- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాపై యుద్ధం.. నర్సుల్లారా మీకు వందనం!
దిశ, న్యూస్ బ్యూరో: కరోనాపై యావత్తు దేశం యుద్ధం ప్రకటించింది. దేశమంతా లాక్‌డౌన్‌లోకి వెళ్ళిపోయింది. ఈ లాక్‌డౌన్ ఇంకెన్ని రోజులుంటుందో తెలియదు. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆసుపత్రుల్లో చికిత్స తర్వాత పాజిటివ్ పేషెంట్లు సంతృప్తిగా ఇళ్ళకు చేరుకుంటున్నారు. ఇళ్ళు దాటి బైటకు వస్తే పదిమందికి అంటుకుంటుందని ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రజల్లోనూ అవగాహన పెరిగింది. కానీ అదే సమయంలో పాజిటివ్ పేషెంట్లకు చికిత్స చేస్తున్న వైద్యులు, నర్సులు మాత్రం ప్రతీ క్షణం సవాలునే ఎదుర్కొంటున్నారు. ఐసొలేషన్ వార్డుల్లోని బెడ్‌ల సంఖ్యకు అనుగుణంగా నర్సుల సంఖ్య లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క నర్సు పోస్టు కూడా భర్తీ కాలేదు. నోటిఫికేషన్లు పెండింగ్‌లోనే ఉండిపోయాయి. ఆయుధాలు లేకుండా యుద్ధానికి దిగినట్లుంది ప్రస్తుత పరిస్థితి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పేషెంట్లకు చికిత్స చేయడానికి నర్సుల కొరత తీవ్రంగా ఉంది.
ప్రజారోగ్యంపై ప్రభుత్వాలకు ఎంత చిత్తశుద్ధి ఉందో వాస్తవిక గణాంకాలను చూస్తే ఆశ్చర్యపోతాం.
నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం జనరల్ వార్డుల్లో ప్రతీ ఆరు బెడ్‌లకు ఒక నర్సు, ఐసీయూల్లో ప్రతీ బెడ్‌కు ఒక నర్సు చొప్పున ఉండాలి. కానీ దేశంలోనే ఈ నిబంధన ఎక్కడా అమలు కావడంలేదు. కేంద్ర వైద్యారోగ్య శాఖ ఇటీవల వెలువరించిన నేషనల్ హెల్త్ ప్రొఫైల్ సర్వే – 2019 ప్రకారం తెలంగాణ మొత్తంమీద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలు పెద్ద ఆసుపత్రి వరకు సుమారు 860 ప్రభుత్వాసుపత్రుల్లో 2,912 మంది నర్సులు పనిచేస్తున్నారు. వీటిల్లో సుమారు 20,980 బెడ్‌లు ఉన్నాయి. ఇక వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో పనిచేసే 111 ఆసుపత్రుల్లో 8,410 బెడ్‌లు ఉంటే పనిచేస్తున్న నర్సుల సంఖ్య మాత్రం 1113 మాత్రమే. ఇంకా 1158 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అంటే పనిచేస్తున్నవారికంటే ఖాళీగా ఉన్న పోస్టులే ఎక్కువ. కానీ రాష్ట్రంలో నర్సులుగా, మిడ్‌వైఫ్ నర్సులుగా నమోదు చేసుకున్నవారి సంఖ్య మాత్రం 9,397గా ఉంది. ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న 2912 మంది నర్సులు మినహా మిగిలిన వారు ఇతర రాష్ట్రాలు లేదా ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు.
ప్రస్తుతం కరోనా పాజిటివ్ పేషెంట్లకు చికిత్స చేస్తున్న హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రినే చూసుకుంటే రెండేళ్ళ క్రితం నాటికే 1,012 బెడ్‌లు ఉన్నాయి. కానీ మంజూరైన నర్సు పోస్టులు మాత్రం కేవలం 211 మాత్రమే. ఇందులో ముప్పై పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఔట్‌సోర్సింగ్ పద్ధతిన 200 మందిని ప్రభుత్వం నియమించుకుంది. ఒక ట్రస్టు ద్వారా 61 మంది పనిచేస్తున్నారు. కాంట్రాక్టు పద్ధతిన మరో 15 మంది పనిచేస్తున్నారు. ప్రస్తుత అవసరాల కోసం ఇంకా సుమారు 510 మంది నర్సులు ఉండాలి. కానీ ప్రభుత్వంవైపు సీరియస్ కృషి లేదన్నది నర్సుల వాదన. రాష్ట్రం మొత్తం మీద బోధనాసుపత్రుల్లో కనీసంగా 3,610 కంటే ఎక్కువ నర్సు పోస్టులు ఉండాలి. కానీ లెక్కలను పరిశీలిస్తే పనిచేస్తున్న నర్సుల సంఖ్య 1911 అయితే ఖాళీ పోస్టులు 1703. అంటే పనిచేసేవాటికి దాదాపు సమానంగా ఖాళీ పోస్టులే ఉన్నాయి.
ఆరేళ్ళుగా నర్సుల భర్తీ లేదు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుమారు 3300 నర్సు పోస్టుల భర్తీ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2017 నవంబరు మొదలు 2018 జనవరి వరకు నోటిఫికేషన్లు ఇచ్చింది. ఇందులో ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న నర్సులకు 30% (65 మార్కులు) వెయిటేజి ఇచ్చింది. అయితే ప్రతీ ఏటా సుమారు నాలుగువేల మంది నర్సులు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్ కాలేజీల నుంచి క్వాలిఫై అయి బైటకు వస్తున్నారు. సుమారు 21 వేల మంది పరీక్షలు కూడా రాశారు. కానీ రిక్రూట్‌మెంట్ మాత్రం ఆగిపోయింది. కాంట్రాక్టు నర్సులకు వెయిటేజీ ఇవ్వడానికి వ్యతిరేకంగా అభ్యర్థులు కోర్టుకు వెళ్ళడంతో ఈ ప్రక్రియ అక్కడితోనే ఆగిపోయింది. ప్రభుత్వం నుంచి కౌంటర్ అఫిడవిట్ దాఖలుచేయడంగానీ, ప్రక్రియ ముందుకు వెళ్ళేందుకు చొరవ తీసుకోలేదు.
గాంధీ, ఉస్మానియా, ఎంజీఎం లాంటి బోధనాసుపత్రుల్లోనూ, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లోనూ, వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లోనూ నర్సుల కొరత తీవ్రంగా ఉంది. బోధనాసుపత్రుల్లో 1911 మది నర్సులు పనిచేస్తూ ఉంటే 1703 ఖాళీ పోస్టులు ఉన్నాయి. వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో 1113 పనిచేస్తూ ఉంటే 1158 ఖాళీగా ఉన్నాయి. ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో కొరత సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఇప్పుడు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ కరోనా పాజిటివ్ పేషెంట్లను పెట్టినా, ఐసొలేషన్ వార్డులను సిద్ధం చేసినా వారికి లభించే తక్కువ వేతనాలకు రిస్కు తీసుకుని పనిచేయడానికి సిద్ధంగా లేరని నర్సులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నర్సులు చేతులెత్తేస్తే ప్రజారోగ్యం సంగతేంటన్నది కీలకంగా మారింది. ప్రభుత్వం దగ్గర కూడా ప్రత్యామ్నాయం లేకుండాపోయింది.
నర్సుల్లో మానసిక ఒత్తిడి :
తక్కువ మంది నర్సులతోనే కరోనా పాజిటివ్ పేషెంట్లకు, ఐసొలేషన్‌లో ఉన్న పేషెంట్లకు సేవలు చేయాల్సి వస్తోందని, పని భారం పెరిగిందని, మానసికంగా చాలా ఒత్తిడికి గురవుతున్నామని నర్సులు ఇటీవల గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు మొరపెట్టుకున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే కరోనా పాజిటివ్ కేసులకు చికిత్స చేసే సమయంలో వ్యక్తిగత రక్షణ కోసం (పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్) వాడే గ్లవుజులు, మాస్క్‌లు, చెప్పులు, డ్రెస్‌లు లేక ఇబ్బంది పడుతున్నామని, జీవితాన్నే పణంగా పెట్టి చికిత్స చేయాల్సి వస్తోందని, మూడు రోజుల క్రితం వారంతా ఒక విజ్ఞప్తి చేశారు. చేతులు కడుక్కోడానికి సబ్బులు, నీటి వసతి, హ్యాండ్ శానిటైజర్‌లు, బయో వేస్ట్ వేయడానికి డస్ట్ బిన్‌లు, థర్మామీటర్లు.. ఇలా అనేకం లేకుండానే పనిచేయాల్సి వస్తోందని వాపోయారు. కానీ ఇప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. దీనికి తోడు అద్దె ఇళ్ళలో ఉంటున్న తమకు యజమానుల నుంచి ఖాళీ చేసే ఆర్డర్లు వస్తున్నాయని, కరోనా పేషెంట్లకు చికిత్స చేస్తున్నందున ‘మాకు అంటిస్తారా’ అంటూ బాధపడే కామెంట్లు వినాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఢిల్లీలోని ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్‌తో పాటు ఇండియన్ ప్రొఫెషనల్ నర్సెస్ అసోసియేషన్ కేంద్ర హోం మంత్రి, వైద్యారోగ్య మంత్రి మొదలు ప్రధాని వరకు లేఖలు రాశాయి. అద్దె ఇళ్ళను ఖాళీ చేయాలన్న సమస్యతో పాటు రాకపోకలకు భద్రత లేదని, పోలీసుల నుంచి ఆంక్షలు వస్తున్నాయని, రిస్కు తీసుకుని పనిచేస్తున్నా యాజమాన్యం నుంచి లభించే వేతనంతో కుటుంబాలను నెట్టుకురాలేకపోతున్నామని, అనారోగ్యం పాలైనప్పుడు ఉచిత వైద్య చికిత్సకు నోచుకోలేకపోతున్నామని, కరోనా పాజిటివ్‌కు లోనైనప్పుడు చేతుల్లోంచి ఖర్చు చేసుకోవాల్సి వస్తోందని.. ఇలా అనేక డిమండ్లను ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నాయి.
ఇక కరోనా పేషెంట్లకు చికిత్స చేసే సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల్లో కొన్ని ప్రస్తావించింది. మాస్కులు, గ్లవుజులు అందడంలేదని, వ్యక్తిగత రక్షణ కోసం ఉండాల్సిన దుస్తులు, ఉపకరణాలు లేవని, డ్యూటీ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని, వార్డుల్లో తరచూ చేయాల్సిన స్ప్రే పనులు జరగడంలేదని, డ్యూటీలో ఉన్న సమయంలో ఆహారం అందడంలేదని.. ఇలా అనేకం ప్రస్తావించారు. దీనికి తోడు ఐసొలేషన్ వార్డుల్లో ఉన్న పేషెంట్ల నుంచి సబ్బులు, టూత్ పేస్టులు, టవళ్ళు, నీరు, వైఫై లాంటి సౌకర్యాలు లేవంటూ ఫిర్యాదులు వస్తున్నాయని, వీటికి డాక్టర్లు సమాధానం చెప్పకుండా వదిలేయడంతో నర్సులు ఇబ్బంది పడుతున్నారని ప్రస్తావించింది. పేషెంట్లకు సైతం సకాలంలో ఫుడ్ అందడంలేదని పేర్కొంది.
డాక్టర్లలాగా మేం తప్పించుకోలేం గదా…
”కరోనా పేషెంట్లకు చికిత్స చేయడానికి 24 గంటలూ డాక్టర్లు, నర్సులు ఉండాల్సిందే. అయితే డాక్టర్లు దూరం నుంచే పేషెంటును చూసి, కేసు షీట్ ప్రకారం సూచనలు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. కానీ నర్సులుగా మేం మాత్రం పేషెంట్ నుంచి రక్త నమూనాలతో పాటు దగ్గరి నుంచే అన్ని సేవలూ చేయాల్సి వస్తోంది. మానసికంగా సంసిద్ధంగా ఉన్నా వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి అవసరమైన రక్షణ పరికరాలు మాత్రం లేవు. ఎక్కువ గంటలు నర్సులుగా పనిచేయాల్సి వస్తోంది. కుటుంబ సభ్యులను కూడా పట్టించుకోలేకపోతున్నాం. వారి ఆరోగ్యం ఏమవుతుందోననే ఆందోళన ఉంటోంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కరోనా పేషెంట్ దగ్గర ఉండొచ్చారు.. ఏం అంటిస్తారో ఏమో అనే చూపులు, మాటలను భరించలేకపోతున్నాం…” ఇదీ గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక నర్సు ఆవేదన.
Tags: corona, hospital, nurses, doctors, treatment, recruitment, home minister, gandhi, osmania