భారత మహిళా బిలియనీర్‌గా ఫల్గుణి నాయర్!

by Harish |   ( Updated:2021-11-10 05:09:58.0  )
భారత మహిళా బిలియనీర్‌గా ఫల్గుణి నాయర్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీ ‘నైకా’ మాతృ సంస్థ ఎఫ్ఎస్ఎన్ ఈ-కామర్స్ వెంచర్స్ బుధవారం స్టాక్ మార్కెట్లలో ప్రవేశించిన రోజే సంచలనంగా మారింది. ఈ కంపెనీ షేర్లు ఏకంగా 80 శాతం ప్రీమియంతో లిస్ట్ కావడం ద్వారా నైకా మార్కెట్ క్యాప్ రూ.లక్ష కోట్లను అధిగమించింది. అంతేకాకుండా సంస్థ వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్ సంపద 89 శాతం పెరిగి 6.5 బిలియన్ డాలర్లు(రూ.48 వేల కోట్లు)కు చేరింది. నైకా కంపెనీలో ఆమెకు సగం షేర్లు ఉండటం వల్లే ఈ స్థాయి సంపద సాధించగలిగారు. అంతేకాకుండా బ్లూమ్‌బర్గ్ బిలీయనీర్ సూచీ ప్రకారం ఫల్గుణి నాయర్ ఇప్పుడు భారత్‌లోనే అత్యంత సంపన్న స్వీయ నిర్మిత మహిళా బిలీయనీర్‌గా నిలిచారు.

నైకా కంపెనీ షేర్లు బుధవారం స్టాక్ మార్కెట్లలో ఎంట్రీ ఇచ్చి రూ.2,001 వద్ద లిస్ట్ అయ్యాయి. ఇది ఐపీఓ ఇష్యూ ధర రూ.1,125 కంటే ఏకంగా 77.87 శాతం అత్యధిక ప్రీమియంగా ఉండటం విశేషం. నిఫ్టీలో 79 శాతం ప్రీమియంతో రూ.2,018 వద్ద లిస్ట్ చేయబడింది. ఐపీఓ ద్వారా నైకా సంస్థ రూ.5,352 కోట్ల నిధులను సమీకరించిన సంగతి తెలిసిందే. 2012లో ఫల్గుణి నాయర్ నేతృత్వంలో నైకా సంస్థ మొదలైంది. సౌందర్య ఉత్పత్తుల కోసం కీలకమైన ఆన్‌లైన్ ఈ-కామర్స్‌గా ఈ కంపెనీ నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో నైకా రూ.2,400 కోట్లకు పైగా ఆదాయాన్ని సాధించింది. నైకా మొత్తం 1500 వరకు బ్రాండ్‌లను విక్రయిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed