అవినీతి ఎఫ్ఆర్వోకు అధికారుల అండ‌..?

by Shyam |   ( Updated:2021-08-13 06:07:50.0  )
అవినీతి ఎఫ్ఆర్వోకు అధికారుల అండ‌..?
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్: అవినీతికి పాల్ప‌డి సాక్ష్యాధారాల‌తో స‌హా దొరికిన‌ మ‌హ‌బూబాబాద్ జిల్లా గూడూరు ఎఫ్ఆర్వోను ఉన్న‌తాధికారులు కాపాడే ప్ర‌య‌త్నం చేస్తున్నారా..? నిధుల స్వాహా వ్య‌వ‌హారాన్ని అధికారులు కొత్త మ‌లుపు తిప్పుతున్నారా..? విచార‌ణ‌నే మార్గంగా ఎంచుకున్నారా..? సెక్ష‌న్ అధికారుల‌ను వేధించి, బెదిరించి రాసిచ్చిన లేఖ‌ల‌పై సంత‌కాలు చేయించి టాస్క్‌ఫోర్స్ అధికారులకు అంద‌జేశారా..? అంటే ఈ ప్ర‌శ్న‌లన్నింటికి అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. గూడురు ఫారెస్ట్ రేంజ్ అధికారిని ప‌ర్సంటేజీల వ్య‌వ‌హారంలో ఉన్న‌తాధికారులు ఆమెకు కొమ్ముకాసే ప్ర‌య‌త్నం జరుగుతున్నట్లు సొంత శాఖ‌లోనే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

ఇదీ జ‌రిగింది..!

గూడూరు అట‌వీశాఖ‌ రేంజ్ ప‌రిధిలో హ‌రిత‌హారం ప‌థ‌కం అమ‌లుకు రూ.45 ల‌క్ష‌లను రాష్ట్ర‌ ప్ర‌భుత్వం మంజూరు చేసింది. అయితే ఈ మొత్తం నిధుల్లో గూడూరు ఎఫ్ఆర్వో 15శాతం నిధుల‌ను త‌న ప‌ర్సంటేజీగా క‌ట్ చేసుకుని 85శాతం నిధుల‌ను మాత్ర‌మే ఆరుగురు సెక్ష‌న్ అధికారుల ఖాతాల‌కు బ‌దిలీ చేశారు. ఈ అక్రమాన్ని దిశ ప‌త్రిక సాక్ష్యాధారాల‌తో స‌హా ఇటీవ‌ల వెలుగులోకి తీసుకువ‌చ్చింది. దిశ వ‌రుస క‌థ‌నాల‌తో స్పందించిన ఉన్న‌తాధికారులు విచార‌ణ‌కు ఆదేశించారు. ఫారెస్ట్ టాస్క్‌ఫోర్స్ అధికారుల బృందం గూడూరు రేంజ్ అధికారి, సెక్ష‌న్ అధికారుల‌ బ్యాంకు ఖాతాల‌ను ప‌రిశీలించారు. దిశ ముందే చెప్పిన‌ట్లుగానే ఆరుగురు సెక్ష‌న్ అధికారుల బ్యాంకు ఖాతాలకు 85 శాతం నిధులు మాత్ర‌మే బ‌దిలీ అయిన‌ట్లుగా గుర్తించారు. గూడూరు ఫారెస్ట్ కార్యాల‌యంలో రికార్డుల త‌నిఖీ, బ్యాంకు ఖాతాల ప‌రిశీల‌న చేప‌ట్టిన టాస్క్‌ఫోర్స్ అధికారులు నిధులు గోల్‌మాల్ జ‌రిగిన‌ట్లుగా ప్రాథ‌మికంగా నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.

కొత్త నాట‌కం… అధికారుల ఊతం..

ఎఫ్ఆర్వో చేసిన అక్ర‌మం విచార‌ణ అధికారుల క‌ళ్ల‌కు సాక్ష్యాత్క‌రిస్తున్నా…క‌ప్పిపుచ్చే య‌త్నాలు కొన‌సాగాయి. ఎఫ్ఆర్వో అవినీతి నిజ‌మ‌ని నిర్ధార‌ణ అయితే శాఖ ప‌రువుపోతుంద‌నో.. ఇంకా మ‌రిన్ని విష‌యాలు వెలుగులోకి వ‌స్తాయ‌న్న భ‌యాందోళ‌నో తెలియ‌దు గాని.. ఈ విష‌యాన్ని క‌ప్పి పుచ్చేందుకు కొత్త నాట‌కం మొద‌లుపెడుతున్న‌ట్లుగా తెలుస్తోంది. 15 శాతం నిధులు ఎఫ్ఆర్వో త‌మ‌కు చేతిగుండా అంద‌జేశార‌ని విచార‌ణ అధికారుల ఎదుట చెప్పించిన‌ట్లుగా స‌మాచారం. ఈ విష‌యంపై సెక్ష‌న్ అధికారులు సంత‌కాలు చేసిన లేఖ‌ల‌ను కూడా విచార‌ణ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికార ప్ర‌యోగం, భ‌య‌భ్రాంతులే వారి చేత అలా విచార‌ణ అధికారుల ఎదుట‌ స‌మాధానం చెప్పేలా చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో సెక్ష‌న్ అధికారుల‌కు పైస్థాయి అధికారిగా ఉన్న ఒక‌రు ఎఫ్ ఆర్వోకు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. 15శాతం నిధుల‌ను ఎఫ్ఆర్వో త‌మ‌కు చేతి ద్వారా అంద‌జేసిన‌ట్లుగా ఆ అధికారి రాసిచ్చిన ఓ ప‌త్రంపై సెక్ష‌న్ అధికారులు సంత‌కాలు చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం కావాలి..

ప్ర‌భుత్వ ఆర్థిక‌శాఖ నిబంధ‌న‌ల ప్ర‌కారం.. ఏ శాఖ‌లోనైనా చిన్న మొత్తాలకు మిన‌హాయింపు ఉన్నా, పెద్ద మొత్తాల చెల్లింపులు ఖ‌చ్చితంగా బ్యాంకు ద్వారానే జ‌ర‌గాలి. కానీ ల‌క్ష‌ల మొత్తాన్ని కూడా ఎఫ్ఆర్వో సెక్ష‌న్ అధికారుల‌కు నిబంధ‌న‌ల‌ను విరుద్ధంగా ఎలా చేతికి అంద‌జేస్తారు..? ఈ మొత్తాల‌ను రికార్డుల్లో కూడా చేర్చ‌లేద‌ని స‌మాచారం. అవినీతికి పాల్ప‌డిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు వ‌స్తున్న అనుమానాల‌కు బ‌లం చేకూర్చే అంశం కాదా..? అస‌లు అధికారిణి సెక్ష‌న్ అధికారుల‌కు ఎందుకు చేతిగుండా న‌గ‌దు మొత్తాల‌ను అంద‌జేయాల్సి వ‌చ్చింది..? జిల్లా అధికారి ప‌రిశీల‌న‌లో ఈ అంశం ఉందా..? టాస్క్‌ఫోర్స్ అధికారులు ఎందుకు ఈ కోణంలో అధికారిని విచారించ‌లేదు..? ఉన్న‌తాధికారుల‌కు నివేదిక చేరి రోజులు గ‌డుస్తున్నా.. చ‌ర్య‌లుగాని, విచార‌ణ‌లో ఏం తేల్చార‌న్న విష‌యాన్ని బ‌హిర్గ‌తం చేయ‌క‌పోవ‌డ‌మేంటి..? అన్న ప్ర‌శ్న‌లు జ‌నం మ‌దిలో నుంచి మెదులుతున్నాయి. ఈ ప్ర‌శ్న‌ల‌కు అట‌వీశాఖ ఉన్న‌తాధికారులు స‌మాధానమిస్తారా..? దాట వేస్తారో అన్న విష‌యం వేచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed