'నర్సింగ్ సమస్యలపై చర్చించాలి'

by Shyam |   ( Updated:2020-05-04 09:48:44.0  )

దిశ, హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించే కేబినెట్ సమావేశంలో నర్సింగ్ వృత్తి సమస్యలపై చర్చించాలని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీను రాథోడ్ అధ్యక్షతన సోమవారం రాష్ట్ర కమిటీ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రుడావత్ మాట్లాడుతూ నర్సింగ్ సమాజం ప్రజారోగ్యం కోసం రోజులో 24 గంటలు శ్రమిస్తున్నా.. రాష్ట్రం ఏర్పాటు దగ్గర్నుంచి నేటి వరకూ నర్సుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఆరోగ్యశాఖను పటిష్టం చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాకొక మెడికల్ కళాశాలతోపాటు నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేయ్యాలన్నారు. ఆరోగ్య శాఖకు బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్ప్రతులన్నింటిలోనూ శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలన్నారు. 108 అంబులెన్స్ సర్వీసులను ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 సంవత్సరాన్ని నర్సింగ్ ఇయర్ గా ప్రకటించిన నేపథ్యంలో నర్సింగ్ వృత్తి ఆదరణ కోసం ప్రభుత్వం పటిష్టవంతమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో నర్సింగ్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. కేంద్రం ఉత్తర్వుల మేరకు ప్రైవేటు వైద్యశాలలో పనిచేసే నర్సింగ్‌ అధికారులకు ప్రతి నెల రూ.20 వేల కనీస వేతనాలను అమలు చేయాలన్నారు. సమావేశంలో అసోసియేషన్ ముఖ్య సలహాదారులు చిలుపూరి వీరాచారి, డాక్టర్ రామ్ తిలక్, ఉపాధ్యక్షురాలు కవిత, కోశాధికారి వంశీ ప్రసాద్, జాయింట్ సెక్రటరీ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Tag: Corona Effect, Nursing Officers Association, Telangana State Government, Cabinet Meeting

Advertisement

Next Story

Most Viewed