ఆ రెండు జిల్లాల్లో ఆంక్షలు తొలగించినట్టేనా?

by srinivas |   ( Updated:2020-04-19 03:06:00.0  )
ఆ రెండు జిల్లాల్లో ఆంక్షలు తొలగించినట్టేనా?
X

ఆంధ్రప్రదేశ్‌లోని 11 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం రెడ్‌జోన్‌లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ మాత్రం రెడ్‌జోన్లు కేవలం 97 మండలాలేనని చెబుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాదన సంగతి పక్కనపెడితే.. కరోనా వైరస్ ఏపీలోని రెండు జిల్లాల జోలిక వెళ్లలేదు. కరోనా వైరస్ వెలుగు చూసి నెల రోజులు కావస్తున్నా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో దాని ప్రభావం లేదు. దీంతో ఈ రెండు జిల్లాలు గ్రీన్‌జోన్‌లోనే ఉన్నాయి.

ఈ నెల 20వ తేదీ నుంచి దశల వారీగా లాక్‌డౌన్ సడలింపు ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపటి నుంచి ఈ రెండు జిల్లాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు పూర్తిగా సడలించనున్నారా? లేదా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. లాక్‌డౌన్ సడలింపుపై జీవో విడుదల చేసిన ఏపీ గవర్నమెంట్.. తెరుచుకోవాల్సిన పరిశ్రమలు, శాఖలపై స్పష్టత ఇచ్చింది. కానీ ఈ రెండు జిల్లాలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అదే సమయంలో గ్రీన్‌జోన్ ప్రాంతాలపై ఆంక్షలు సడలించవచ్చని సూచించింది. దీంతో గందరగోళం నెలకొంది.

వ్యవసాయాధారిత జిల్లాలుగా ప్రసిద్ధికెక్కిన ఈ రెండు జిల్లాల్లో ప్రస్తుతం రబీ పంట కోతల సీజన్ నడుస్తోంది. మరోవైపు మినప, పెరస, నువ్వుల పంటలు కోతకు వచ్చాయి. ఈ నేపథ్యంలో పంట పొలాల్లో ఎక్కువ మంది పని చేయాల్సి ఉంటుంది. చేలను వాహనాల్లో ఎక్కించే సమయంలో ఒకరితో ఒకరికి సంబంధం పెరుగుతుంది. అలాగే పంటను నూర్చే సమయంలో కూడా ఒకరితో ఒకరికి కాంటాక్ట్ ఉంటుంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ సడలింపు వారికి ఊరట కలిగిస్తుంది.

ఈ రెండు జిల్లాల సరిహద్దులను నియంత్రించి, ఈ జిల్లాల్లో ఆంక్షలు సడలించాలన్నది స్థానిక ప్రజల కోరిక. మరోవైపు సుమారు నెల రోజులుగా ఉపాధి లేకపోవడంతో లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన వెంటనే ఉపాధి హామీ పధకం పనులు కూడా ప్రారంభించాలని వారు కోరుకుంటున్నారు.

Tags: vizianagaram, srikakulam, lockdown free, green zone districts

Advertisement

Next Story