- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నడిచే చోట పూల మొక్కలు.. వారికి దారేది ?
దిశ ప్రతినిధి, మెదక్ : సిద్దిపేట పట్టణంలో అధికారుల ఇష్టా రాజ్యం నడుస్తోంది. ఫుట్ పాత్‌లపై ఎలాంటి వ్యాపారాలు చేసుకోవద్దన్న అధికారులే. హరితహారం కార్యక్రమంలో భాగంగా కుండీలలో పూల మొక్కలు పెట్టారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాదాచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్ పాత్‌లపై ఎలాంటివి పెట్టకూడదన్న అధికారులు ఇప్పుడు ఎలా పూల మొక్కలు పెట్టారంటూ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఫుట్ పాత్‌లపై పూల మొక్కలు పెట్టడంతో రోడ్డుపైనే నడవాల్సి వస్తోందని, ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనని భయంగా ఉందని పాదాచారులు ఆందోళన చెందుతున్నారు.
పాదాచారులకు దారేది …. ?
ఇరుకైన సందులకు సిద్దిపేట పట్టణం ప్రసిద్ధి గాంచింది. సిద్దిపేట పట్టణంలోని 43 వార్డులలో ఏ గల్లీకి వెళ్లిన ఇరుకైన సందులే దర్శనమిస్తాయి. చివరకు బస్టాండ్ ఆవరణలోని ప్రధాన రహదారులు సైతం ఇరుకుగానే ఉంటాయి. ఇరుకైన సందుల్లో పెద్ద వాహనం వస్తే చిన్న వాహనం వెళ్లడం గగనం. అలాంటిది పాదాచారులకు నడవడానికి స్థలమే ఉండదు. దీన్ని గుర్తించిన మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాదాచారుల కోసం సిద్దిపేట బస్టాండ్ నుండి మెదక్, హైద్రాబాద్, కరీంనగర్ రోడ్డులలో ఫుట్ పాత్‌లు నిర్మించారు. అయితే ఫుట్ పాత్‌లపై ప్రజలెవరూ నడిచే పరిస్థితి కనిపించడం లేదు. చాలా మంది షాపు యజమానులు ఫుట్ పాత్‌లపైనే బైకు పార్క్ చేసుకోవడం, పలు షాపుల వారు వ్యాపారం చేసుకోవడంతో పాదాచారులకు నడవానికి మళ్లీ రోడ్డే దిక్కైంది.
ఫుట్ పాత్‌లపై పూల మొక్కలా…..
సిద్దిపేట పట్టణ ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత నిస్తూ చెట్లు నాటడం మంచిదే అయినా.. ప్రణాళిక బద్దంగా నాటక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫుట్ పాత్‌లపై పూల మొక్కలు రోడ్డుకు అందాన్నిస్తున్నా పట్టణ ప్రజలకు మాత్రం ఇబ్బందిని కలిగిస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ సమయం ముగిసిన కొద్ది రోజులకు సిద్దిపేట పట్టణం మెదక్ రోడ్డులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద కొంత మంది రైతులు ఫుట్ పాత్‌లపై కూరగాయలు అమ్ముకుంటున్నారు. వారి వద్దకు వచ్చిన మున్సిపల్ అధికారులు రైతులతో మాట్లాడకుండానే వారి కూరగాయలు రోడ్డుపై పారేశారు. ఇలా ఎందుకు పారేస్తున్నారని రైతులు, అధికారులను ప్రశ్నించగా.. ఫుట్ పాత్‌లపై ఎలాంటి వ్యాపారాలు చేయొద్దు … ఇవి కేవలం నడిచి వెళ్లేందుకు ఏర్పాటు చేశామని చెప్పారు. అలాంటి అధికారులు ఇప్పుడు ఫుట్ పాత్‌లపై స్వయంగా పూల మొక్కలు ఏర్పాటు చేయడంపై సామాన్య ప్రజలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సిద్దిపేట పట్టణం హైద్రాబాద్ రోడ్డులోని బావిసఖాన్ పూల్ వద్ద రోడ్డు మరీ ఇరుక్కుగా ఉంటుంది. రాష్ట్ర రాజధానికి వెళ్లే వారంత ఈ మార్గం గుండానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అంతటి రద్దీ గల ప్రాంతంలో పాదాచారులు తప్పకుండా ఫుట్ పాత్‌పైనే వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి చోట పూల మొక్కలు ఏర్పాటు చేయడంతో పాదాచారులు రోడ్డుపైనే నడిచి వెళ్తున్నారు.
పొంచిఉన్న ప్రమాదం …
సిద్దిపేట పట్టణ అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసిన ఫుట్ పాత్‌లు పాదాచారులకు నిరుపయోగంగా మారుతున్నాయి. ఫలితంగా పట్టణ ప్రజలు, సిద్దిపేటకు వచ్చి వెళ్లే పాదాచారులు ఫుట్ పాత్‌లపై కాకుండా రోడ్డుపైనే నడుచుకుంటూ వెళ్తున్నారు. నిత్యం ట్రాఫిక్ రద్దీ ఉండే ప్రాంతంలో రోడ్డపై నడిచి వెళ్లడం ఇబ్బందిగా ఉందని, ఎప్పుడు ఏం ప్రమాదం సంభవిస్తోందని భయాందోళన చెందుతున్నారు. వృద్ధులైతే రోడ్డుపై వెళ్లాలంటే మరింత ఇబ్బంది పడుతున్నారు. దీనిపై మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే పూల మొక్కలను వేరే స్థానానికి బదిలీ చేసి, ఫుట్ పాత్‌లపై ఎలాంటి వ్యాపారం లేకుండా చూడాలని పలువురు పాదాచారులు కోరుతున్నారు.