శభాష్.. కరోనాను పొలిమెర లోనికి రానివ్వని గ్రామాలు

by Aamani |
Adilabad villages
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గాడ్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని నగరం, పెద్దపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కోలాంగూడ గ్రామాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం కాలేదు. గాడ్పూర్‌లో 40 కుటుంబాలుండగా.. సుమారు 180 మంది వరకు జనాభా ఉంది. ఇక కోలాంగూడలో 20 కుటుంబాలుండగా.. 80 మంది జనాభా ఉన్నారు. ఈ రెండు గ్రామాలకు వచ్చే అన్ని వైపులా దారులకు కంచెలు వేశారు. బయట ఊరి వారిని లోపలికి అనుమతించటం లేదు. అత్యవసరమైతే తప్పా గ్రామస్తులెవరూ బయట ఫంక్షన్లు, ప్రాంతాలు వెళ్లడం లేదు. గ్రామంలో ఇంటింటికీ సర్పంచులు సోడియం హైపో క్లోరైడ్ ద్రవాన్ని పిచికారి చేస్తున్నారు. గ్రామంలోని వారంతా తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్లు వాడటంతో వారి గ్రామాన్ని సురక్షితంగా ఉంచుకుంటున్నారు.

గిరిజన తండాలు.. కఠిన కట్టుబాట్లు

నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సీ గిరిజన తండాల్లో కూడా ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. కుభీర్ మండలం పల్సీ-రంజనీ రహదారిలో పల్సీ-1, 2 గిరిజన తండాలుండగా.. 150 కుటుంబాల్లో 680 మంది జనాభా ఉంది. మహారాష్ట్రకు సరిహద్దుల్లో ఉండగా.. ఇక్కడి వారంతా 25 ఏళ్ల క్రితం మహారాష్ట్ర నుంచి భూములు కొని సాగు చేసుకుని స్థిరపడ్డారు. ఇటీవల ఈ తండాలను జీపీలుగా మార్చగా.. కరోనా తొలి, మలి విడతల్లో కరోనా రహిత తండాలుగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. సారంగాపూర్ మండలం పెండల్దరి, ఇప్పచెల్మ మారుమూల గిరిజన గ్రామాలు ఇక్కడ కూడా ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు. అత్యవసరం ఉంటే తప్పా బయటకు వెళ్లకపోగా.. బయట గ్రామాల వారు వస్తే మాస్కు, శానిటైజర్ తప్పనిసరి చేశారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు చిన్న చిన్న గ్రామాలు, పల్లెలు, తండాలు, మారుమూల ఆదివాసీ గూడెంలు కరోనా రహిత గ్రామాలుగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. చిన్న గ్రామాల్లో తక్కువ కుటుంబాలతో పాటు జనాభా కూడా తక్కువగానే ఉంటుంది. ఇక్కడ స్థానికులంతా కలిసి కఠిన నియమాలు, నిర్ణయాలు అమలు చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలను పక్కాగా పాటిస్తున్నారు. గ్రామాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలనే నిబంధన పెట్టగా.. ఉల్లంఘిస్తే రూ.500 నుంచి వెయ్యి వరకు జరిమానాలు విధిస్తున్నారు. పల్లెలకు వచ్చే రోడ్లను కంచెలు వేసి మూసేస్తున్నారు. గ్రామస్తులు ఎవరూ బయటకు వెళ్లటానికి వీల్లేదని తీర్మానం చేశారు. అత్యవసరమైన పని ఉంటేనే.. అనుమతి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఇక శానిటైజర్లు తప్పనిసరిగా అందరూ వాడాల్సిందే. ఇక గ్రామంలో ఇంటింటికీ స్థానిక గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో శానిటైజేషన్ చేయిస్తున్నారు.

ఆహారపు అలవాట్లే కీలకమా..

ఇక మారుమూల తండాలు, గ్రామాలు, గూడెంలలో గిరిజనులు, జనాలు అవలంభించే ఆహారపు అలవాట్లు కూడా కరోనా రాకుండా ఉండేందుకు కారణమనే అభిప్రాయం లేకపోలేదు. రోగనిరోధక శక్తి పెంచే వాటిని తీసుకోవటంతో.. కరోనా దరి చేరటం లేదని చెబుతున్నారు. చాయికి బదులు డికాషన్, టిఫిన్లుగా వేడి వేడి జొన్న అంబలి, ఆహారంలో ఆకు కూరలు, దుంపలు, పప్పుదినులు, పచ్చడి, సీజనల్గా లభించే పండ్లు తీసుకోవటంతో పోషకాలు పుష్కలంగా లభించి రోగ నిరోధక శక్తి పెరుగుతోందని చెబుతున్నారు. ఇక ఇంటింటికీ ఒకటి, రెండు వేపచెట్లు పెంచటంతో స్వచ్ఛమైన గాలి వస్తోంది. మాస్కులు తప్పనిసరి చేయటంతో.. దూరంగా ఉండి మాట్లాడుతున్నారు. కరోనా నియంత్రణపై అందరికీ అవగాహన కల్పిస్తున్నారు.

ఎవరి పనుల్లో వారు బిజీబిజీ

ఉదయం లేచినప్పటి నుంచి ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు. ఉదయం పనులకు వెళ్లి మధ్యాహ్నం 12గంటల వరకు తిరిగి వస్తున్నారు. కరోనా సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకుండా.. బయట ఫంక్షన్లకు వెళ్లకుండా కట్టుబాట్లు అమలు చేస్తున్నారు. గ్రామం విడిచి ఎవరూ బయటకు వెళ్లటం లేదు. బయట వారిని ఎవరిని ఈ గ్రామాల లోపలికి అనుమతించటం లేదు. స్థానిక గ్రామ పంచాయతీలు, గ్రామాభివృద్ధి కమిటీల అనుమతి తీసుకున్నాకే రావాల్సి ఉంటుంది. సామాన్లు అవసరమైతే పది మంది కలిసి ఒకరిని పంపి తెప్పించుకుంటున్నారు. బయటకు వెళ్లి వచ్చిన వారు తప్పనిసరిగా వేడి నీటి స్నానం చేసి.. బట్టలు వేడి నీటిలో అతనే ఉతికి ఆరేసుకుంటున్నారు. ఇలా ఎవరికి వారు వ్యక్తిగతంగా కరోనా నియమ నిబంధనలు పాటించటంతో.. కరోనా రహిత గ్రామాలుగా మారాయి.

Advertisement

Next Story

Most Viewed