీ చేసేందుకు ఏపీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి ఆరోపించారు.
అపెక్స్ సమావేశాలు పెట్టి ఒత్తిడి చేయాల్సిన ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. దక్షిణ తెలంగాణను ఆంధ్ర గుత్తేదారులకు కట్టబెట్టిందని సీనియర్ జర్నలిస్టు పాశం యాదిగిరి అన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును నిలుపుదల చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాం ప్రసాద్ రెడ్డి అభిప్రాయపడ్డారు. డబ్బులు దండుకోవడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టును ముందుకు తెచ్చారని రిటైర్డ్ ఇంజినీర్ లక్ష్మీనారాయణ ఆరోపించారు. రూ.28 వేల కోట్లతో పూర్తయ్యే కాళేశ్వరం ప్రాజెక్టును రూ.లక్షా 20 కోట్లకు పెంచారని, కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ల విషయంలో కొందరు రిటైర్డ్ ఇంజినీర్లు సర్కార్‌కు వత్తాసు పలుకుతున్నారని దుయ్యబట్టారు.
రిటైర్డ్ ఇంజినీర్ల మధ్య వాగ్వాదం..
తెలంగాణ జర్నలిస్టు ఫోరం అఖిలపక్ష భేటీలో రిటైర్డ్ ఇంజినీర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. శ్యాంప్రసాద్‌రెడ్డి, లక్ష్మీనారాయణ మధ్య మాటల యుద్ధం చెలరేగింది. డీపీఆర్‌ల పేరుతో కొందరు ఇంజినీర్లు రూ.కోట్లు సంపాదించుకుంటున్నారన్నారని, వాస్తవాలను ప్రజలకు తెలియకుండా చేస్తున్నారన్నారని, సీఎం కేసీఆర్‌కు తొత్తుగా మారుతున్నారని లక్ష్మీనారాయణ విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై శ్యాంప్రసాద్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్యాంప్రసాద్‌రెడ్డి అడ్డుతగలడంపై మిగతా ఇంజినీర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ఇంజినీర్ల కంటే కంప్యూటర్ ఆపరేటర్‌కే విలువ ఇస్తారంటూ గతంలో చాలాసార్లు శ్యాం ప్రసాద్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అనడం విశ్లేషణకు దారి తీసింది. శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కింద పది లక్షల ఎకరాలకు మించి సాగు కాదంటూ చెప్పారు. ప్రభుత్వం కాళేశ్వరం కింద 18 లక్షలు, ఇంకా ఎక్కువ అంటూ చెప్పుతున్న నేపథ్యంలో శ్యాంప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి.