24 గంటల్లో 45 వేల పాజిటివ్‌లు

by Anukaran |   ( Updated:2020-07-23 11:42:03.0  )
24 గంటల్లో 45 వేల పాజిటివ్‌లు
X

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో ఒక్కరోజులో నమోదయ్యే కరోనా కేసుల్లో రోజుకో గరిష్ఠ సంఖ్య నమోదవుతోంది. తాజాగా కొత్త కేసుల సంఖ్య 40వేల మార్కు దాటింది. గురువారం ఉదయం కేంద్ర ఆరోగ్యశాఖ బులెటిన్ వెల్లడించే‌సరికి గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా 45,720 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలోకి కరోనా వైరస్ ప్రవేశించినప్పటి నుంచి రోజులో నమోదైన కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 12,38,635కు చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. వైరస్ బారిన పడి దేశంలో ఒక్కరోజే 685 మంది మరణించారు. కాగా, తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్రంలో కరోనాతో సంభవించిన మరణాలను సవరించి అదనంగా 444 మరణాలు చేర్చడంతో ఒక్కరోజులో మరణించిన వారి మొత్తం సంఖ్య 1129గా నమోదయింది. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 29,861కి చేరిందని ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే సాయంత్రానికి వివిధ రాష్ట్రాల కేసుల బులెటిన్‌‌లు వెలువడడడంతో ఈ సంఖ్య 30 వేలు దాటింది. దీంతో మరణాల్లో భారత్ ఫ్రాన్స్‌ను దాటి ఆరోస్థానానికి చేరింది. ఇప్పటివరకు కరోనా సోకిన వారిలో 7,82,607 మంది కోలుకోగా ప్రస్తుతం 4,26,167 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

మహారాష్ట్ర, తమిళనాడులో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో కొనసాగుతుండగా దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం గడిచిన కొద్ది రోజులుగా కొత్త కేసుల నమోదు స్థిరంగా తగ్గుముఖం పడుతోంది. ఒక్కరోజులో నమోదైన 1041 పాజిటివ్ కేసులతో కలిపి ఇక్కడ ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,27,364కు చేరింది. ఇక్కడ కొత్తగా 26 కరోనా మరణాలు నమోదవడంతో ఇప్పటివరకు 3,745 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. మహారాష్ట్రలో ఒక్క రోజులో 9895 పాజిటివ్ కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 3,47,502కు వెళ్లింది. 24 గంటల్లో వైరస్ బారినపడి 298 మంది చనిపోగా మొత్తం మరణాలు 12,854కి చేరాయి. తమిళనాడులో 24 గంటల్లో 6472 పాజిటివ్‌లు నమోదై మొత్తం కేసుల సంఖ్య 1,92,964కి చేరింది. ఇక్కడ కొత్తగా కరోనాతో 75 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 3232కు చేరింది. గుజరాత్‌లో ఇప్పటివరకు ఉన్న 52,477 కేసులకు గాను 2252 మంది మరణించడం రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో గడిచిన 24 గంటల్లో 7998 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 72,711కి చేరింది. ఒక్కరోజే ఏపీలో కరోనాతో 61 మంది చనిపోయారు. ఇప్పటివరకు వైరస్ సోకి 884 మంది మృత్యువాత పడ్డారు.

Advertisement

Next Story