స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగిన పాకిస్తాన్

by Shyam |
స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగిన పాకిస్తాన్
X

దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గత కొన్ని సంవత్సరాలుగా టీం స్పాన్సర్‌గా ఉన్న పెప్సికో కంపెనీ వైదొలగడంతో ఇప్పుడు ఎలాంటి స్పాన్సర్లు లేకుండానే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. ప్రస్తుత కరోనా సంక్షోభం కారణంగా పలు క్రికెట్ బోర్డులు ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నాయి. టీం ఇండియా కిట్ స్పాన్సర్‌షిప్ నుంచి నైకీ వైదొలిగింది. ఇప్పుడు పాకిస్తాన్ టీంకు స్పాన్సర్ చేయలేమని చేతులెత్తేసింది. ఇటీవల ఆ జట్టు హెడ్ కోచ్ మిస్బా ఉల్ హక్ పాత జెర్సీని ధరించి శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నాడు. కానీ దానిలో పెప్సీ అని రాసి ఉన్న స్టిక్కర్లు అంటించుకోవడం గమనార్హం. కొత్త స్పాన్సర్ కోసం టెండర్లు పిలువగా, గతంలో పెప్సీ ఇచ్చిన ధరలో కేవలం 30శాతం మాత్రమే ఇస్తామంటూ ఒక కంపెనీ ముందుకు వచ్చింది. దీంతో ఆ టెండర్‌ను పీసీబీ రద్దు చేసింది. ప్రస్తుత ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన పాక్ జట్టు మొత్తం ఖర్చును ఈసీబీనే భరిస్తోంది. కాగా, ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లు ప్రారంభమయ్యే సమయానికి ఒక స్పాన్సర్‌ను కచ్చితంగా పట్టుకుంటామని పీసీబీ చెబుతోంది. ప్రస్తుతం చర్చల ప్రకారం ఆ స్పాన్సర్ ఒప్పుకుంటే ప్రతి ఆటగాడికి టెస్టుకు రూ.4,50,000, వన్డే, టీ20 అయితే మ్యాచ్‌కు రూ.2,25,000 ఫీజుగా లభించనున్నాయి.

Advertisement

Next Story