పార్లమెంట్‌లో ఎంపీల పీఏలకు నో ఎంట్రీ

by Shamantha N |
పార్లమెంట్‌లో ఎంపీల పీఏలకు నో ఎంట్రీ
X

దిశ, న్యూస్ బ్యూరో: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఎప్పుడు ప్రారంభం కానున్నాయో స్పష్టత లేదు గానీ, ఈసారి మాత్రం కేవలం ఎంపీలకు మాత్రమే పార్లమెంటు భవనంలోకి ప్రవేశం ఉంటుందని, వారి వెంట వ్యక్తిగత కార్యదర్శులు, సహాయకులకు మాత్రం ప్రవేశం ఉండదని లోక్‌సభ సచివాలయం స్పష్టం చేసింది. కరోనా వైరస్ ఉధృతి దృష్ట్యా సభ్యుల రక్షణ, భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోక్‌సభ సెక్రటరీ జనరల్ స్నేహలత స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాలకు మాత్రమే కాక ఇప్పటి నుంచే ఈ ఆంక్షలు అమలులోకి వస్తున్నట్లు లోక్‌సభ సచివాలయ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

ఒకవైపు వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు తీసుకుంటునే మరోవైపు ఆంక్షలను విధించడం తప్పదని ఆ అధికారి వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వమే సోషల్ డిస్టెన్స్ నిబంధన గురించి నొక్కి చెప్తున్నందున ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సెక్రటరీ జనరల్ వివరించారు. సభ్యులంతా పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వారి వ్యక్తిగత సహాయకులు, వ్యక్తిగత కార్యదర్శులను పార్లమెంటు భవనంలోకి రాకుండా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు వారి పీఏ, పీఎస్‌లు సుమారు 800 మందికి పైగానే ఉన్నారని, ఒక్కసారిగా పార్లమెంటు సమావేశాల సందర్భంగా భవనంలోకి వీంతా వస్తే సోషల్ డిస్టెన్స్ నిర్వహణ కష్టసాధ్యంగా మారుతుందని పార్లమెంటు భద్రతా విభాగం అధికారులు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని సెక్రటరీ జనరల్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed