కేటీఆర్ ఇలాకాలో విచిత్రం.. PM మోడీకే షాకిచ్చిన అధికారులు.. జోరుగా చర్చ.!

by Anukaran |
కేటీఆర్ ఇలాకాలో విచిత్రం.. PM మోడీకే షాకిచ్చిన అధికారులు.. జోరుగా చర్చ.!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : రికార్డులు క్రియేట్ చేయడంలో వారికి వారే తోపులా.. లేక నిర్లక్ష్యంగా వ్యవహరించారో తెలియదు కానీ ఏకంగా చనిపోయిన వారికి కూడా కొవిడ్ వ్యాక్సినేషన్ చేయడం విచిత్రంగా ఉంది. మొదటి డోసు తీసుకున్న తరువాత ఏకంగా మరణించిన వ్యక్తులకు రెండో డోసు టీకా వేసేశామంటూ నివేదికలు తయారు చేసుకున్నారు. సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

వివరాల ప్రకారం.. కోనరావుపేట మండలంలోని నిజామాబాద్‌కు చెందిన ఒకరికి, బోయినపల్లి మండలానికి చెందిన మరొకరికి సెకండ్ డోసు వేసినట్టుగా వైద్యారోగ్య శాఖ యంత్రాంగం రికార్డులు క్రియేట్ చేసేశారు. ఇంతకీ చనిపోయిన వ్యక్తికి టీకా ఎలా వేశారు అన్నదే ఇక్కడ మిస్టరీగా మారిపోయింది. టార్గెట్ పూర్తి చేయడంలో తొందరపాటు చర్యలకు పాల్పడ్డారా.? లేక వేగంగా దూసుకుపోతున్నామని చూపేందుకు ఇలా వ్యవహరించారో అంతు చిక్కడం లేదు. కానీ, వైద్యారోగ్య శాఖ అధికారులు మాత్రం చనిపోయిన వారికి టీకాలు ఇచ్చామని చెప్పుకుంటుండటం మాత్రం విమర్శలకు దారి తీస్తోంది. అయితే, తమ సిబ్బంది సర్వే చేస్తున్న క్రమంలో ఇంట్లో ఉన్న వారందరూ సెకండ్ డోసు తీసుకున్నారా.? అని ఆరా తీసినప్పుడు కుటుంబ సభ్యులు అవునన్న సమాధానం ఇవ్వడంతో తమ సిబ్బంది రికార్డుల్లో ఇలా నమోదు చేసి ఉంటారని సిరిసిల్ల జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నట్టు ప్రచారంలో ఉంది.

వాస్తవంగా టీకా వేసిన వెంటనే వైద్య, ఆరోగ్య సిబ్బంది తమ వద్ద ఉన్న రిజిస్టర్లలో వారి వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా టీకా వేసిన తరువాత మొబైల్ నెంబర్‌కు కూడా సమాచారం ఇస్తుంటారు. క్షేత్ర స్థాయిలో సిబ్బంది టీకా ఇచ్చినప్పుడు వారి వివరాలను ఎందుకు సేకరించలేదు అన్నది అంతు చిక్కకుండా పోయింది. సర్వే చేసినప్పుడు కూడా తమ వద్ద ఉన్న రికార్డులను ఆధారంగా చేసుకొని ఆరా తీయకుండా కుటుంబంలో ఉన్న వారంతా టీకా తీసుకున్నారా.? అని అడిగి రికార్డుల్లో పేరు, వివరాలు నమోదు చేసుకోవడం విస్మయానికి గురి చేస్తోంది. ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్ కట్టడి కోసం ప్రతీ ఒక్కరికీ టీకా వేయాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అవసరమైనంత మేర వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తోంది. అయితే, వాటిని ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో అధికారులు ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నది అర్థం కాకుండా పోయింది.

ఇంకా ఉన్నాయా..?

సిరిసిల్ల జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఒకటి, రెండు ఘటనలేనా లేక మరిన్ని వెలుగులోకి వస్తాయా అన్న చర్చ సాగుతోంది. టీకా పంపిణీ జరిపామని అధికారులు చేతులు దులుపుకునేందుకు కావాలనే ఇలా చేశారా.? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని విషయాలు తేలాలంటే సమగ్రంగా ఆరా తీయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం గురించి సిరిసిల్ల జిల్లా వైద్యాధికారిని వివరణ కోరేందుకు ‘‘దిశ’’ ప్రయత్నించగా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.

Advertisement

Next Story

Most Viewed