గందరగోళం.. ఏడేళ్ళయినా ఉద్యోగుల లెక్క తేలలేదా..?

by Anukaran |   ( Updated:2021-07-18 23:51:05.0  )
telangana-employees
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల లెక్కలు తేలడం లేదు. ఏయే శాఖలో ఎంతమంది ఉన్నారనే వివరాలు ఏడేండ్ల నుంచి కూడా చిక్కడం లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వమే ఒప్పుకుంటోంది. ఉద్యోగాల ఖాళీల అంశంపై స్పష్టత రాలేదు. ఖాళీల విషయం పక్కనపెడితే అసలు ఉద్యోగులు ఎంత మంది ఉన్నారో కూడా ప్రభుత్వం దగ్గర వివరాలు లేవని తేలిపోయింది. ఆయా శాఖలు ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగుల వివరాల్లో తప్పులున్నాయంటూ ప్రభుత్వం ఒప్పుకుంటోంది. ఇప్పుడు ఏ శాఖలో, ఏ ప్రాంతాల్లో ఎంతమంది పని చేస్తున్నారనే వివరాలను ఇవ్వాలంటూ ఉత్తర్వులిచ్చారు. శాఖల వారీగా దీనికోసం ప్రత్యేకాధికారులను నియమించారు.

పీఆర్సీలో 6,15,671… సీఎం లెక్కల్లో 9,17,797 ఉద్యోగులు..

ఈ ఏడాది మార్చి 22న అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్​ పీఆర్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. “ ఈసారి కూడా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు వేతన సవరణ చేస్తున్నాం.. ప్రభుత్వ యంత్రాంగంలో భాగమై పనిచేస్తున్న ఇతర కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్ వాడీలు, ఆశ వర్కర్లు, సెర్ప్ ఉద్యోగులు, విద్యా వాలంటీర్లు, కేజీబీవీ, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు, వీ.ఆర్.ఏలు, వీ.ఏ.ఓలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, వర్కు చార్జ్ డ్, డెయిలీ వేజ్ తదితర ఉద్యోగులందరికీ వెరసి రాష్ట్రంలోని 9,17,797 మంది ఉద్యోగులకు వేతనాల పెంపుదల వర్తింపచేస్తున్నాం.. ” అంటూ సీఎం ప్రకటించారు.

అంతకు ముందు రాష్ట్రంలో వేతన సవరణపై బిశ్వాల్​ కమిషన్​ సమగ్ర వివరాలను రూపొందించింది. శాఖల నుంచి వివరాలను తీసుకుని లెక్కలు ప్రకటించింది. కమిషన్​ నివేదిక ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4,91,304 శాంక్షన్​ పోస్టులుండగా… 3,00,178 మంది పని చేస్తున్నట్లు వెల్లడించింది. మిగిలినవీ ఖాళీలుగా చూపించారు. వీరితో పాటుగా రాష్ట్రంలో 58,128 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది, 66,239 మంది కాంట్రాక్టు ఉద్యోగులు వివిధ శాఖల్లో పని చేస్తున్నట్లె లెక్కలేసి ప్రకటించారు. బిశ్వాల్​ నివేదిక ప్రకారం రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 6,15,671.

ఏడేండ్ల నుంచి అస్పష్టత..

స్వరాష్ట్రంలో ఏడేండ్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల లెక్కలు తేలడం లేదు. ప్రతినెలా వేల కోట్లు వేతనాలుగా ఇస్తున్నా… ఏ శాఖలో ఎంతమంది పని చేస్తున్నారనే వివరాలు లేకపోవడం ఆశ్యర్యంగా కనిపిస్తోంది. ఏ శాఖలో ఎన్ని శాంక్షన్​ పోస్టులున్నాయి, ఎంతమంది పని చేస్తున్నారనే వివరాలన్నీ తప్పులతడకగా మారాయి. దీనిపై ఓ ఉన్నతాధికారి కూడా ఇటీవల ఆఫ్​ ది రికార్డు అంటూ ఉద్యోగ సంఘాల నేతలతోనే లెక్కలన్నీ తప్పు అని చెప్పినట్లు ప్రచారం. అటు పీఆర్సీ నివేదిక తప్పే… ఇటు ఖాళీల భర్తీపై శాఖల నుంచి సేకరించిన సమాచారం కూడా తప్పు అన్నట్టు ప్రభుత్వ పెద్ద చెప్పడంతో ఉద్యోగ సంఘాల నేతలే ఆందోళనలో పడ్డారు.

ఇప్పుడైనా తీయండి..

ప్రస్తుతం రాష్ట్రంలో 56 వేల ఉద్యోగాల ఖాళీలున్నాయని, వాటిని భర్తీ చేసే ప్రక్రియను ప్రారంభించాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల లెక్కలపై గందరగోళం నెలకొంది. పీఆర్సీ నివేదికలో ఖాళీలు 1.91 లక్షలు సూచించడం, కానీ దాదాపు వారం రోజుల పాటు కష్టపడి… ఆదేశాల మీద ఆదేశాలు జారీ చేసి ఆర్థిక శాఖ కసరత్తు చేసిన జాబితాలో కేవలం ఖాళీలు 56 వేలుగా సూచించారు. దీంతో ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగుల లెక్కలపై అస్పష్టత బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీ విషయం పక్కనపెట్టి అసలు ఎంతమంది ఉద్యోగులు ఉన్నారనే వివరాలను సేకరించే పనిలో పడ్డారు. శాఖల వారీగా వివరాలు ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చారు.

తప్పులున్నాయని ఒప్పుకున్నారు..

తాజాగా ఉద్యోగాల వివరాలు తీసుకుంటున్న శాఖాధికారులు… ఉద్యోగుల వివరాలన్నీ తప్పులు ఉన్నట్లుగా ఒప్పుకున్నారు. అబ్కారీ శాఖ డైరెక్టర్​ ఇచ్చిన సర్క్యులర్​లో ఈ విషయాన్ని స్పష్టంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో ఇటీవల ఉద్యోగాల ఖాళీలపై వివరాలు తీసుకున్న సమయంలో ప్రస్తుతం పని చేస్తున్న కానిస్టేబుళ్ల వివరాలను సరిగా ఇవ్వలేదని, ఖాళీల కేటగిరీలో వివరాలు సరిగా లేవంటూ పేర్కొన్నారు. ఆయా కేడర్లలో వేతనాలు తీసుకుంటున్న వారి వివరాలు ఇవ్వాలని, అదే ప్రామాణికంగా తీసుకుంటామని పేర్కొన్నారు.

జిల్లాకు స్పెషల్ ఆఫీసర్లు..

రాష్ట్రంలో ఏడేండ్ల నుంచి వివరాలు లేకుండా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల లెక్కలు తీసేందుకు జిల్లాల వారీగా ప్రత్యేకాధికారులను నియమించాల్సిన పరిస్థితి నెలకొంది. 50వేల కొలువులు భర్తీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో అసలు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారనే వివరాలు బయటకు తీస్తున్నారు. దీనిలో భాగంగా ఆయా శాఖల నుంచి ప్రతి జిల్లాలకు ఆయా శాఖలోని అధికారులకే బాధ్యతలను అప్పగించారు. ఒక్కో శాఖలో ఒక్కో అధికారికి రెండు జిల్లాల బాధ్యతలను ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఉద్యోగుల వివరాలపై పొంతన కుదరకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. శాఖ నుంచి వేతనాలు తీసుకుంటున్నవారు, ఎక్కడెక్కడ పని చేస్తున్నారనే అంశాలను తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేతనాలు తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగిగా చెప్పుకుంటున్న వారి వివరాలు, లెక్కలు సంపూర్ణంగా వస్తాయో… లేదో చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed