వైఎస్ఆర్ సంస్మరణ సభ.. జగన్ ను దూరం పెట్టిన విజయమ్మ

by srinivas |   ( Updated:2021-09-02 04:54:26.0  )
వైఎస్ఆర్ సంస్మరణ సభ.. జగన్ ను దూరం పెట్టిన విజయమ్మ
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ వర్థంతి సందర్భంగా ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ వైఎస్ఆర్ సంస్మరణ సభకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో ఈ సంస్మరణ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి 500 మంది కీలక నేతలకు ఆహ్వానం పలికారు. విజయమ్మ ఆహ్వానం అందుకున్న వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు సైతం ఉన్నారు. వైఎస్ఆర్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగిన ప్రస్తుత మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, ధర్మాన ప్రసాదరావులు ఉన్నారు. మరికొందరికి వైఎస్ విజయమ్మ ఫోన్‌ చేసి మరీ స్వయంగా ఆహ్వానించారు. కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వైసీపీ నేతలు వైఎస్ఆర్ సంస్మరణ సభకు హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.

ఈ సభకు దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ అధిష్టానం నుంచి సూచన అందినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వెళ్లకపోవడమే మంచిదనే భావనలో వైసీపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత వైఎస్ విజయమ్మ ఆహ్వానం మేరకు మంత్రి బొత్స వెళ్తారంటూ వార్తలు వినిపించాయి. కానీ, ఆయన సైతం వెళ్లడం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే గురువారం కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఏపీ సీఎం వైఎస్ జగన్ దంపతులతో పాటు ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్, షర్మిల కనీసం పలకరించుకోలేదు. కనీసం ఒకరినొకరు చూసుకోలేదు. అంతేకాదు వైఎస్ జగన్ ఒకచోట, షర్మిల-విజయమ్మలు వేర్వేరుగా కూర్చున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed