- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో ‘లంచం’ లాంఛనం.. అంతా నర్సులదే హవా..
దిశ ప్రతినిధి, మెదక్ : సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల కంటే నర్సులదే హవా కొనసాగుతోంది. రోగం వచ్చిందని ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే పరీక్షించాల్సిన వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. నర్సులే వైద్యులై ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. పెద్ద వ్యాధి బారినపడి రోగం నయం చేసుకునేందుకు వెళితే మాత్రం అందులో ఉన్న నర్సులకు లంచం ఇవ్వనిదే వైద్యం జరగడం లేదన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. అయినా జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ పట్టించుకోకపోవడం గమనార్హం.
నర్సులదే హవా …
సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కార్పొరేట్ తరహా ఉచిత వైద్యం అందిస్తున్నామని, పేదలకు ప్రతి వైద్య సదుపాయం అందుబాటులో ఉందని, ఇటీవలే డయాగ్నోస్టిక్ సేవలు సైతం అందుబాటులోకి తెచ్చామని మంత్రి హరీశ్ రావు చెప్పడంతో పేదలందరూ జిల్లా ఆస్పత్రి బాట పట్టారు. రోజు రోజుకి సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లే వారి సంఖ్య పెరిగింది. రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్యులు లేరు. ఏ చిన్న రోగమొచ్చిందని వెళ్లిన రోగులను పరీక్షిస్తున్నది నర్సులే. వైద్యుల తరహా నర్సులే రోగికి రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. రక్త పరీక్షల ఆధారంగా నర్సులే మందులు రాసిస్తున్న పరిస్థితి నెలకొంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఫైరవీలు …
ఫైరవీలు జరుగుతున్నాయనే మాటను సాధారణంగా రెవెన్యూ, పోలీసు, ఇతర కార్యాలయాల్లో వింటుంటాం. కానీ ఈ మధ్య ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఈ మాట వినాల్సి వస్తోంది. సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం కోసం వెళితే సాధారణ ప్రజలకు వైద్యం అందడం లేదు. ఉదయం 10 గంటలకు వెళ్లిన వ్యక్తికి మధ్యాహ్నం రెండు గంటలైన వైద్యులు పరీక్షించడం లేదు. ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ కోసం రోజు 60 మందివి మాత్రమే పేర్లు రాసుకుంటున్నారు. పరీక్షలు మాత్రం చేయడం లేదు. ఆస్పత్రిలో తెలిసిన వారికి ఫోన్లు చేయడం, లేదా లంచం ముట్టజెప్పడం లాంటివి చేసిన వారికి మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. ఇది గమనించిన కొంతమంది డబ్బులడగమేంటని ప్రశ్నిస్తే … ప్రభుత్వ ఆస్పత్రి తీరు ఇలాగే ఉంటది, మాకు జీతాలు ఇస్తలేరు.. నీకు ఇష్టముంటే ఉండు లేదంటే ప్రైవేటు ఆస్పత్రికి పో అని గట్టిగా మాట్లాడుతున్నారు. ఇదంతా జిల్లా మంత్రి కనుసన్నల్లో జరుగుతుందని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.
వేధిస్తున్న వైద్యుల కొరత …
సిద్దిపేట జిల్లా ఆస్పత్రిలో వైద్యుల కొరత వేధిస్తోంది. సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్లుగా పనిచేసే వారే కొంతమంది ఆస్పత్రిలో డాక్టర్లుగా కూడా కొనసాగుతున్నట్టు సమాచారం. జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేక స్పెషలిస్టు వైద్యులు లేరు. ఉన్న వారిలో చాలా మంది జనరల్ ఫిజిషియన్లే. దీంతో ఏ ప్రత్యేక వైద్యం కోసం వెళ్లిన జనరల్ ఫిజిషియన్లే దిక్కవుతున్నారు. రోగులను సంతృప్తి పరిచేందుకు గాను కొన్ని రకాల పరీక్షలు చేసి.. ప్రత్యేక , మెరుగైన వైద్యం పేరిట హైదరాబాద్ పంపిస్తున్నారు. ఇదిలా ఉండగా రోగులకు సరిపడ వీల్ చైర్లు, స్ట్రెచర్లు కూడా అందుబాటులో లేవు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా మంత్రి స్పందించి జిల్లా ఆస్పత్రిలో సరిపడ వైద్యులను నియమించడంతో పాటు లంచం తీసుకునే నర్సులపై చర్యలు తీసుకోవాలి. ఆస్పత్రిలో కావాల్సిన ఫర్నీచర్, ఇతర సౌకర్యాలను మెరుగుపరచాలని కోరుతున్నారు.