12 ఏళ్ల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం!

by Harish |
market
X

దిశ, వెబ్‌డెస్క్: ఆహార పదార్థాల ధరలు భారీగా పెరిగిపోవడంతో ప్రస్తుత ఏడాది నవంబర్ నెలకు సంబంధించి టోకు ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) 12 ఏళ్ల గరిష్ట స్థాయి 14.23 శాతానికి చేరుకుంది. అంతకుముందు అక్టోబర్‌లో ఐదు నెలల గరిష్ఠంతో 12.54 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్‌లో ఇది 2.29 శాతంగా ఉంది. డబ్ల్యూపీఐ సూచీ రెండంకెలకు పైగా నమోదవడం ఇది వరుసగా ఎనిమిదో నెల అని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.

ముఖ్యంగా గుడ్లు, మాంసం ధరలతో పాటు కాయగూరల ధరలు పెరగడం వల్లనే టోకు ద్రవ్యోల్బణం అత్యధికంగా నమోదైందని మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. సమీక్షించిన నెలలో ఆహార పదార్థాల ధరలు అంతకుముందు అక్టోబర్‌లో 3.06 శాతం ఉండగా, నవంబర్ నాటికి అత్యధికంగా 6.70 శాతానికి పెరిగింది. ఇంధన, విద్యుత్ ధరలు గతేడాది కంటే 39.81 శాతం పెరిగాయి. అక్టోబర్‌లో ఇది 37.18 శాతంగా నమోదవగా, తయారీ ఉత్పత్తుల ధరలు 11.92 శాతం అధికంగా ఉన్నాయి. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో సవాళ్లు కొనసాగుతుండటంతో ముడి చమురు ధరలు పెరిగాయి. దీంతో ముడి సరుకుల ఖర్చులు కూడా పెరగడం వల్లనే తయారీ వస్తువులపై ధరల ఒత్తిడి ఉందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడ్డారు. ముడిచమురు ద్రవ్యోల్బణం 91.74 శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed