ఈ నెల 20న సీఎం జగన్‌తో సినీ ప్రముఖులు భేటీ

by srinivas |
ఈ నెల 20న సీఎం జగన్‌తో సినీ ప్రముఖులు భేటీ
X

దిశ, ఏపీ బ్యూరో: ఈ నెల 20న మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని చిత్రపరిశ్రమ బృందం ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో భేటీ కానుంది. హీరో నాగార్జున, నిర్మాతలు దిల్‌ రాజు, దగ్గుబాటి సురేశ్‌బాబుతో పాటు మరికొందరు సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు సీఎం జగన్‌తో భేటీ కానున్నారు. కరోనా కష్టకాలంలో టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లాలని భావించింది. ఈ విషయాన్ని సమాచార శాఖ మంత్రి పేర్ని నానికి మెగాస్టార్ చిరంజీవి ఫోన్‌లో తెలిపారు. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై విన్నవించుకునేందుకు చిరంజీవి నేతృత్వంలోని సినీ పరిశ్రమ పెద్దలు అపాయింట్మెంట్ కోరుతున్నారని మంత్రి పేర్ని నాని.. సీఎం జగన్‌కు తెలియజేశారు.

ఈ నెల 20వ తేదీన చిత్ర పరిశ్రమ నేతలను ఆహ్వానించాలని మంత్రి పేర్ని నానికి సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవికి పేర్ని నాని తెలియజేశారు. కొత్త సినిమాలకు బెనిఫిట్‌ షోలకు అవకాశం ఇవ్వడం.. నగరాలు, పట్టణాల్లో రోజుకు నాలుగు షోలు ప్రదర్శించే వెసులుబాటు.. అలాగే గ్రేడ్‌-2 కేంద్రాల్లో నేలటిక్కెట్టుకు పది రూపాయలు.. కుర్చీకి 20 రూపాయలు వసూలు చేసే విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సీఎం జగన్‌ను కోరనున్నారు. ఇదిలా ఉంటే టికెట్ల విక్రయాన్ని నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని, అందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. ఈ అంశంపైనా సినీ పెద్దలు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా సమయంలో చిరంజీవి నేతృత్వంలోని ప్రముఖులు సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. అయితే ఆ సమావేశానికి బాలకృష్ణ హాజరుకాలేదు. అయితే ఈ భేటీకి బాలకృష్ణ హాజరవుతారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed