‘దేశమంతటికీ ఒకే ధర’ వర్తించదా : కేంద్రంపై దీదీ ఆగ్రహం

by Shamantha N |
‘దేశమంతటికీ ఒకే ధర’ వర్తించదా : కేంద్రంపై దీదీ ఆగ్రహం
X

కోల్‌కతా : ‘ఒకే దేశం-ఒకే పన్ను’ అంటూ జీఎస్టీ తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ధరలపై మాత్రం వివక్ష ఎందుకు చూపుతుందంటూ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ దీనిపై కేంద్రాన్ని ప్రశ్నించగా.. ఇదే విషయమై గురువారం పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. దేశంలో వ్యాక్సిన్ ధరను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకే ధరకు అందజేయాలని ఆమె సూచించారు. ధ్వంధ్వ విధానాలు పాటిస్తున్న కేంద్ర సర్కారుపై ఆమె మండిపడ్డారు. బుధవారం సీరం ఇనిస్టిట్యూట్ కొవిషిల్డ్ ధరలు ప్రకటించిన అనంతరం ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించారు.

‘బీజేపీ నాయకులు నోరెత్తితే ఒకే దేశం.. ఒకే పార్టీ.. ఒకడే నాయకుడు.. అంటూ గోల చేస్తారు. కానీ ప్రజలను రక్షించాల్సి వచ్చినప్పుడు మాత్రం అందరికీ ఒకే ధరను నిర్ణయించరు’ అని ఆమె మండిపడ్డారు. వయసుతో నిమిత్తం లేకుండా కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయాలని ఆమె సూచించారు. ‘ధరలను కేంద్రం చెల్లిస్తుందా..? రాష్ట్రం చెల్లిస్తుందా..? అనేది వేరే విషయం. కానీ కేంద్ర, రాష్ట్రాలకు ఒకే ధరను ఫిక్స్ చేయాలి’ అని ఆమె ట్వీట్ చేశారు.

ప్లేయర్‌ను కాదు.. కానీ ఆడటం బాగా తెలుసు..

తాను ప్లేయర్‌ను కాదని కానీ ఆట ఎలా ఆడాలో తనకు బాగా తెలుసునని దీదీ అన్నారు. ఏడో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా దక్షిణ దినాజ్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న బెంగాల్ సీఎం మాట్లాడుతూ.. ‘నేను ప్లేయర్‌ను కాదు. కానీ ఆట ఎలా ఆడాలో తెలుసు. గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో నేను మంచి ప్రదర్శన చేశాను. మేం బెంగాల్‌ను ఢిల్లీ నుంచి వచ్చే ఇద్దరు గూండాల చేతిలో పెట్టబోం’ అని ఘాటు కామెంట్స్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed