ఉల్లిగడ్డతో..ఉలిక్కిపడుతున్న అమెరికా!

by Harish |
ఉల్లిగడ్డతో..ఉలిక్కిపడుతున్న అమెరికా!
X

మొన్నటికి మొన్న చైనా నుంచి వస్తున్న గుర్తుతెలియని గింజలను చూసి అమెరికా భయపడుతోందని తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు కొత్తగా ఉల్లిగడ్డను చూసి కూడా అమెరికా, కెనడా దేశాలు భయపడుతున్నాయి. కరోనా వైరస్ దెబ్బకు అగ్రరాజ్యానికైనా ఆరోగ్యమే ముఖ్యమని ఒక హితబోధ కలిగింది. అందుకే ఏ చిన్న వ్యాధి నలుగురికి మించి పాకినా దాని గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కట్టడి చేయడానికి ప్రపంచదేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు అమెరికా, కెనడాల్లో సాల్మొనెల్లోసిస్ అనే జబ్బు తీవ్రంగా వ్యాపిస్తోంది. దానికి కారణం కాలిఫోర్నియాకు చెందిన థామ్సన్ ఇంటర్నేషనల్ వారి ఉల్లిగడ్డలు అని విచారణలో తేలింది. దీంతో ఆ ఉల్లిగడ్డలు తినొద్దని ప్రజలను అప్రమత్తం చేసింది.

జంతువులలో ఉండే సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఈ ఉల్లిగడ్డల ద్వారా మనుషుల్లో ప్రవేశించి పేగుల్లో సమస్యలు సృష్టిస్తోంది. దీని వల్ల కడుపు నొప్పి, డయేరియా, జ్వరం, వాంతులు, మలంలో రక్తం వంటి జబ్బులు వస్తున్నాయి. ఐదేండ్లలోపు చిన్నారులను, 65 ఏండ్లుదాటిన వృద్ధులను ఈ బ్యాక్టీరియా టార్గెట్ చేస్తుంది. కలుషిత నీరు, ఆహారం ద్వారా ఈ బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు ఆగస్టు 1, 2020న విడుదల చేసిన నివేదిక ప్రకారం మే 1 నుంచి థామ్సన్ ఇంటర్నేషనల్ వారు పంపిణీ చేసిన ఎరుపు, పసుపు, తెలుపు ఉల్లిగడ్డల్లో ఈ బ్యాక్టీరియా ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 6 నాటికి అమెరికాలోని 43 దేశాల్లో 640 సాల్మోనెల్లోసిస్ కేసులు బయటపడ్డాయి. అయితే, ఇప్పటివరకు ఎలాంటి మరణాలు సంభవించలేదు. దీన్ని బట్టి దాదాపు అమెరికా సంయుక్త రాష్ట్రాలన్నింటికీ ఈ ఉల్లిగడ్డలు చేరుకుని ఉంటాయని భావించి, కొద్దిరోజుల పాటు ఎలాంటి ఉల్లిగడ్డలను అమ్మడం కానీ, తినడం కానీ, చేయొద్దని వివిధ రాష్ట్రాల్లో ఆదేశాలు జారీ అయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed