పోడు భూముల కోసం పోరాటం.. మేము సైతం అంటోన్న అఖిలపక్షం

by Ramesh Goud |   ( Updated:2021-08-17 07:19:55.0  )
పోడు భూముల కోసం పోరాటం.. మేము సైతం అంటోన్న అఖిలపక్షం
X

దిశ, ఖైరతాబాద్: పోడు భూముల సమస్య పరిష్కారానికి సమిష్టి పోరాటాలు నిర్వహించాలని అఖిలపక్ష సమావేశంలో తీర్మానించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అధ్యక్షతన పోడు రైతు- భూమి హక్కుల సాధన అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీడీపీ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లు రవి, రైతు వ్యవసాయ సంఘం నాయకులు మల్లారెడ్డి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్కలతో పాటు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పోడు సాగు చేసుకుంటున్న రైతులను అటవీశాఖ అధికారులు తీవ్రంగా వేధిస్తున్నారని అన్నారు. అమాయకులైన గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. దళిత గిరిజనుల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. ఎస్టీ సబ్‌ప్లాన్ కింద కేటాయించే నిధులు ఒక్క రూపాయి కూడా ముఖ్యమంత్రి ఖర్చు చేయలేదని.. పోడు భూములను నమ్ముకొని జీవనం సాగిస్తున్న వారిపట్ల ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆడ వారిని సైతం చూడకుండా జైల్లో పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటికీ వ్యతిరేకంగా భారీ ఉద్యమానికి సిద్ధం కావాల్సిన అవసరం ఏర్పడిందని అఖిలపక్షం ఏకతాటిపైకి వచ్చింది. ఇందులో భాగంగా భద్రాచలం నుంచి మహాదేవపూర్ వరకు భారీ రోడ్ షో నిర్వహించాలని నిర్ణయించారు.

Advertisement

Next Story

Most Viewed