2 మిలియన్లకు కరోనా కేసులు

by Anukaran |
2 మిలియన్లకు కరోనా కేసులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా వ్యాప్తి వేగం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య ఏకంగా రెండు మిలియన్లు అంటే 20లక్షలు దాటింది. ఒక్కరోజులో నమోదయ్యే కొత్త కేసులు వరుసగా ఏడోరోజు 50వేల మార్కు దాటింది. గురువారం బులెటిన్ వెలువడేసరికి గడిచిన 24గంటల్లో కొత్తగా నమోదైన 56,282 కేసులతో కలిపి ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 19,64,536కు చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే సాయంత్రానికి పలురాష్ట్రాల కరోనా బులెటిన్‌లు వెలువడడంతో ఈసంఖ్య 20లక్షలు దాటినట్లు తెలుస్తోంది. దేశంలో కరోనాతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 40వేలు దాటింది. వైరస్ బారిన పడి దేశంలో ఒక్కరోజే 904మంది మరణించారు. 24గంటల్లో 900కు పైగా మరణాలు సంభవించడం ఇదే తొలిసారి కావడం కలవరం కలిగిస్తోంది. కొత్తగా నమోదైన కరోనా మరణాలతో కలిపి దేశంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 40,699కి చేరిందని ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా మరణాలు సంభవించిన దేశాల జాబితాలో భారత్ 5వ స్థానంలో కొనసాగుతుండగా కొత్తగా నమోదవుతున్న కేసుల పరంగా ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. ఇప్పటివరకు దేశంలో కరోనా సోకిన వారిలో 13లక్షల 28 వేల మంది కోలుకోగా ప్రస్తుతం 5లక్షల 95 వేల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మహారాష్ట్రలో ఒక్కరోజులోనే 11,514 కొత్త కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 4,79,779కి చేరింది. ఇక్కడ కొత్తగా కరోనాతో మరణించిన 316 మందితో కలుపుకొని మొత్తం మరణించిన వారి సంఖ్య 16,792కు చేరింది. ఢిల్లీలోమాత్రం గతంతో పోలిస్తే కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గుతోంది. 24గంటల్లో కొత్తగా నమోదైన 1299 కొత్త కేసులతో కలిపి ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,41,531కి చేరింది. ఇక్కడ కొత్తగా 15కరోనా మరణాలు నమోదవడంతో ఇప్పటివరకు 4059 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. తమిళనాడులో 24గంటల్లో 5684 పాజిటివ్‌లు నమోదై మొత్తం కేసుల సంఖ్య 2,79,144కు చేరింది. ఇక్కడ కొత్తగా కరోనాతో 110 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 4571కు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 10,328 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,96,789కు చేరింది. ఒక్కరోజే ఏపీలో కరోనాతో 72 మంది చనిపోయారు. ఇప్పటివరకు వైరస్ సోకి 1753 మంది ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Next Story

Most Viewed