నిబంధనలకు లాక్‌డౌన్

by Shyam |
నిబంధనలకు లాక్‌డౌన్
X

దిశ, వరంగల్: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి నిబంధనలు పాటించాలని ఓ పక్క ప్రభుత్వాలు, అధికారులు అవగాహన కల్పిస్తున్నా.. కొందరు వాటిని ఖాతరు చేయడం లేదు. ముఖ్యంగా ప్రజాప్రతినిధుల పర్యటనలో నాయకులు, ప్రజలు జాగ్రత్తలు పాటించడం లేదు. మరి కొన్ని ప్రాంతాల్లో అవసరం లేకున్నా ఏదో ఒక సాకుతో కొందరు రోడ్లపై తిరుగుతున్నారు. దీంతో లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండా ఆ నిబంధనలకే పలువురు లాక్‌డౌన్ విధించారు.

లాక్‌డౌన్‌లో సడలింపులు ఇచ్చిన తర్వాత రాష్ర్టంలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాజధానిలో వీటి సంఖ్య అధికంగా ఉంది. ఫలితంగా నగరంలోకి రాకపోకలు బంద్ చేశారు. అయినప్పటికీ కొంతమంది కుంటి సాకులు చెబుతూ ఊర్లకు వెళ్లి వస్తున్న ఘటనలున్నాయి. జిల్లాలో సైతం ప్రజలు ఇష్టానుసారంగా రోడ్లపైకి వస్తున్నారు. దీనికి తోడు ముఖానికి మాస్క్‌లు ధరించడం లేదు. భౌతిక దూరం అనే విషయాన్నే మరిచిపోయారు. నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలపై ముగ్గురు ప్రయాణిస్తున్నారు. ఇక ఫోర్ వీలర్‌లో నలుగురు నుంచి ఆరుగురు ప్రయాణిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉపాధి హమీ పనులు జరుగుతుండగా కూలీలు భౌతిక దూరం పాటించడం లేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా గుంపులుగా పనులు చేస్తున్నారు. నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీలో సైతం అధికారులు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవడం లేదు. ప్రజా ప్రతినిధులు వెంట పదుల సంఖ్యలో అనుచరులు, పార్టీ శ్రేణులు, అధికారులు, ప్రజలలో గందరగోళ పరిస్థితి నెలకొంటోంది. ధాన్యం, మామిడి పండ్ల కొనుగోలు సెంటర్ల ప్రారంభోత్సవాలు జాతరను తలపిస్తున్నాయి. ఆయా జిల్లాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమికూడుతున్నారు. ఇటీవల స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తన నియోజకవర్గంలోని చెరువులను పరిశీలించేందుకు 7 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు. ఆయన వెంట వందల సంఖ్యలో ప్రజా‌ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు నడిచారు. తాజాగా వరంగల్ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా షాపింగ్ మాల్ తెరిచారు. దీంతో పెద్ద సంఖ్యలో జనం దుకాణానికి రావడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న అధికారులు షాపింగ్‌మాల్‌పై కేసు నమోదు చేశారు. వరంగల్ ఎల్బీ నగర్‌లో కొందరు భౌతిక దూరం పాటించకుండా సేమ్యా ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఇదంతా పోలీసుల సమక్షంలో జరుగుతున్నప్పటికీ వారించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే విమర్శలున్నాయి.

జాగ్రత్తలు పాటించడంలో అలసత్వం

నిత్యావసర వస్తువులు, కూరగాయలు, కిరాణా షాపుల్లో పనిచేస్తున్న గుమస్తాలు, మటన్, చికెన్ వ్యాపారులు కనీస నిబంధనలు పాటించడం లేదు. సరుకులు ఇచ్చే క్రమంలో ముఖానికి మాస్క్‌లు, చేతికి గ్లౌజ్‌లు ధరించిన దాఖలాలు కనిపించడం లేదు. ప్రధానంగా మాంసం విక్రయదారులు చేతికి గ్లౌజ్‌లు ధరించకపోవడం పట్ల పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇష్టానుసారంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. భౌతికదూరం పాటించాలనే నిబంధనలు సైతం సరిగా పాటించడం లేదు. దుకాణాలకు వచ్చే వినియోగదారులు మాస్క్‌లు ధరిస్తేనే సరుకులు, ఇతరత్రా వస్తువులు ఇవ్వాలని ప్రభుత్వం, అధికారులు చెబుతున్నప్పటికీ విక్రయదారులు దాన్ని పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నవారి‌పై అధికార యంత్రాంగం నిఘా పెట్టి కఠినంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed