ఏ క్షణంలో అయినా ఎన్నికలు రావొచ్చు.. ఎంపీ అర్వింద్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Shyam |   ( Updated:2021-12-12 08:50:53.0  )
Nizamabad MP Dharmapuri Arvind
X

దిశ, ఆర్మూర్: భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా శిక్షణా తరగతులు ముగిశాయి. జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మినర్సయ్య అధ్యక్షతన ఆర్మూరులో మూడ్రోజుల పాటు కొనసాగిన ఈ శిక్షణా తరగతుల ముగింపు సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ ధర్మపురి అర్వింద్ గెస్ట్‌గా హాజరై మాట్లాడుతూ.. జిల్లాలో బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌కు హుజురాబాద్ ఎన్నికల తర్వాత మతిపోయి, పిచ్చి ఎక్కినట్లుగా ఇష్టం వచ్చినట్లు వాగుతున్నారని దుయ్యబట్టారు. ఏ క్షణంలోనైనా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని, ప్రతీ కార్యకర్తా విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఎన్నికలో పోటీ చేసేందుకు, టికెట్ ఆశించే ఆశావాహులు ప్రజలతో మమేకమై పనిచేయాలన్నారు.

ఏ ఒక్క వ్యక్తిని నమ్ముకొని పని చేయడానికి ఇది టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ కాదని ఇది భారతీయ జనతా పార్టీ అని అన్నారు. ప్రజలతో మమేకమై ప్రజాక్షేత్రంలో సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తూ పేరుపొందిన వ్యక్తులకు పార్టీ టికెట్లు ఇస్తుందని స్పష్టం చేశారు. అంతేకానీ నాకు వాళ్లు తెలుసు, వీళ్లు తెలుసు, నేను సీనియర్, నేను జూనియర్ అని తారతమ్యాలు పనికి రావన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలను పోరాటాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి అవగాహన కల్పించాలన్నారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న ప్రజా నాయకులు, గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తారన్నారు. పార్టీ కీలక నాయకులు, టికెట్ ఆశించే ఆశావహులందరూ ప్రజల మధ్యే, ప్రజా క్షేత్రంలోనే ఉండాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్‌చార్జి మీసాల చంద్రయ్య, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దినేష్ కులచారి, బీజేపీ సీనియర్ నాయకులు లోక భూపతిరెడ్డి, బద్దం లింగారెడ్డి, జిల్లా శిక్షణ తరగతుల ఇన్‌చార్జి పుప్పాల శివరాజ్, కో-కన్వీనర్ అందాపూర్ రాజేష్, అసెంబ్లీ ఇన్‌చార్జీలు వినయ్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, మాల్యాద్రి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు నరసింహ రెడ్డి, న్యాలమ్ రాజు, జిల్లా రాష్ట్ర పదాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story