ఎమ్మెల్సీ పోరులో ‘అధికార’ అసంతృప్తి.. ఓటర్లకిచ్చే నగదు ఎమ్మెల్యేల జేబుల్లోకి..

by Shyam |   ( Updated:2021-12-09 02:57:30.0  )
ఎమ్మెల్సీ పోరులో ‘అధికార’ అసంతృప్తి.. ఓటర్లకిచ్చే నగదు ఎమ్మెల్యేల జేబుల్లోకి..
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోరులో అధికార టీఆర్ఎస్ పార్టీకి అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. అభ్యర్థి ఎంపిక నాటి నుంచి మరి కొద్దిగంట్లో పోలింగ్ మొదలవుతుందనే వరకు అంతా వ్యతిరేకతే కన్పిస్తోంది. నిజానికి ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థికి ప్రతిపక్ష పార్టీల నుంచి గట్టి పోటీ లేదు. అయినా అధికార పార్టీ విజయ తీరాలకు చేరే వరకు అంతా గందరగోళమే కన్పిస్తోంది. స్థానిక ఎమ్మెల్సీ పోరులో టీఆర్ఎస్ మినహా ఇతర పార్టీలన్నీ చేతులేత్తేశాయి. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి విజయం అధికారిక ప్రకటన లాంఛనమే అనుకున్నారు. కానీ ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్‌లో మారిన సమీకరణాల నేపథ్యంలో పరిస్థితులన్నీ తలకిందులయ్యాయనే చెప్పాలి. టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డిపై సొంత పార్టీ ఓటర్ల నుంచే వ్యతిరేకత కన్పిస్తుండడం గమనార్హం.

అసంతృప్తిలో అధికార పార్టీ ఓటర్లు..

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలనగానే.. ఉమ్మడి జిల్లాలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు ఎగిరి గంతేశారు. తాము ఎన్నికల్లో గెలిచేందుకు ఖర్చు చేసిన నగదులో సగమైనా దక్కించుకోవచ్చని అంతా భావించారు. కానీ వారి ఆశల మీద రాజకీయ పార్టీలు నీళ్లు చల్లాయనే చెప్పాలి. టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంసీ కోటిరెడ్డి బరిలోకి దిగడం.. ప్రతిపక్షాలు బలమైన అభ్యర్థిని పెట్టకపోవడం వంటి కారణాలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో నిరుత్సాహం అలుముకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు ఓటు వేయాలని అడిగే నాథుడే కరువయ్యారు. ఏలాగూ అధికార టీఆర్ఎస్ పార్టీకి స్థానిక సంస్థల ఓటింగ్ బలం ఎక్కువ ఉండడం.. ప్రత్యర్థి అభ్యర్థులు బలంగా లేరనే కారణంతో అధికార పార్టీ లైట్ తీసుకుంటుంది. దీంతో ఎన్నికలకు ఖర్చు చేసిన దాంట్లో సగమైనా వస్తుందని ఆశించిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లకు చుక్కెదురైనట్టు అయ్యింది.

క్యాంపులకు తరలించినా నో యూజ్..

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ఓటర్లకు సంబంధించి క్యాంపు రాజకీయాలు నామమాత్రంగానే మారాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఓటర్లను క్యాంపులకు తరలించింది. సూర్యాపేట జిల్లాలోని ఓటర్లను ఖమ్మం జిల్లా భద్రాచలానికి, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓటర్లను హైదరాబాద్‌కు తరలించారు. దీంతో ఓటర్లంతా రెండు రోజుల పాటు విలాసవంతమైన ఏర్పాట్లతో పాటు డబ్బులు ఇస్తారనే ఉద్దేశంతో వెళ్లారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. విలాసవంతమైన ఏర్పాట్ల సంగతి పక్కనపెడితే.. క్యాంపుల్లో అడిగినా బదులిచ్చేవారు కరువయ్యారని ఓటర్లు వాపోతున్నారు. వాస్తవానికి ఏ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలోని ఓటర్ల బాధ్యత తీసుకుంటారని, ఆ క్రమంలోనే డబ్బుల పంపిణీ ఉండనుందనే ఊహాగానాలు వినిపించాయి. ఒకానొక దశలో అధికార పార్టీకి చెందిన ఓటర్లకు రూ.లక్ష, న్యూట్రల్‌ ఓటర్లతో పాటు అంసతృప్తితో ఉన్న ఓటర్లకు రూ.1.50 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారని తెలుస్తోంది.

సగం డబ్బు ఎమ్మెల్యేల జేబుల్లోకే..

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఓటర్లకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్టు సమాచారం. అందులో భాగంగానే నియోజకవర్గాల వారీగా డబ్బు పంపిణీ చేసే బాధ్యత ఎమ్మెల్యేలకు కట్టబెట్టినట్టు తెలుస్తోంది. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు ఓటర్లకు పంపిణీ చేయాల్సిన డబ్బులు సగం తమ జేబుల్లో వేసుకున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లకు అడిగిన ప్రతి పని చేసి పెట్టాం.. అయినా ఇప్పుడు వారికి ఇంతమొత్తంలో డబ్బు ఇవ్వడం ఎందుకనీ ఎమ్మెల్యేలు సన్నిహితులతో వాపోతున్నారు. ఈ క్రమంలోనే సగం డబ్బును నొక్కేశారని.. దీనిపై అధికార పార్టీ ఓటర్లు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని తెలుస్తోంది.

ఇండిపెండెంట్ అభ్యర్థికి లాభమేనా..

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొదట్నుంచీ అధికార పార్టీలో అసంతృప్తే ఉంది. అభ్యర్థి ఎంపిక నుంచి క్యాంపుల్లో డబ్బులు పంచడం వరకు వ్యతిరేకతే కన్పిస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అధికార పార్టీకి చెందిన అధిక శాతం మంది ఓటర్లు.. ఈసారి విభిన్నమైన తీర్పు ఇచ్చేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. మేం ఎన్నికల్లో ఇంతగా ఖర్చు చేసి గెలిస్తే.. మాకు కనీస గౌరవం ఇవ్వడం లేదని, గ్రామ పంచాయతీల్లోనూ కనీసం కుర్చీ వేసే పరిస్థితి లేదని వాపోతున్నారు. గత రెండుసార్లు స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పటి ఓటర్లకు రూ.5లక్షలకు పైనే ముట్టాయనే ఆరోపణలు ఉన్నాయి. మరీ ఈసారి టీఆర్ఎస్ నుంచి ఆర్థికంగా బలమైన అభ్యర్థిని పెట్టకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని కొంతమంది ఓటర్లు బహిరంగంగానే తమ ఆవేదన వెళ్లగక్కుతున్నారు. ఈ వ్యవహారమంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థికి లాభం చేకూర్చే పరిస్థితులు కన్పిస్తున్నాయని రాజకీయ వర్గాల అభిప్రాయం. ఇంతకీ ఓటర్లు ఏం తీర్పు ఇవ్వనున్నారనేది వేచిచూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed