- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ప్రజలకు హెచ్చరిక.. జీవో జారీ చేసిన సర్కార్ ‘ఇక జైలు’కే..
దిశ. తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మాస్కులను పెట్టకోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. గతేడాది మే నెల నుంచి ఇది అమలులో ఉన్నప్పటికీ ప్రజలు నిర్లక్ష్యంగా ఉండడంతో తాజాగా మరోసారి జీవో (నెం.82) జారీ చేసింది. పబ్లిక్ స్థలాలతో పాటు ఆఫీసుల్లో, ఫ్యాక్టరీల్లో, ప్రయాణించే సమయంలో మాస్కును విధిగా పెట్టుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘించినట్లయితే వెయ్యి రూపాయల జరిమానా తప్పదని ఆ జీవోలో ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. జరిమానాతో పాటు భారత శిక్షాస్మృతిలోని 188 సెక్షన్, విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 51-60 ప్రకారం ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. మాస్కు నిబంధనను పక్కాగా అమలుచేయాలని కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం బహిరంగ స్థలాల్లో మాస్కుల వినియోగం తప్పనిసరి అనే నిబంధనకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా గతేడాది మే నెలలోనే జీవో జారీచేసింది. కొంతకాలం కఠినంగా అమలైనప్పటికీ ‘అన్‌లాక్’ సడలింపులతో అమలు అటకెక్కింది. తాజాగా సెకండ్ వేవ్ ప్రభావం రాష్ట్రంలో ఉధృతంగా ఉండటంతో సీఎస్ మరోసారి జీవో జారీచేసి నొక్కి చెప్పాల్సి వచ్చింది. రాష్ట్రంలో కేసులు పెరుగుతుండటంతో సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించి ఆంక్షలను కఠినతరం చేయాలని సూచించారు.
కొరడా ఝళిపిస్తున్న పోలీసులు
గతేడాది మార్చి 24వ తేదీ నుంచి ఈ సంవత్సరం మార్చి నెలాఖరు వరకు రాష్ట్రంలో మాస్కు ధరించని 1,16,467 మందిపై ఎపిడమిక్ చట్టం ప్రకారం పోలీసులు కేసులు నమోదు చేశారు. సుమారు రూ. 11.02 కోట్ల మేర జరిమానా విధించారు. ఇక కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకు 62,220 మందిని అరెస్టు చేశారు. ఇక సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం, ఎక్కువ సంఖ్యలో జనం గుమికూడేలా సభలను, సమావేశాలను నిర్వహించడం లాంటి ఉల్లంఘనలకు పాల్పడినందుకు 2,778 మందిపైన కేసులు నమోదయ్యాయి.
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేసినందుకు పోలీసులు ఆరుగురిమీద కేసులు పెట్టారు. అన్ని రకాల కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు పోలీసులు ఈ ఏడాది కాలంలో మొత్తం రూ. 58.92 కోట్ల మేర జరిమానా వసూలు చేశారు. ఈ వివరాలన్నింటినీ డీజీపీ స్వయంగా ఒక నివేదికను తయారుచేసి హైకోర్టులో ఇటీవల సమర్పించారు. అయితే వీటిని పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లి నేతృత్వంలోని ధర్మాసనం కరోనా నిబంధనలను ఉల్లంఘించినవారి పట్ల ప్రభుత్వం తీసుకున్న చర్యలు సంతృప్తికరంగా లేవని, మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ప్రధాన కార్యదర్శి తాజాగా జీవో జారీ చేసి కఠినంగా అమలు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లను ఆదేశించడం గమనార్హం.
మొక్కుబడి తనిఖీలు ఇక సీరియస్?
గతేడాది నుంచి కరోనా నిబంధనలు అమలులో ఉన్నప్పటికీ పటిష్టంగా అమలుచేయడంలో ప్రభుత్వ యంత్రాంగం చూసీ చూడనట్లుగా వ్యవహరించింది. ముఖ్యంగా గతేడాది అక్టోబర్ నుంచి పరిస్థితిని లైట్‌గా తీసుకోవడంతో ప్రజలు కూడా విచ్చలవిడిగా రోడ్లమీదకు వచ్చారు. ఈ విషయాన్ని నొక్కిచెప్పిన ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ ఆ నిర్లక్ష్యమే ఇప్పుడు సెకండ్ వేవ్ ముప్పునకు కారణమైందని, ఆంక్షలను ఇకపైన కఠినంగా అమలు చేయాల్సిన పరిస్థితికి దారి తీసిందని వ్యాఖ్యానించారు. ఆ వెలుగులోనే ఇప్పుడు ప్రధాన కార్యదర్శి జీవో జారీ చేసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. వ్యాక్సిన్ తీసుకున్నా మాస్కును పెట్టుకోవడం ఒక నిర్బంధ క్రమశిక్షణగానే అమలుచేయనున్నట్లు స్పష్టమవుతోంది.
ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్, పురపాలక శాఖలు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి మాస్కులు పెట్టుకోనివారిపై కేసుల నమోదలు మొదలు స్పాట్ ఫైన్ వసూళ్ల వరకు కఠినంగానే వ్యవహరించే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా భారీ సంఖ్యలో రాజకీయ నేతలు, కార్యకర్తలు, ప్రజలు గుమికూడడం ఆ జిల్లాలో కేసులు పెరగడానికి కారణమైంది. ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని టీఆర్ఎస్ జిల్లా నేతలు ఏర్పాట్లు చేస్తున్నందున కొవిడ్ నిబంధనల్లోని ఫిజికల్డిస్టెన్స్, మాస్కు పెట్టుకోవడం లాంటివాటిని పోలీసులు ఏ మేరకు పక్కాగా అమలు చేస్తారన్న ఆసక్తి నెలకొంది.