ప్రమోషన్లు లేవు.. పోస్టింగ్‌లు లేవు

by Shyam |   ( Updated:2021-04-05 10:00:51.0  )
ప్రమోషన్లు లేవు.. పోస్టింగ్‌లు లేవు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో చాలా కాలం తర్వాత పదోన్నతులు వస్తున్నా… ఉద్యోగులకు ఆ సంబురమే లేకుండా పోతోంది. కొన్ని శాఖల్లో అక్రమార్గంలో పదోన్నతులు కల్పిస్తుంటే… మరికొన్ని శాఖల్లో పోస్టింగ్​లు ఇవ్వడం లేదు. ఏండ్ల తరబడి ప్రమోషన్ల కోసం… నెలల తరబడి పోస్టింగ్​ల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. గతంలో జరిగిన అబ్కారీ నుంచి ఇటీవల జరిగిన పోలీసుల పదోన్నతుల వరకు పోస్టింగ్​లన్నీ పెడింగ్​లో ఉన్నాయి. దీనిపై మంత్రులు దగ్గర నుంచి ఆమోదముద్ర రావడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పలు శాఖల్లో మంత్రులు గ్రీన్​ సిగ్నల్​ ఇస్తేనే పోస్టింగ్​లు బయటకు వస్తాయంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించాలని సీఎం ఈ ఏడాది జనవరిలో ఆదేశించారు. అప్పటి నుంచి రాష్ట్రంలో ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం ఎదరుచూస్తున్న కొందరు ఉద్యోగులకు న్యాయం జరగడం లేదనే ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారుల అస్తవ్యస్థ విధానాలతో అవకతవకలు జరుగుతున్నాయని, కొన్ని శాఖల్లో కొందరు పైరవీలతో మంచి పోస్టింగులు సాధిస్తుండగా.. సీనియర్లకు కూడా కొందరికి కోరుకున్న చోట దొరకడం లేదనే ఆరోపణలున్నాయి. ఇటీవల జలవనరుల శాఖలో కొంతమంది ఉద్యోగులు కోర్టెకెక్కుతున్నారు. ప్రమోషన్లకు గతంలో మూడేళ్ల సర్వీసు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం దాన్ని రెండేళ్లకు తగ్గించడంతో ఎక్కువ మందికి పదోన్నతులు వస్తున్నాయి. ఇది ఆయా శాఖల్లో అవినీతికి దారి చూపిందనే ఆరోపణలున్నాయి. చాలా శాఖల్లో అర్హులకు ప్రమోషన్లు దక్కడం లేదని, తాత్కాలిక ప్రమోషన్లను కారణంగా చూపి శాశ్వత ప్రమోషన్లను నిలిపేస్తున్నారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి.

పోస్టింగ్​ ఏది..?

మరోవైపు కొన్ని శాఖల్లో పదోన్నతులు వచ్చినా.. పోస్టింగ్​ల కోసం బతిమిలాడుకోవాల్సి వస్తోంది. ఉదాహరణకు సీఎస్​ చేతిలో ఉండే వాణిజ్య పన్నుల శాఖలో దాదాపు 750 మందికి పదోన్నతులు కల్పించారు. వీరిలో కొంతమందిని అవే స్థానాల్లో కంటిన్యూ చేస్తున్నా.. చాలా మందికి పోస్టింగ్​ ఇవ్వడం లేదు. అదే విధంగా అబ్కారీ శాఖలో దాదాపు 4‌‌‌‌00 మందికి పదోన్నతులు కల్పించారు. కానీ ఒక్కరికి కూడా పోస్టింగ్​ కాగితాలు ఇవ్వలేదు. ఏఈఎస్​ నుంచి ఈఎస్​లకు పదోన్నతులిచ్చారు. సీఐ నుంచి ఏఈఎస్​ వాళ్ల జాబితానే సిద్ధం చేయలేదు. పదోన్నతులు కల్పించిన తర్వాత పోస్టింగ్​లు ఇచ్చి బదిలీలు చేయాల్సి ఉన్నా కేవలం ప్రమోషన్లకు పరిమితమయ్యారు. అబ్కారీ శాఖలో ఈఎస్​లుగా పదోన్నతులు వచ్చినా ఇంకా పాతస్థానాల్లోనే ఉన్నారు. రెవెన్యూలో పరిస్థితి కూడా అంతే. రిజిస్ట్రేషన్ల శాఖలో డిసెంబర్​ నుంచి పోస్టింగ్​లు లేవు. పోస్టింగ్​ల కోసం కూడా మార్పులు తీసుకువస్తామంటూ రాష్ట్ర ఉన్నతాధికారి ఫైల్​ను పెండింగ్​ పెట్టినట్లు చెబుతున్నారు. అటు సచివాలయ ఉద్యోగుల్లో కూడా అంతే. వారికి కూడా పోస్టింగ్​లు ఇవ్వడం లేదు. తాజాగా పోలీస్​ శాఖలో సీఐల నుంచి డీఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చినా వారు ఎక్కడ కూర్చుండాలో ఇంకా తెలియడం లేదు.

మంత్రులకు సమయం లేదుగా..!

మరోవైపు పోస్టింగ్​ల కోసం మంత్రులదే తుది నిర్ణయమని అధికారవర్గాలు బాహాటంగానే పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పదోన్నతులు వచ్చిన వారిని ఎక్కడెక్కడ భర్తీ చేయాలనే అంశంపై మంత్రులకు తీరిక లేదని చెబుతున్నారు. మంత్రులు చెప్పకపోవడంతో వారి పోస్టింగ్​ ఉత్తర్వులు సిద్ధం చేయడం లేదు. మంత్రులు ఖరారు చేసిన తర్వాతే పోస్టింగ్​లు వస్తాయంటూ స్పష్టంగా తెలియజేస్తున్నారు. పోలీస్​తో పాటు రెవెన్యూ, అబ్కారీ శాఖల్లో ఇది మరింత ఎక్కువగా ఉందంటున్నారు.

బల్దియాలో పొలిటికల్​ గ్రేట్​

ఇక జీహెచ్‌ఎంసీలో రాజకీయ అండదండలుంటే చాలు ఎంతటి పోస్టింగ్‌ అయినా కాళ్ల దగ్గరకు వచ్చి చేరుతుందనేది ఇప్పుడు హాట్​ టాపిక్​. మున్సిపల్‌ శాఖ అంటే అవినీతికి నిలయంగా మారిందనే విమర్శలున్నాయి. పోస్టింగ్‌లు కేటాయింపు, బదిలీల విషయంలో బంధుప్రీతి, అవినీతి, ప్రభుత్వాధినేతల అండదండల లాబీయింగ్‌తో కొంతమంది పైచేయి సాధిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న టీజీవో అధ్యక్షురాలు మమతకు ఆమె కంటే ముందు వరుసలో 22 మంది డిప్యూటీ కమిషనర్లు ఉన్నా జోనల్‌ కమినషనర్‌గా ప్రమోషన్‌ కల్పించిన విషయం పెద్ద చర్చకే దారి తీసింది. ఈ పదోన్నతిలో ఎలాంటి ప్రభుత్వ నిబంధనలు పాటించకపోవడంతో లాబీయింగ్‌ భారీ స్థాయిలో జరిగిందని, సర్కారు అండదండలతో 22 మంది అధికారులు ముందు వరుసలో ఉన్నా జోనల్‌ కమిషనర్‌గా ప్రమోషన్‌తో పాటు అత్యంత కీలకమైన కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌గా పోస్టింగ్‌ రావడం మామూలు విషయం కాదంటూ తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది. అయితే గతంలో జోనల్​ కమిషనర్​ శంకరయ్య అంశం కూడా హాట్​ టాపిక్​గానే మారింది. సికింద్రాబాద్‌ జోనల్‌ కమిషనర్‌గా పనిచేసిన శంకరయ్యకు జీహెచ్‌ఎంసీలో పోస్టింగ్‌ ఇవ్వకుండా ఎంఏయూడీకి అటాచ్​ చేశారు. శంకరయ్య మాత్రం ఎంఏయూడీలో కనీసం రిపోర్టు చేయకుండా… ఒకే రోజులో తిరిగి బల్దియాలోనే పోస్టింగ్‌ తెచ్చుకున్నారు. ఆయన్ను బల్దియాలో అడిషనల్‌ కమిషనర్‌గా నియమించడం దీనికోసం ఇచ్చిన ఉత్వరుల్లో తెలంగాణ గవర్నర్​ ఆదేశాల మేరకు అని ఇవ్వడంతో ఫైరవీలు ఎంత మేరకు జరుగుతున్నాయో అర్థమవుతోంది. ఇప్పుడు కూడా అదే కొనసాగుతుందంటున్నారు.

సీఎంకు ఫిర్యాదులు..?

పదోన్నతులు, పోస్టింగ్​ల్లో చాలా అక్రమాలు జరుగుతున్నాయంటూ సీఎం కేసీఆర్​కు నివేదించినట్లు సమాచారం. కొంతమంది ఐఏఎస్​ అధికారులే దీనిపై సీఎంకు ఉప్పందించారని టాక్​. దీంతో శాఖల వారీగా ప్రమోషన్ల జాబితా తెప్పించుకున్న సీఎం ఎలా జరిగాయనే వివరాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. బల్లియా, మున్సిపల్​, పోలీస్​, రెవెన్యూ, సచివాలయం వంటి శాఖల్లో పోస్టింగ్​లు, పదోన్నతులపై ఎవరెవరు చక్రం తిప్పారనే అంశంపై కూడా సీఎం కన్నేసినట్లు చెప్పుతున్నారు. అంతేకాకుండా పదోన్నతులు ఇచ్చి ఇంకా పోస్టింగ్​లు ఇవ్వకపోవడంపై ఉన్నతాధికారులను మందలించినట్లు అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed