ఒడిశాలో వరల్డ్ క్లాస్ హాకీ స్టేడియం!

by Shamantha N |
ఒడిశాలో వరల్డ్ క్లాస్ హాకీ స్టేడియం!
X

భువనేశ్వర్ : ఒడిశాలో త్వరలోనే వరల్డ్ క్లాస్ హాకీ స్టేడియం నిర్మించనున్నట్టు ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ గురువారం వెల్లడించారు. సుందర్‌ఘర్ జిల్లా రౌర్కేలాలోని బిజూ పట్నాయక్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్‌లో 15 ఎకరాల్లో ఈ స్టేడియాన్ని నిర్మిస్తామని తెలిపారు. ఓ వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ, 2023లో జరగనున్న పురుషుల హాకీ వరల్డ్‌కప్‌కు ఒడిశానే ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ టోర్నీని రాష్ట్రంలోని కళింగ స్టేడియంతోపాటు కొత్తగా నిర్మించనున్న స్టేడియంలో నిర్వహిస్తామన్నారు.

20వేల మంది ప్రేక్షకులు కూర్చోగల సామర్థ్యముండే ఈ స్డేడియం దేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియంగా నిలవనుందని చెప్పారు. సకల సౌకర్యాలతో నిర్మించనున్న ఈ స్డేడియం ప్రపంచంలోని ఇతర హాకీ స్టేడియాలకు బెంచ్‌ మార్క్‌గా నిలుస్తుందన్నారు. అలాగే, సుందర్‌ఘర్ జిల్లా దేశంలోని హాకీ ప్రతిభకు కేంద్ర బిందువుగా ఉందని, జిల్లా నుంచి ఎందరో గొప్ప హాకీ ప్లేయర్లు దేశానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించారని గుర్తు చేశారు. భారత హాకీకి సుందర్‌ఘర్ అందించిన కృషికి నివాళిగా నిర్మిస్తున్న ఈ స్టేడియం ప్రపంచంలోనే ఉత్తమైనదిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, భారత హాకీకి సారథ్యం వహించిన దిలీప్ తిర్కే, సునిత లాక్రాలు సుందర్‌ఘర్ జిల్లాకు చెందినవారే కావడం విశేషం.

Advertisement

Next Story