దసరాకు గిరాకీ నిల్లు.. ఆన్‌లైన్ షాపింగ్ ఫుల్లు

by Shyam |
దసరాకు గిరాకీ నిల్లు.. ఆన్‌లైన్ షాపింగ్ ఫుల్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వైరస్ కారణంగా ప్రజలు బయటికు రాలేని దుస్థితి. దానికి తోడు వరదలు.. ఇంకేముంది పండుగ కళ తప్పింది. దీంతో వస్త్ర వ్యాపారం దివాళా తీసింది. పెళ్లిళ్లు లేవు. ఉన్నా సాగని అమ్మకాలు. పండుగలకూ కొత్త బట్టలకు జనం దూరమవుతున్నారు. కరోనా వైరస్‌తో సర్దుకుపోయే రోజులతో వ్యాపార వర్గం తీవ్ర నష్టాలకు గురవుతోంది. ప్రధానంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, భూదాన్ పోచంపల్లి కేంద్రాల్లో వస్త్ర వ్యాపారం ప్రతి రోజూ రూ.కోట్లల్లో సాగేది. ఇప్పుడది రూ.లక్షల్లో కూడా సాగడం లేదు. ఆఖరికి వ్యాపారులు దుకాణాల కిరాయిలు కట్టలేని పరిస్థితులు దాపురించాయి. కరోనా తర్వాత పుంజుకుంటుందనుకున్న వ్యాపారానికి భారీ వర్షాలు కూడా శాపంగా మారాయి. ప్రతి దుకాణంలో గతంతో పోల్చితే 10 శాతం కూడా గిరాకీ లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దసరా, దీపావళి మధ్య కాలంలో కళకళలాడే మార్కెట్లు బోసిపోయి కనిపిస్తున్నాయి.

హైదరాబాద్‌లోని మదీనా, సికింద్రాబాద్ మార్కెట్లలో శనివారం.. దసరాకు ముందు రోజు కూడా దుకాణాల్లో కస్టమర్లు లేరు. వేలాది షాపుల్లో ఒక్కరంటే ఒక్క వినియోగదారుడు లేకుండా ఖాళీగా కనిపించాయి. అలాగే కొత్తపేట పీవీటీ, ఎల్బీనగర్ ఎల్పీటీ వంటి ప్రధాన మార్కెట్లు కూడా బోసిపోయి కనిపించాయి. లాక్‌డౌన్‌తో తీవ్ర నష్టాలకు గురయ్యారు. సూరత్, ముంబయి నుంచి వచ్చే వస్త్రాల దిగుమతి సగానికి పడిపోయినట్లు తెలుస్తోంది. ప్రతి రోజూ బిజినెస్ కేంద్రాల్లో వందల సంఖ్యలో వ్యాపారులు వెళ్తుండేవారు. ఇప్పుడు రవాణా రంగం కుదుటపడలేదు. దానికి తోడు కరోనా వైరస్‌తో ప్రతి కుటుంబం ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఈ మహమ్మారితో సగటు వినియోగదారుడి జీవనశైలిలోనూ మార్పులు కనిపిస్తున్నాయి. పండుగకూ కొత్త బట్టలు కొనుగోలు చేయాలన్న ఆసక్తి కనిపించడం లేదు. ప్రతి దసరాకూ షాపింగ్ చేసే ఎగువ మధ్యతరగతి వర్గాలు కూడా ఈ ఏడాది దూరమయ్యారు.

జోరుగా ఆన్‌లైన్ వ్యాపారం

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆన్‌లైన్ వ్యాపారం రెట్టింపయ్యింది. రిటైలర్స్, హోల్‌సేల్ మార్కెట్లను పూర్తిగా దెబ్బ తీస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్క క్లిక్‌తోనే అవసరమైన వస్తువులన్నీఇంటికొస్తుండడంతో మోజు పడుతున్నారు. ఈ క్రమంలో వస్త్రాలు, డ్రెస్సుల కొనుగోళ్లన్నీ ఆన్‌లైన్‌లోనే సాగుతున్నాయి. దాంట్లో రిటర్న్ ఫెసిలిటీ కూడా ఉండడంతో యువత మొగ్గు చూపుతున్నారు. దానికి తోడు షాపింగ్ వెళ్తే కరోనా వైరస్ ఎక్కడ సోకుతుందోనన్న ఆందోళన ఇంకనూ వీడలేదు. ఈ క్రమంలోనే చాలా మంది ఆన్ లైన్ కొనుగోళ్లు సాగిస్తున్నారు. షోరూం, దుకాణాల్లో కంటే అత్యధిక డిజైన్లను వెబ్ సైట్లు, షాపింగ్ పోర్టళ్లల్లో దర్శనమిస్తున్నాయి. వాటిలోనూ వయసు, సైజులను బట్టి ఏవైనా అందుబాటులో కనిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే రాష్ట్రంలో రూ.వేల కోట్లల్లో ఆన్‌లైన్ వ్యాపారం సాగుతోంది. ఆన్‌లైన్ వ్యాపారం ద్వారా ప్రభుత్వానికి పన్నుల రూపేణా ఏ స్థాయిలో ఆదాయం లభిస్తుందో అంతుచిక్కడం లేదు. జీఎస్టీ చెల్లింపులపైనా అనేక సందేహాలు ఉన్నాయి. అయితే ఈ ఆన్‌లైన్ బిజినెస్‌తో షోరూంలు, దుకాణాలు పెట్టుకున్న వ్యాపారులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎవరూ షాపింగ్‌కు వచ్చే పరిస్థితి లేకుండా అనేక ఆఫర్లను కూడా ప్రకటిస్తుండడంతో ఆకర్షితులవుతున్నారు.

ఆన్‌లైన్‌లో ఇక్కత్

వస్త్ర వ్యాపారంలో యువత మాత్రం కొత్త సూత్రాలతో లాభాలు గడిస్తున్నారు. ప్రధానంగా భూదాన్ పోచంపల్లిలో మాస్టర్ వీవర్లు, వారి సంతానం ఆన్‌లైన్ వ్యాపారాన్ని బాగానే కొనసాగిస్తున్నట్లు చేనేత రంగ నిపుణుడు తడక యాదగిరి చెప్పారు. చాలా మంది వెబ్‌సైట్లను ఏర్పాటు చేసుకున్నారు. సోషల్ మీడియానూ వినియోగించుకుంటున్నారు. వారి దగ్గరున్న చీరెల ఫోటోలు, వాటి డిస్క్రిప్షన్, రేట్లను పేర్కొంటున్నారు. అవసరమైన కస్టమర్లు ఆర్డర్లు చేస్తున్నారు. ఉచితంగానే డెలివరీ చేస్తుండడంతో కొందరి వ్యాపారంలో పెద్ద నష్టం వాటిల్లలేదు.

అయితే షోరూంలు, దుకాణాలు పెట్టుకొని వ్యాపారాన్ని నమ్ముకున్న వారి పరిస్థితి దారుణంగా మారింది. ఆఖరికి నెల కిరాయిలు కట్టలేక, గుమస్తాలకు జీతాలు కూడా ఇవ్వలేని దైన్యం వ్యాపారుల్లో నెలకొందన్నారు. కరోనా ఎఫెక్ట్‌తో కొందరు దుకాణాలే తీయడం లేదు. మరొకొందరేమో వారి దుకాణాల్లో మొత్తం స్టాకును ఆఫర్ల మీద అమ్మేసి మూసేయాలన్న నిర్ణయాలకు వచ్చిన వ్యాపారులు కూడా ఉన్నారు. అప్పులన్నీ చెల్లించి ఏదో ఒక పని చేసుకోవడం మంచిదన్న అభిప్రాయంతో ఉన్నవారు దర్శనమిస్తున్నారు. ప్రతి ఏటా రూ.కోట్లల్లో టర్నోవర్ ఉండే దుకాణాలు కూడా ప్రస్తుతం బోణీకి కూడా నోచుకోవడం లేదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులను గతంలో ఏనాడూ చూడలేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కరోనా ప్రభావం పడింది

వస్త్ర వ్యాపారంపై కరోనా ప్రభావం మామూలుగా లేదు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ప్రతి కుటుంబంలోనూ ఇబ్బందులు వచ్చాయి. చాలా రోజులుగా మాకు వ్యాపారం లేకుండాపోయింది. ఇప్పుడిప్పుడే కరోనా పోయిందని జనం బయటికి వస్తున్నారు. ఇక మాకు గిరాకీ వస్తుందని భావించాం. అమ్మకాలు సాగుతాయని అనుకున్నాం. ఇంతలో వర్షాలు, వరదలు వచ్చాయి. అతలాకుతలం అయ్యింది. దాంతో ఎవరూ బయటికి రాలేదు. దసరాకు 15 రోజుల పాటు మాకు ఫుల్ గిరాకీ ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకుండాపోయాయి. తీవ్ర నష్టాలకు గురయ్యాం. మా దగ్గర స్టాకు పేరుకుపోయింది.

– కైరంకొండ ధనుంజయ, ఆరాధన టెక్స్ టైల్స్, కొత్తపేట, హైదరాబాద్

ఇది ఆర్నెళ్ల ప్రభావం..

దసరా పండుగకు ఏడాది అమ్మకాల్లో సగం ఉండేది. అంటే ఆర్నెళ్లకు సరిపడా సేల్స్ ఈ పండుగ సీజన్ లోనే అయ్యేది. అంతా పోయింది. గిరాకీ లేదు. డీమానిటైజేషన్, జీఎస్టీ, కరోనా, వరదలు.. ఇలా అన్నీ కలిసి మా వ్యాపారాన్ని దెబ్బ తీశాయి. ఇప్పుడు మాత్రం ఈ వర్షాలతో మా నమ్మకాలన్నీ పోయాయి. చాలా ప్రాంతాల్లో రహదారి వ్యవస్థ దెబ్బతింది. దాంతో హోల్ సేల్ గిరాకీ లేకుండాపోయింది. ఆ తర్వాత షాపింగ్‌కూ ఎవరూ రావడం లేదు. కరోనా భయం కొంచెం పోయింది. ఇక షాపింగ్ చేస్తారనుకున్న రోజుల్లోనే వర్షాలు ఇంట్లో నుంచి బయటికి వెళ్లనీయ్యలేదు. ఇలాంటి పరిస్థితులను మేం ఎప్పుడూ చూడలేదు.

– పొట్టబత్తిని యాదగిరి, వెంకటేశ్ హ్యాండ్లూమ్స్, పీవీటీ మార్కెట్

Advertisement

Next Story

Most Viewed