కొవిడ్ టీకా రివర్స్ చేసే చాన్స్ ఉందా?

by Shyam |   ( Updated:2021-11-13 09:12:05.0  )
covid vaccine
X

దిశ, ఫీచర్స్ : ప్రభుత్వం, పరిశోధకులు, వైద్యులు సహా స్వచ్ఛంద సంస్థలు మహమ్మారిని నిరోధించేందుకు వ్యాక్సిన్ తీసుకోమంటూ ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికి చాలా మందిలో టీకాలపై ఉన్న అపోహలు, సందేహాలు తొలగిపోలేదు. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ తీసుకోవద్దని సూచిస్తున్న యాంటీ-వ్యాక్స్ గ్రూప్స్.. శరీరం నుంచి వ్యాక్సిన్‌ను డిటాక్స్ చేయొచ్చనే ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే డౌట్‌ఫుల్‌గా వ్యాక్సిన్ తీసుకున్న కొందరు ఇప్పుడు బాడీ నుంచి దాన్ని తొలగించుకునేందుకు ‘డిటాక్స్’ ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే టీకాను రివర్స్ చేసే మార్గం ఏదీ లేదనే విషయాన్ని గమనించాలని వైద్యులు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్, ప్రముఖ యాంటీ-వాక్స్, మిస్ ఇన్ఫర్మేటివ్ హాకర్ డాక్టర్ క్యారీ మాడెజ్.. ‘డిటాక్స్ బాత్’ గురించి ఓ వీడియో రూపొందించారు. ఎలాంటి ఫ్యాక్ట్-చెక్ లేబుల్‌ లేని ఆ వీడియో గతంలో ఫేస్‌బుక్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. రేడియేషన్ పాయిజనింగ్, క్రిమి సంహారకాలు, హెవీ మెటల్స్ సహా కొన్నిరకాల పరాన్నజీవులను ‘డిటాక్ బాత్’ వెలికితీస్తుందని ఆ వీడియోలో పేర్కొన్నారు. మ్యాజిక్ బుల్లెట్ డిటాక్సిఫైయర్స్‌గా చాలా కాలం నుంచి పొరపాటుగా చెలామణి అవుతున్న బేకింగ్ సోడా, ఎప్సమ్ ఉప్పు(రేడియేషన్ కోసం), బెంటోనైట్ క్లే(ఫంగస్ అండ్ ఈస్ట్ కోసం), బోరాక్స్(నానోటెక్నాలజీ కోసం) వంటి ఐటెమ్స్‌ను సిఫార్సు చేస్తోన్నారు. ఇది విస్తృతంగా వ్యాప్తి చెందడంతో ఆరోగ్య నిపుణులు దీనికి చెక్ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

covid

బొద్దింకలను చంపే క్లీనింగ్ ఏజెంట్ అయిన బోరాక్స్‌తో శరీరాన్ని స్క్రబ్ చేయడం అవివేకం. కాగా ‘నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్’ బోరాక్స్‌ను ఆరోగ్యానికి ముప్పుగా పరిగణించింది. అధిక మోతాదులో దీన్ని వినియోగించడం వల్ల వికారం, మూర్ఛ, విరేచనాలు, తలనొప్పి, బలహీనత, మగతకు కారణమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ-అనుబంధ పరిశోధకులు పేర్కొన్నారు.

AIతో మానవ ప్రవర్తనను ప్రోగ్రామ్ చేసే లిక్విఫైడ్ నానోటెక్నాలజీని టీకా కలిగి ఉందని, తద్వారా ఏథియెస్ట్(నాస్తికులు) మీ కాన్షియస్‌నెస్‌ను క్లౌడ్‌లోకి అప్‌లోడ్ చేసి వాటిని హోలోగ్రామ్ అవతార్‌లోకి ‘డౌన్‌లోడ్’ చేయగలరని మాడెజ్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ ప్రజలకు ఇవ్వకముందే ఈ విషయాన్ని గుర్తించినట్లు పేర్కొనడం పలు సందేహాలకు తావిస్తుండగా, వ్యాక్సిన్‌ను అధ్యయనం చేయలేకపోయారనే విషయాన్ని చెప్పకనే చెబుతోందని వైద్య నిపుణులు తెలిపారు. అంతేకాదు ఈ సమాచారాన్ని బలపరిచే, నమ్మకాన్ని కలిగించే ఎలాంటి సోర్స్‌ను అందించలేదనే విషయాన్ని స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో షేర్ అవుతున్న మాడెజ్ వీడియో పూర్తిగా తప్పుడు సమాచారం. వైద్యులు లేదా స్పెషలిస్ట్ వైద్యులు అని చెప్పుకునే వ్యక్తులు ఈ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. యాంటీ-వ్యాక్సర్లు కూడా టీకా వెలికితీత పద్ధతులుగా కప్పింగ్, బ్లడ్ డ్రాయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారని అంతర్జాతీయ పత్రికలు నివేదించాయి. TikTok ఇప్పటికీ #vaccinedetox వీడియోలను చూపుతుండగా, ఇందులో హైడ్రోజన్ పెరాక్సైడ్ బాటిల్స్, ఇతర హానికర వస్తువులు కనిపిస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో కూడా ఇటువంటి వీడియోలు ఉన్నాయి. TikTok స్పష్టంగా వైరల్ వీడియోను తీసివేయగా, తక్కువ వీక్షణలు పొందిన రీపోస్ట్‌లు ఉన్నాయి. ఫేస్‌బుక్‌లో ఇప్పటికీ మాడెజ్‌కు సంబంధించిన వీడియో ప్లాట్‌ఫామ్‌లో ఉంది.

Advertisement

Next Story