ఆదాయం అంతంతే.. మరి బడ్జెట్ ఎలా..?

by Shyam |   ( Updated:2021-05-25 11:36:09.0  )
ఆదాయం అంతంతే.. మరి బడ్జెట్ ఎలా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో భారీ అంచనాలే పెట్టుకుంది. ప్రతీ నెలా సగటున రూ. 14,677 కోట్ల చొప్పున ఆదాయం వస్తుందని అంచనా వేసుకుంది. ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలు తదితరాలకు నెలకు రూ. 14,115 కోట్లు ఖర్చు చేయాలని లెక్కలు వేసుకుంది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా అవన్నీ తలకిందులయ్యాయి. ఆర్థికశాఖ వర్గాల సమాచారం ప్రకారం కేవలం 25% మాత్రమే ఏప్రిల్ నెలలో స్వీయ ఆర్థిక వనరులు సమకూరాయి. ఉత్పత్తి, సేవల రంగాలు కూడా నైట్ కర్ఫ్యూ కారణంగా ఏప్రిల్ నెలలో, లాక్‌డౌన్ కారణంగా మే నెలలో దెబ్బతిని కేవలం 20-25 శాతం మాత్రమే ఈ-వే బిల్లులు జనరేట్ అయినట్లు వాణిజ్య వర్గాల సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంది.

నైట్ కర్ఫ్యూ, లాక్‌డౌన్ ఎలా ఉన్నా నెలవారీ కొన్ని ఖర్చులను మాత్రం తగ్గించుకునే అవకాశం లేకపోయింది ప్రభుత్వానికి. ఉద్యోగుల వేతనాలు, ఆసరా పింఛను లాంటి కొన్ని అవసరాలకు నిధులను విడుదల చేయక తప్పలేదు. కల్యాణలక్ష్మి, వివిధ సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే ఆర్థిక సాయం లాంటివన్నీ తాత్కాలికంగా ఆగిపోయాయి. ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించినా నిధులు లేని కారణంగా వాయిదా పడింది. కొన్ని శాఖలకు కేటాయించిన నిధులను ఇప్పుడు పోలీసు, వైద్యారోగ్య శాఖలకు మళ్ళించక తప్పని పరిస్థితి ఏర్పడిందని స్వయంగా ముఖ్యమంత్రే ఇటీవల వ్యాఖ్యానించారు.

తక్షణ అవసరాలకు నిధులెట్లా?

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి రెండు నెలలు ఎలాగో గడిచిపోయాయిగానీ ఇప్పుడు జూన్ నెలలో భారీ ఖర్చులే ప్రభుత్వానికి తలనొప్పిగా మారనున్నాయి. వానాకాలం సాగు సీజన్‌లో జూన్ నెల మొదటి వారానికి విధిగా రైతుబంధు కోసం రూ. 7,400 కోట్లను విడుదల చేయాల్సి ఉంది. తక్షణం వ్యాక్సిన్ అవసరాల కోసం గ్లోబల్ టెండర్లకు రూ. 2,500 కోట్లను చెల్లించాల్సి వస్తున్నది. ఇక ఇంటింటి ఫీవర్ సర్వేలో భాగంగా కొవిడ్ మెడికల్ కిట్ల కోసం అదనంగా మరికొంత వెచ్చించాల్సి వస్తున్నది. వైద్య మౌలిక సదుపాయాల కోసం, అదనపు బెడ్‌ల కోసం, వైద్య ఉపకరణాల కోసం ఇంకొంత ఖర్చు చేయాల్సి ఉంది. ఈ అవసరాలన్నింటికీ తగినంత ఆదాయ వనరులు లేకపోవడంతో నిధులను సమీకరించుకోవడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.

ప్రస్తుతం కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ కూడా వచ్చిపడిందని, రాష్ట్ర ప్రజలు మాత్రమే కాక ఇతర రాష్ట్రాల పేషెంట్ల భారం కూడా మనమీదే పడిందంటూ స్వయంగా సీఎం కేసీఆర్ రెండు రోజుల క్రితం సమీక్షా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి రిజర్వు బ్యాంకు నుంచి రూ. 8,000 కోట్లను రుణంగా సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే రూ. 5,500 కోట్లను సమకూర్చుకున్నది. ఈ నెల చివరకు మరో వెయ్యి కోట్ల రూపాయలను తీసుకోవాలనుకుంటోంది. రెండు నెలల్లో కేవలం ఐదు వేల కోట్లను మాత్రమే రుణంగా తీసుకోవాలని ప్లాన్ వేసుకున్నా రూ. 6,500 కోట్లను తీసుకున్నట్లయింది. “అవసరమైతే అప్పులైనా చేద్దాం“ అని కరోనా ఖర్చులపై రెండు రోజుల క్రితం సీఎం వ్యాఖ్యానించడం గమనార్హం.

లాక్‌డౌన్ పెట్టినా మద్యం ఆదాయం తగ్గలేదు

కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ప్యూ, లాక్‌డౌన్ లాంటివి పెట్టి ఆంక్షలు విధించినా మద్యం ఆదాయం మాత్రం లెక్కల ప్రకారమే వచ్చింది. గత నెలలో రూ. 2,269 కోట్లు రాగా ఈ నెలలో ఇప్పటికి పాతిక రోజుల్లో రూ. 1,654 కోట్లు వచ్చింది. ఈ నెలలో స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ఆదాయం పూర్తిగా ఆగిపోయింది. ఏప్రిల్ నెలలో వెయ్యి కోట్లు వస్తుందని అంచనా వేసుకున్నా రూ. 717 కోట్లు మాత్రమే వచ్చింది. లాక్‌డౌన్ కారణంగా దుకాణాలు కేవలం నాలుగు గంటల సడలింపు సమయానికి మాత్రమే పరిమితం కావడంతో జీఎస్టీ ఆదాయం కూడా పెద్దగా వస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ ఆశలేమీ లేవు. వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రషన్లు, అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు, వాహనాల రాకపోకలు అన్నీ స్తంభించిపోవడంతో పెట్రోలు అమ్మకాల ద్వారా సమకూరే వాణిజ్య పన్నుల వసూళ్ళు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.

ఇన్ని ఆర్థిక సవాళ్ళ నడుమ జీతాలకు రూ. 3,500 కోట్లు, ఆసరా పింఛనులాంటివాటికి రూ. 1000 కోట్లు, వ్యాక్సిన్ కోసం రూ. 2,500 కోట్లు, వైద్య అవసరాలకు మరికొన్ని నిధులు లాంటి చెల్లింపులకు ప్రభుత్వం ఎలా సర్దుబాటు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇవేవీ వాయిదాలు వేయడానికి ఆస్కారంలేని ఖర్చులు. ఇక ప్రస్తుత బడ్జట్‌లో రూ. 5,225 కోట్లను రైతుల రుణమాఫీ కోసం కేటాయింపులు చేసింది. సహజంగా వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే వీటిపై ప్రకటన, నిధుల విడుదల ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రకటన చేస్తుందనేది అనుమానంగానే ఉంది. గతేడాది ఎదుర్కొన్న ఇబ్బందులే ఈసారి కూడా తొలి త్రైమాసికంలో చవిచూస్తున్నందున మళ్ళీ వివిధ రూపాల్లో అప్పులు తప్ప మరో మార్గం లేదనే అభిప్రాయం ఆర్థిక నిపుణుల వ్యక్తమవుతోంది.

Advertisement

Next Story