ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరిది అదే దారి..

by Anukaran |
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరిది అదే దారి..
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : ప్రత్యేక రాష్ర్టం వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడిన నిరుద్యోగులకు ఏడేళ్లు గడిచినా నిరాశే మిగిలింది. ఎమ్మెల్సీ ఎన్నికల ముందైనా ఏవైనా నోటిఫికేషన్లు వస్తాయనుకున్నా అవేవీ రాలేదు. ఎమ్మెల్సీ అభ్యర్థులు సైతం నిరుద్యోగుల కోసం ఎటువంటి ఎజెండాలు లేకుండా ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. ప్రధాన పార్టీల మధ్యన మాటల యుద్ధం నడుస్తోందే తప్పా.. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఎటువంటి జెండా.. ఎజెండాలు కన్పించడం లేదు. ఓ పార్టీపై మరో పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల్లో మేము గెలిస్తే నిరుద్యోగుల కోసం ఇది చేస్తామని ఖచ్ఛితంగా చెప్పలేకపోతున్నారు. దీనికి కారణం గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమే ఇందుకు కారణమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నిరుద్యోగులకు ఎటువంటి వరాలు కురిపించకపోగా, వారి సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

నిరుద్యోగులకు భరోసా ఏదీ..?

రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో 5,21,386మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. వీరిలో నిరుద్యోగులైన ఓటర్లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ఇప్పటి వరకు ఏ పార్టీ అభ్యర్థి ప్రకటన చేయకపోవడం గమనార్హం. ప్రధాన పార్టీల తరపున వాణిదేవి(టీఆర్ఎస్), రాంచందర్‌రావు(బీజేపీ), చిన్నారెడ్డి(కాంగ్రెస్), ఎల్.రమణ(టీడీపీ) ఎమ్మెల్సీ బరిలో పోటీ చేస్తుండగా, స్వతంత్రులుగా ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్, ప్రైవేట్ జూనియర్ కాలేజీల అధ్యక్షుడు గౌరీసతీష్ తదితర ముఖ్యనేతలు తలపడుతున్నారు. వీరిలో నిరుద్యోగ సమస్యపై అందరికి అవగాహన ఉంది. గతంలో వాణీదేవి విద్యావేత్తగా పనిచేయగా, రాంచందర్‌రావు, చిన్నారెడ్డి, ఎల్.రమణ, నాగేశ్వర్‌రావు, దిలీప్‌కుమార్ చట్టసభల్లో కీలకంగా వ్యవహారించినవారే. బరిలో నిలిచిన అభ్యర్థులందరికీ సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉండడంతో నిరుద్యోగ యువత ఏదైనా వరాలు జల్లు కురిపిస్తారనే ఆశతో ఉన్నారు. కానీ ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న వారు.. ఆ పార్టీల ఎజెండాతోనే వారు పోటీకి దిగడం.. ప్రచారంలో పాల్గొంటుడమే కారణంగా కనిపిస్తోంది. ప్రశ్నించే గొంతులమంటూ విపక్ష పార్టీల అభ్యర్థులు సైతం విమర్శలకే పరిమితమవుతున్నారు.

కేటీఆర్ ప్రకటనతో ఆయోమయం..

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి ముందు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రాష్టంలో లక్షా 32వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 50వేల ఉద్యోగాలకు నోటీఫికేషన్ రానుందని ప్రకటించారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలతోపాటు నిరుద్యోగ యువత నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కేటీఆర్ ప్రకటనతో మంత్రులకు అడుగడునా నిరసనలు వెల్లువెత్తున్నాయి. మంత్రులు ఎర్రబెల్లి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ఉద్యోగ నియామకాలపై మాట్లాడుతుండగా.. అన్నివర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి తోడు తాజా ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మరోసారి బీజేపీ తరఫున బరిలో దిగారు. గతంలో ఈయన నిరుద్యోగుల పక్షాన పోరాడిన దాఖాలాల్లేవని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ తరపున పోటీ చేస్తున్న చిన్నారెడ్డి, ఎల్.రమణ సైతం గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్నా.. నిరుద్యోగ నిర్మూళనకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శిస్తున్నారు. కనీసం ఇప్పటికైనా పోటీలో ఉన్న అభ్యర్థులు నిర్దిష్టమైన ఏజెండాతో వస్తే మంచిదని నిరుద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed