ఊరూరా.. కరో'నాకా బందీ'

by Sridhar Babu |   ( Updated:2020-03-25 07:09:15.0  )
ఊరూరా.. కరోనాకా బందీ
X

దిశ, కరీంనగర్: తెలంగాణ వ్యాప్తంగా ఒకే కట్టు ఏర్పడింది. అత్యంత ప్రమాదకరమైన కరోనా వ్యాధి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కలవరపెడుతుండటంతో తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాలు నాకా బందీ చేసుకున్నాయి. స్వీయ నిర్బంధంలో ఉండాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించడమే తరువాయి పల్లెల దారులన్నీ మూసుకుపోయాయి. ఊరూరు స్వీయ నిర్భందానికి ముందుకు రావడానికి అనాదిగా వస్తున్న ఆచారమే వీరికి ఆదర్శంగా నిలిచింది.

అనాది ఆచారం అమలైన వేళ..

ప్రతి నాలుగేళ్లకోసారి తెలంగాణ పల్లెల్లో అనాదిగా ఓ ఆచారం కొనసాగుతోంది. ఉరు కట్టు అని పిలిచే ఈ ఆనవాయితి ప్రకారం మూడ్రోజుల పాటు కొనసాగుతుంటుంది. గ్రామ దేవతలను కొలిచే ఈ ఆచారం సందర్భంగా ఆ గ్రామానికి చెందిన వారు ఎక్కడ స్థిరపడ్డా స్వగ్రామాలకు చేరుకుంటారు. గ్రామ బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గ్రామం నడిబొడ్డున ఏర్పాటు చేసే బొడ్రాయి వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు గ్రామస్తులంతా కలిసి డబ్బులు జమ చేసుకుని ఊరు కట్టు ఘనంగా నిర్వహిస్తారు. మూడో రోజున గ్రామ పొలిమేరల చుట్టూ కట్టు వేస్తారు. ఊరు కట్టు వేసిన రోజున మాత్రం వేరే గ్రామాల వారు తమ గ్రామాల్లోకి రాకుండా, తమ గ్రామానికి చెందిన వారు వేరే గ్రామానికి వెళ్లకుండా నిలిపివేసేందుకు పొలిమేరల్లోనే అన్ని రహదారులను మూసేస్తారు. ఆ రోజు ఊరు చుట్టూ కట్టడి చేసే ప్రక్రియను నిర్వహిస్తారు. ఈ విధానాన్ని పూర్వ కాలం నుంచి తెలంగాణ పల్లెల్లో చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామంలోకి దుష్ట శక్తులు రాకుండా కట్టు వేయడంతో పాటు, గ్రామ దేవతలను పూజించే పద్ధతిని కొనసాగిస్తున్నారు. జంతు బలులు కూడా ఇచ్చే సంప్రదాయం ఉంటుంది.

ఆర్టీసీ బస్సులూ రావు..

ఊరు కట్టు వేసే రోజున ఆర్టీసీ బస్సులనూ గ్రామాల్లోకి పంపొద్దని ముందస్తుగానే అధికారులకు సమచారమిస్తారు. దాంతో పాటు గ్రామానికి సంబంధించని వారెవరూ కూడా తమ ఊర్లోకి రావద్దంటూ దండోరా కూడా వేయిస్తారు. ఇప్పటికీ తెలంగాణా రాష్ట్రంలోని చాలా పల్లెల్లో ఈ ఆనవాయితీ సాగుతోంది. గ్రామస్తులు అత్యంత ప్రాధాన్యతగా భావించే ఊరు కట్టే నేటి కరోనా నియంత్రణకు గ్రామాలకు మధ్య ఉన్న సంబంధాలను తాత్కాలికంగా నిలిపివేసేందుకు కారణమైందని చెప్పాలి. అయితే, ప్రపంచమే వణికిపోతోన్న కరోనా మహమ్మారిని పల్లెల్లో రాకుండా చేసేందుకు ఊరు కట్టే ఉపయోగపడిందనీ, ఆ సంప్రదాయం వల్లే పొలిమేరల్లో రాస్తా బంద్ చేస్తున్నారని గ్రామాల్లో పెద్దలు చర్చించుకుంటున్నారు. ఊరు కట్టును ఆదర్శంగా తీసుకున్న పల్లెలన్నీ నేడు కరోనా కట్టడి కోసం నిర్బంధంలోకి వెళ్లాయి. కరోనా మహమ్మారి కట్టడికి తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలు స్వచ్ఛందంగా నిర్బంధంలోకి వెళ్లడం మంచిదేననీ, ఈ నిశ్శబ్ద వాతావరణం కొనసాగాలని అధికారులు చెబుతున్నారు.

tags: oru kattu tradition, telangana rural areas, coronavirus(covid-19)

Advertisement

Next Story

Most Viewed