‘బతుకమ్మ’ నిర్వహణపై నో క్లారిటీ..!

by Anukaran |   ( Updated:2020-10-15 20:41:10.0  )
‘బతుకమ్మ’ నిర్వహణపై నో క్లారిటీ..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బతుకమ్మ సంబురాలను ఈ ఏడాది ఎప్పుడు జరుపుకోవాలనే దానిపై ప్రభుత్వం ఇంకా ఉత్తర్వులు వెలువరించలేదు. సాంస్కృతిక శాఖకు సైతం దీనిపై స్పష్టమైన సమాచారం లేదు. మరోవైపు వేద పండితుల్లో సైతం రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొద్దిమంది 16వ తేదీన(నేడు) ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభించాలని అంటుంటే.. మరికొందరేమో అమావాస్య మరుసటి రోజు (అక్టోబరు 17) నుంచి జరుపుకోవాలని అంటున్నారు. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం దీనిపై ఇప్పటివరకు క్లారిటీ లేదు.

ఈ సంవత్సరం అధిక ఆశ్వయుజ మాసం వచ్చినందున నిజ ఆశ్వయుజ మాసం అమావాస్య రోజునే బతుకమ్మ సంబురాలు ప్రారంభం కావాలని పండితులు నిర్ణయించారు. ఆ ప్రకారం అక్టోబరు 16వ తేదీన ప్రారంభమై 24వ తేదీ వరకు జరుగుతాయని గత నెల 14వ తేదీన ‘తెలంగాణ విద్వత్సభ’ నిర్ణయించింది. ఆ ప్రకారమే జరుపుకోవాలని ‘తెలంగాణ జాగృతి’ కూడా ప్రకటించింది. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు తేదీని ప్రకటించలేదు. భాద్రపద మాసంలోని మహాలయ అమావాస్య రోజున (సెప్టెంబరు 17న) బతుకమ్మను ప్రారంభించి ఆ ఒక్క రోజుతో నిలిపేసినవారు మాత్రం ఈ నెల 17వ తేదీ నుంచి ఎనిమిది రోజుల పాటు ఈ నెల 24వ తేదీ వరకు జరుపుకోనున్నారు.

గత నెలను అధిక ఆశ్వయుజ మాసంగా భావించి బతుకమ్మను ప్రారంభించకుండా ఉన్నవారు మాత్రం ఈ నెల 16వ తేదీన నిజ ఆశ్వయుజ మాసంగా భావించి అమావాస్య రోజున మొదలుపెట్టి 24వ తేదీ వరకు జరుపుకోనున్నారు. అధిక ఆశ్వయుజ మాసం (అక్టోబరులో వచ్చే అమావాస్య)లో వచ్చే అమావాస్య రోజున మొదలుపెట్టరాదని భావించినవారు మాత్రమే గత నెల మహాలయ అమావాస్య రోజున మొదలుపెట్టారు. అందువల్ల శుక్రవారం (నేడు) వచ్చే అమావాస్య రోజున మళ్లీ బతుకమ్మను జరుపుకోరు. ఆ మరుసటి రోజు నుంచి జరుపుకుంటారు. కానీ గత నెలలో బతుకమ్మను ప్రారంభించనివారంతా మాత్రం శనివారం వచ్చే అమావాస్య రోజు నుంచి మొదలుపెట్టనున్నారు.

Advertisement

Next Story

Most Viewed