‘ఇంకా నిర్ణయం తీసుకోలేదు’

by Anukaran |
‘ఇంకా నిర్ణయం తీసుకోలేదు’
X

న్యూఢిల్లీ: కర్తార్‌పుర్ కారిడార్ తెరవడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కేంద్రం తెలిపింది. అంతేకాదు, ఈ కారిడార్ గుండా భక్తుల ప్రయాణం సౌకర్యంగా సాగడానికి అవసరమైన నిర్మాణాలు చేపట్టాలని సూచించింది. కర్తార్‌పుర్ కారిడార్ తెరవడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉన్నట్టు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కారిడార్ ద్వారా పాకిస్తాన్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాను దర్శించుకోవడానికి భక్తులు వీసా లేకుండా ప్రవేశించవచ్చు. కరోనా పరిస్థితులు కుదుటపడ్డాయని పేర్కొంటూ కారిడార్ తెరిచే నిర్ణయం తీసుకున్నట్టు పాక్ మతవ్యవహారాల మంత్రి శుక్రవారం ప్రకటించారు.

ఈ ప్రకటనపై స్పందన కోరగా, ఈ అంశంపై కేంద్ర హోం, ఆరోగ్య శాఖలతో టచ్‌లో ఉన్నట్టు విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అన్నారు. కరోనా నిబంధనలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటామని వివరించారు. కారిడార్‌లో బ్రిడ్జీ సహా ప్రయాణ సౌకర్యాలు కల్పించడానికి గతేడాది పాక్‌తో అంగీకారం కుదిరిందని తెలిపారు. భారత్ వైపు అవి రెడీగా ఉన్నప్పటికీ పాక్ మాత్రం ఇంకా నిర్మాణాలు మొదలేపెట్టలేదని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed