ఆ ఇద్దరి రూటే సపరేటు.. ఈటల VS పెద్దిరెడ్డి

by Shyam |
etla-rajender-and-peddireddy -1
X

దిశప్రతినిధి, కరీంనగర్ : ఆయన ఇంకా ఆ నియోజకవర్గ ఇంచార్జిగానే ఉన్నారు. ఇటీవల జరిగిన పరిణామాలతో ఈయన కూడా అదే పార్టీలో చేరారు. ఇద్దరూ కలిసి పని చేయాల్సి ఉన్నా ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆ పార్టీలో ఏం జరుగుతోందో అర్థం కాక కేడర్ అయోమయానికి గురవుతున్నారు. బీజేపీలో జరుగుతున్న ఈ పరిణామాల ప్రభావం ఎలా ఉండబోతోందన్నదే ఇప్పుడు జరుగుతున్న ప్రధాన చర్చ.

రెండు రోజులుగా..

బీజేపీ హుజురాబాద్ ఇంచార్జీ, మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి రెండు రోజులుగా ఇక్కడే మకాం వేశారు. తన అనుచరులు, అభిమానులతో ముచ్చటించిన పెధ్ధిరెడ్డి గురువారం ఇటీవల మరణించిన కుటుంబాలను పరామర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి తనకు అధిష్టానం అవకాశం ఇస్తే మరోసారి పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి గురించి పెద్దిరెడ్డి వివరించారు.

ఈటల రాక..

బీజేపీలో చేరిన తరువాత మాజీ మంత్రి ఈటల రాజేందర్ గురువారం హుజురాబాద్ లో పర్యటించారు. ఆయన సతీమణి జమున కమలాపూర్ మండలంలో పర్యటించగా రాజేందర్ హుజురాబాద్, జమ్మికుంట మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఈటలకు ఘనస్వాగతం పలికాయి. భారీ ర్యాలీతో రాజేందర్ టూర్ కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన సెంటిమెంట్‌గా భావించే నాగారం అంజన్న ఆలయంలో పూజలు నిర్వహించారు.

ఎవరికి వారే..

ఇద్దరు నాయకులు కూడా హుజురాబాద్‌లో పర్యటనలోనే ఉన్నప్పటికీ ఎవరికీ వారే అన్నట్టుగా వ్యవహరించారు. ఈటల తన సత్తా చాటే విధంగా భారీ ర్యాలీలు ఏర్పాటు చేస్తే ఇనుగాల పరామార్శల కార్యక్రమంలో ఉన్నారు. కానీ, ఒకరి ప్రోగ్రాంలో మరోకరు హాజరు కాకపోవడం గమనార్హం. బీజేపీకి చెందిన ఇద్దరు నాయకులు ఎడమొహం, పెడ మొహంగా వ్యవహరించడం విడ్డూరం. అంతర్గతంగా అభిప్రాయ బేధాలు ఎన్ని ఉన్నా బాహాటంగా మాత్రం తాము సన్నిహితులమే అన్న సంకేతాలు పంపించేందుకు పొలిటికల్ లీడర్లు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంటారు. ముదిరి పాకన పడితే తప్ప బయటకు పొక్కకుండానే జాగ్రత్త పడుతుంటారు. కానీ ఇనుగాల పెద్దిరెడ్డి, ఈటల రాజేందర్ విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా సాగుతుండటం గమనార్హం. ఈటల బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారం జరుగుతున్న క్రమంలోనే పెద్దిరెడ్డి తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. అప్పుడే వీరిద్దరి మధ్య సయోధ్య కుదిరించే ప్రయత్నం జరగలేదని ఇవాళ్టి వీరి టూర్ ద్వారా స్పష్టం అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed