నర్సులకు… దేశమంతా ఒకే పే స్కేల్

by vinod kumar |   ( Updated:2020-04-07 11:31:53.0  )
నర్సులకు… దేశమంతా ఒకే పే స్కేల్
X

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ‘ఒకే దేశం – ఒకే పన్ను’ విధానం అమల్లోకి వచ్చింది. ఇక ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ కూడా చర్చల స్థాయిలో ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా వివిధ జబ్బులకు ఒకే తరహా ప్రోటోకాల్ అమలవుతున్న తీరులోనే వైద్యసేవలు చేస్తున్న నర్సులకు కూడా దేశవ్యాప్తంగా ఒకే రకమైన ‘పే స్కేల్’ (వేతనం) ఉండాలన్న డిమాండ్ ముందుకొచ్చింది. ఏ రాష్ట్రంలోనైనా నర్సులకు ఇచ్చే వేతనం ఒకే తీరులో ఉండాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సాకారమయ్యేందుకు తన వంతు కృషి చేస్తానని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ(హెల్త్) సభ్యుడు సురేష్ ప్రభు హామీ ఇచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న మార్గదర్శకాల మేరకు భారతదేశంలో జనాభాకు అవసరమైన సంఖ్యలో నర్సులు లేనందున భవిష్యత్తులో ఈ గ్యాప్‌ను పూడ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుందన్నారు. ప్రస్తుతం ప్రతీ ఏటా మే 12వ తేదీన ‘ప్రపంచ నర్సింగ్ దినోత్సవం’ సందర్భంగా ఉత్తమ సేవ కనబర్చిన నర్సులకు మొత్తం 35 అవార్డులను ప్రదానం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇకపైన 51 అవార్డులను అందజేయనుందని స్పష్టం చేశారు. ప్రపంచ హెల్త్ డే సందర్భంగా భారత నర్సింగ్ కౌన్సిల్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు(వెబినార్)లో ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో నర్సులు పోషిస్తున్న పాత్రపై ఈ వీడియో కాన్ఫరెన్సులో లోతైన చర్చ జరిగింది. ఒక వేదిక మీద మాట్లాడుకోవాల్సిన మాటలను కరోనా నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్సుకు పరిమితం కావడం బాధాకరమే అని అన్నారు. కేరళలో ఇటీవల కరోనా వైరస్‌కు గురై కోలుకున్న తర్వాత మళ్ళీ విధుల్లో చేరిన రేష్మా మోహన్ దాస్, ముంబయిలో సినీనటిగా ఉంటూ కరోనా కారణంగా మళ్ళీ నర్సుగా సేవలందించడానికి ముందుకొచ్చిన బాలీవుడ్ నటి శిఖ్తా మల్హోత్రా తదితరులతోపాటు సినీనటి జయప్రద, భారత నర్సింగ్ కౌన్సిల్ అధ్యక్షులు దిలీప్ కుమార్, నర్సింగ్ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కరోనా వ్యాధి చికిత్సలో నర్సులు పోషిస్తున్న పాత్రను సురేష్ ప్రభు సహా పలువురు ప్రశంసించారు. కేరళ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాన్ని నర్స్ రేష్మా మోహన్‌దాస్ కొనియాడారు. కరోనా పేషెంట్లకు చికిత్స చేస్తూ దాని ఇన్‌ఫెక్షన్‌కు గురై చికిత్స తీసుకున్న అనంతరం ఎందుకు మళ్ళీ విధుల్లో చేరాల్సి వచ్చిందో వివరించారు. ఆమెను పలువురు ప్రశంసించి ‘బ్రేవ్ నర్స్’ అని సంబోధించారు.

నర్సింగ్ కోర్సు పూర్తి చేసి సినిమా రంగంలోకి వెళ్ళిన నటి శిఖ్తా మల్హోత్రా కరోనా కారణంగా మళ్ళీ తాను నర్సుగా సేవలందించడానికి చొరవ తీసుకున్న విషయాన్ని వివరించారు. ఆమె ఆలోచనను, కార్యాచరణను నర్సింగ్ కౌన్సిల్ అధ్యక్షులు సహా సినీనటి జయప్రద, సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయి తదితరులు అభినందించారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న హెల్త్ ఎమర్జెన్సీ నేపథ్యంలో నర్సుగా కొద్దిమందికైనా సేవలందించడం తన బాధ్యత అని, అందుకే రంగుల ప్రపంచం నుంచి తెల్ల ప్రపంచంలోకి వచ్చినట్లు వివరించారు. కరోనా మహమ్మారి పారిపోయేదాకా ఈ వృత్తిలో కొనసాగుతానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా నర్సులు పలు ప్రతిపాదనలను భారత నర్సింగ్ కౌన్సిల్ అధ్యక్షులు, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ దృష్టికి తీసుకెళ్ళారు. కరోనా సమయంలో నర్సుల పాత్రపై ప్రశంసలు వస్తున్నాయని, కానీ భారత్ లాంటి పెద్ద దేశంలో జనాభా అవసరాలకు తగిన సంఖ్యలో నర్సులు లేరని, ఆ వృత్తికి తగిన గుర్తింపు కూడా ప్రభుత్వాల నుంచి లేదని నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యారోగ్య రంగంలో వైద్య విద్య, ప్రజారోగ్యం తదితరాలకు ప్రత్యేకంగా డైరెక్టరేట్‌లు ఉన్నాయిగానీ నర్సింగ్ కోసం అలాంటి వ్యవస్థ లేకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రతీ రాష్ట్రంలో నర్సింగ్ డైరెక్టరేట్ ఉంటేనే వారి సమస్యలు, అవసరాలు, ప్రజారోగ్యంలో పోషించాల్సిన పాత్ర తదితరాలపై స్పష్టత వస్తుందని, ఫలితంగా విధాన నిర్ణయాలు జరగడానికి ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా పేషెంట్లకు చికిత్స చేస్తున్న నర్సులకు తగిన పీపీఈ(పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్) లేదని గుర్తుచేశారు. దీనికి రాజ్యసభ సభ్యుడు సురేష్ ప్రభు స్పందిస్తూ, దేశవ్యాప్తంగానే కొరత ఉందని, దీని తీవ్రతను ప్రధాని కూడా గుర్తించారని, అందువల్లనే రైల్వే, డీఆర్‌డీవో లాంటి సంస్థల్లో అక్కడికక్కడే తయారు చేసేందుకు చర్యలు చేపట్టారని గుర్తుచేశారు.

ప్రస్తుతం ఉన్న నర్సుల వివరాలు ప్రభుత్వం దగ్గర లేవని, చాలామంది నర్సింగ్ కోర్సు పూర్తి చేసినా వృత్తిలోకి రాకుండా ఉంటున్నారని, ఇలాంటి విపత్తుల సమయాల్లో వారి సేవలను వినియోగించడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించవచ్చని వేలూరు క్రిస్టియన్ మెడికల్ కళాశాల మాజీ డీన్ పునీత ఎళిలరసు వ్యాఖ్యానించారు. నర్సు కోర్సు సిలబస్‌లోనూ మార్పులు జరగాలని, నర్సింగ్ కళాశాలల సంఖ్యతో పాటు ఆ వృత్తిలోకి మరింతమందిని తీసుకురావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ నర్సింగ్ దినోత్సవాన్ని కరోనా కారణంగా ఈసారి జరుపుకునే అవకాశం లేదని సమాచారం ఇచ్చినట్లు సురేష్ ప్రభు ఈ వీడియో కాన్ఫరెన్సులో పేర్కొన్నారు.

Tags: Nurse, Actress Shikha Malhotra, Kerala, Reshma MohanDas, Dileep Kumar, Suresh Prabhu, Video Conference

Advertisement

Next Story

Most Viewed