హుజురాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆయనేనా?

by Anukaran |   ( Updated:2021-07-27 00:46:16.0  )
హుజురాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి  ఆయనేనా?
X

దిశ, కమలాపూర్: హుజురాబాద్ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్ గులాబీ జెండాను హుజురాబాద్ ఉప ఎన్నికలో ఎగురవేసే దిశగా చూస్తున్నారు. ఆ దిశలో భాగంగా కేసీఆర్ ఆది నుండి టిక్కెట్ల కేటాయింపుపై ఎంతోమంది లీడర్లను ఫిల్టర్ చేస్తూ.. తన సొంత మీడియా సర్వే బృందాలతో రేసులో ఉన్న నాయకుల జాబితాను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. తాజాగా సర్వే లతోపాటు ఇంటెలిజెన్స్ రిపోర్టులతో భిన్నంగా కొంతమంది కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. అందులో ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుండి నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన పాడి కౌశిక్ రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు జెల్లీ శ్రీనివాస్ యాదవ్ పేర్లు మొన్నటివరకు ప్రముఖంగా వినిపించాయి.

అయితే ఇప్పుడు వాటికి భిన్నంగా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన బడా పారిశ్రామిక వేత్త స్వర్గం రవికి టికెట్ కేటాయించే దిశగా సీఎం కేసీఆర్ సమాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. క్లీన్ ఇమేజ్ ఉన్న స్వర్గం రవి గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ కష్టకాలం నుండి పార్టీని ఆదుకుంటూ తన క్యాడర్‌ను పెంచుకోవడంతో పాటు నియోజకవర్గ ప్రజల మంచి, చెడులకు అందుబాటులో ఉన్న నేతగా పేరుంది. .నియోజకవర్గంలో ఉన్న బీసీ అత్యధిక ఓట్లతో పాటు మంచి పేరున్న నాయకునికి టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్న ఆలోచనతో సీఎం కేసీఆర్ స్వర్గం రవికి టికెట్ కేటాయించేందుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రముఖంగా నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.

కాగా ఇటీవలే స్వర్గం రవి సీఎం కేసీఆర్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. టికెట్ కేటాయిస్తే పోటీలో నిలబడి గెలుపు దిశగా ప్రయత్నిస్తానని చెప్పినట్లు సమాచారం. మొన్నటివరకు టీఆర్ఎస్ ఉపఎన్నికల లిస్టులో ఎంతోమంది పేర్లు ఉన్నప్పటికీ.. ఇప్పుడు తాజాగా స్వర్గం రవి పేరు తెరపైకి వస్తుండడంతో.. జాబితాలో ఉన్న లిస్ట్ అంతా తలకిందులైంది. స్వర్గంకు టీఆర్ఎస్ అధిష్టానం టిక్కెట్ కేటాయింపు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు, ఆ దిశగా పావులు కదుపుతున్నయని టీఆర్ఎస్ నాయకుల నుండి ప్రముఖంగా వినిపిస్తోంది. టికెట్ కేటాయిస్తే టీఆర్‌ఎస్‌లో చేరేందుకు స్వర్గం రవి సిద్ధంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.

యువరాజుకు కలిసొచ్చిన ‘సెంటిమెంట్’

Advertisement

Next Story

Most Viewed