విద్యార్థులకు శుభవార్త

by Shyam |
విద్యార్థులకు శుభవార్త
X

దిశ, రంగారెడ్డి: కొవిడ్-19తో సర్వం స్తంభించింది. అందులో భాగంగానే వేసవి కంటే ముందుగానే విద్యాసంస్థలు సెలవులు ప్రకటించాయి. దీంతో వార్షిక పరీక్షలు నిలిచిపోయాయి. అయితే ఈ కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని 1 నుంచి 9 వ తరగతుల విద్యార్థులను బేషరతుగా పై తరగతులకు ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిపోయిన 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తోన్నది.

8 లక్షల విద్యార్థులు ప్రమోట్…

1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ఉంటాయా..? ఉండవా అనే అనుమానం విద్యార్థులకు ఉండేది. ఆ అనుమానానికి తెలంగాణ విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవోను అన్ని యాజమాన్యాల పరిధిలో నడుస్తున్న పాఠశాలలకు వర్తించనుంది. ఎలాంటి పరీక్షలు లేకుండా ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులందర్నీ పై తరగతులకు ప్రమోట్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దాంతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని సుమారుగా 8 లక్షల విద్యార్థులు ప్రమోట్ కానున్నారు. విద్యాశాఖ ఉత్తర్వులతో తల్లిదండ్రులు, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం రెండు జిల్లాల పరిధిలో ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో 4539 పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలో 1 నుంచి 9 తరగతి వరకు 8 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరందరినీ పాఠశాలలు తెరిచిన వెంటనే పై తరగతికి పంపించనున్నారు.

మిగిలిన పరీక్షలకు ఏర్పాట్లు…

పదో తరగతి విద్యార్థులకు ప్రతి ఏడాది మార్చిలో వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తేనే ఇంటర్ కు ప్రమోట్ అవుతారు. అదేవిధంగా ఇంటర్ సెకండ్ ఇయర్ ఉత్తీర్ణత సాధిస్తేనే డిగ్రీకి ప్రమోట్ చేస్తారు. అయితే ఇంటర్ వార్షిక పరీక్షలు పూర్తి అయ్యాయి. కానీ, పదో తరగతి పరీక్షలు మార్చి 19న ప్రారంభమై మూడు పరీక్షలతో నిలిపివేశారు. కరోనా వైరస్ విజృంభిస్తోందని మధ్యలోనే నిలిపివేయడంతో తిరిగి ఆ పరీక్షలను నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వైరస్ సోకకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకొని పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోన్నది. పరీక్షా కేంద్రాలను మరికొన్ని పెంచి, విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా, మాస్కులు, శానిటైజర్స్ ఉపయోగించేలా తగు జాగ్రత్తలు తీసుకొని పరీక్షలు నిర్వహించనున్నారు.

Advertisement

Next Story