డల్లాస్, ఇస్తాంబుల్ అంటే ఇదేనా..!

by Anukaran |
డల్లాస్, ఇస్తాంబుల్ అంటే ఇదేనా..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: పాలకులకు ముందు చూపు కరువైంది. ఫలితంగా నేడు హైదరాబాద్ నగరం వరదల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. ఆరేండ్ల క్రితమే సీఎం కేసీఆర్ హైదరాబాద్‌ను డల్లాస్, పాతబస్తీని ఇస్తాంబుల్ లాగా చేస్తానని హామీ ఇచ్చారు. రూ.20 వేల కోట్లతో ప్రగతి భవన్, రాజ్‌భవన్‌ల ముందే కాదు.. సిటీలో ఎక్కడా ఏ బస్తీ ముంపునకు గురి కాకుండా చేస్తామన్నారు. కానీ నేటికీ ఆ హామీలు నీటిమూటలయ్యాయి. ఇటీవల పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం రూ.65 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. ఆరేండ్లయినా వరద ముప్పు యథాతథంగా కొనసాగుతోంది. లక్షలాది మందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మరి మా కెందుకు ఈ దుస్థితి అని ముంపు బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చిన్నబోయిన నాలాలు

గ్రేటర్‌ హైదరాబాద్‌లో 390 కి.మీ. మేర 77 నాలాలు ఉన్నాయి. వర్షం వచ్చినప్పుడే కాదు.. ఎప్పుడైనా ఎవరైనా పడితే మళ్లీ దొరకడం కష్టం. 77 నాలాల్లో ఐదు హుస్సేన్‌సాగర్‌లోకి, మిగతావన్నీ మూసీలో కలుస్తున్నాయి. 390 కి.మీ. దూరం వ్యాపించిన నాలాలన్నీ ఆక్రమణకు గురయ్యాయి. నాలాలపై అగ్గిపెట్టెల మాదిరి ఇండ్లు కట్టారు. కబ్జాలతో నాలాలన్నీ కుచించుకు పోయాయి.

విల్లాలకూ ముప్పు

మణికొండలో ఓ ప్రధాన సంస్థ విల్లాలు నిర్మించింది. ఒక్కొక్క విల్లా విలువ రూ.6 కోట్ల పైమాటే.. దాంట్లోనూ వరద ముప్పుకు మోకాళ్ల లోతు నీళ్లు వచ్చి చేరాయి. ఇలా అనేక ప్రాంతాల్లోనూ వరద ముప్పు కనిపించింది. పక్కనే ఉన్న నాలాలను చిన్నగా చేయడం వల్లే రూ.కోట్ల విలువైన విల్లాల యజమానులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. నిర్మాణ సంస్థల కక్కుర్తి, అనుమతులు జారీ చేసిన అవినీతి అధికారులే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మోస్తరు వర్షం కురిస్తే అంతే..

ఒక మోస్తరు వర్షం కురిసినా నగరంలో ఇబ్బంది పడే ప్రజల సంఖ్యను తెలుసుకుంటే గుండె తరుక్కుపోతోంది. 80 లక్షల జనాభాలో పది లక్షలకు పైగా జనం తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఇంత మంది నివసించే ప్రాంతాల్లోకి నీళ్లు చేరుతున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ లెక్కల ప్రకారం ముంపునకు గురయ్యే ప్రాంతాలు 45కి పైగానే ఉన్నాయి. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు 14 వరకు ఉన్నాయి. ఛత్రినాక, లలితాబాద్‌, ఇంజన్‌బౌలి, పూల్‌బాగ్‌, తలాబ్‌కట్ట, లంబాడిబస్తీ, ఫిలింనగర్‌, బోరబండ, పర్వత్‌నగర్‌, మైత్రీనగర్‌, శ్రీహరికాలనీ, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, టోలీచౌక్‌, సికింద్రాబాద్‌, నాంపల్లి, రవీంద్రభారతి, ఆబిడ్స్‌, కోఠి, దిల్‌సుఖ్‌నగర్‌, మెహిదిపట్నం, తిలక్‌నగర్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, హైటెక్‌సిటీ, కొండాపూర్‌.. ఇప్పుడేమో శివారు ప్రాంతాలనేకం జత కలిశాయి.

ముంపునకు గురయ్యే సమస్యాత్మక ప్రాంతాలు

లోతట్టు ప్రాంతం ఇండ్ల సంఖ్య జనాభా
నవాబ్‌సాహెబ్‌కుంట 1000 6000
ఫరూక్‌నగర్‌ 900 5000
ఫాతిమానగర్‌ 2100 10000
తలాబ్‌కుంట 44500 1,20,000
భవానీనగర్‌ 4850 19800
హఫీజ్‌బాబానగర్‌ 3000 20000
పటేల్‌నగర్‌ 450 1600
బిలాల్‌నగర్‌ 3000 15000
నాగమయ్యకుంట 650 3500
ప్రకాశ్‌నగర్‌ 1170 8000
పద్మకాలనీ 300 6000
ప్రేంనగర్‌ 3000 20000
బతుకమ్మకుంట 13000 55000
మొత్తం 1,29,070 2,89,900

శాఖల మధ్య సమన్వయ లోపం

శాఖల మధ్య సమన్వయ లోపంతో రికార్డుల్లో చెరువుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. పట్టా భూములు ఎఫ్‌టీఎల్‌గా, ఎఫ్‌టీఎల్‌ భూములు పట్టాలుగా మారాయి. క్యాచ్‌మెంట్‌ ఏరియాలూ మారిపోయాయి. ఎన్‌ఓసీల జారీలో పెద్ద దందా సాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. రికార్డుల్లో నాలాల దారులను మార్చేశారు. ఆరేండ్లుగా అధికారుల్లో నిర్లక్ష్యం ఆవహించింది. బఫర్‌ జోన్‌ కాకెత్తుకెళ్లింది. భారీ నిర్మాణాలు వెలిశాయి. చెరువు స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని హైకోర్టు, సుప్రీంకోర్టు, లోకాయుక్త, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో స్థానికులు, స్వచ్చంధ సంస్థలు, పర్యావరణవేత్తలు కలిసి 150కి పైగా కేసులు వేశారు.

హెచ్ఎండీఏ పరిధిలోని ఓ చెరువు విస్తీర్ణం 1200 ఎకరాల ఉండేది. దాన్ని 800 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు ఇరిగేషన్‌, రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. విచిత్రమేమిటంటే హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌ 2031లో 200 ఎకరాలే ఉన్నట్లు చూపించారు. శాఖల మద్య సమన్వయంతో ఎకరాల కొద్దీ కబ్జారాయుళ్లు మింగేశారు. ఫలితంగా ఏ కాలనీలను చూసినా వరద నీటితో చెరువులను తలపిస్తున్నాయి. చిన్నపాటి వర్షానికే నగరం చిత్తడిగా మారుతోంది. అధికారుల్లో నిర్లక్ష్యం, పాలకుల్లో ఆలోచనా ధోరణి మారితే కానీ నగరం బాగుపడదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed