అబద్ధమని నిరూపిస్తే జైలుకెళ్లేందుకైనా సిద్ధం

by Shyam |   ( Updated:2020-08-02 09:07:08.0  )
అబద్ధమని నిరూపిస్తే జైలుకెళ్లేందుకైనా సిద్ధం
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా మరణాలపై తప్పుడు లెక్కలు చూపుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన కరోనా మరణాలపై ఆధారాలు చూపిస్తూ మీడియాతో మాట్లాడారు. కరోనా మరణాలపై ఎందుకు దాటవేస్తున్నారని, రోజుకు ఎంత మంది చనిపోతున్నారో బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. ఒకవేళ తాను చెప్పేది అబద్ధంగా నిరూపిస్తే జైలుకు వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు. జూలై 16న రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 10మంది మాత్రమే చనిపోయారని హెల్త్ బులిటెన్‌లో చూపించారని, కానీ ఒక్క గాంధీ ఆసుపత్రిలోనే 14మంది కరోనా మరణాలు నమోదయ్యాయని వెల్లడించారు. పూర్తి ఆధారాలతో తాను మాట్లాడుతున్నానని, ఆధారాలన్నీ ఉన్నాయన్నారు. జూలై 17న కరోనా మరణాలను ప్రభుత్వం 7గా చూపించారని, అదేరోజు గాంధీ హాస్పిటల్‌లో 10 మంది చనిపోయారన్నారు.

ఈ లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కరోనాతో చనిపోతున్నారని, కానీ ప్రభుత్వం తప్పుడు లెక్కలను చూపిస్తుందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఎలాగూ చెప్పరని, కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకోరని, కనీసం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఏం సమాధానం చెప్పుతారని ప్రశ్నించారు. ఎన్ఎస్‌యూఐ ఎన్ని వాస్తవాలు చెప్పినా ప్రభుత్వం తన అనుకూల పత్రికల్లో ఇవన్నీ రాకుండా చేస్తుందని, ప్రభుత్వం అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేస్తుందనడానికి ఇదే నిదర్శనమన్నారు.

Advertisement

Next Story

Most Viewed