మిషన్ భగీరథకు నీతి అయోగ్ ప్రశంసల జల్లు

by Shyam |
మిషన్ భగీరథకు నీతి అయోగ్ ప్రశంసల జల్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్న నీతి ఆయోగ్ ప్రసంశల జల్లు కురిపించింది. మిషన్ భగీరథ అద్భుతమైన పథకం అని నీతి ఆయోగ్ కితాబు ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తూ ప్రశంసించారు. మిషన్ భగీరథ ద్వారా వంద శాతం ఇండ్లకు తాగు నీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 54 లక్షల 6 వేల 70 ఇండ్లకు మిషన్ భగీరథ ద్వారా నల్లాలతో తాగునీటిని అందిస్తోందన్నారు. హర్యానా రాష్ట్రంలో 30 లక్షల 96 వేల 792 ఇండ్లకు, గోవా రాష్ట్రంలో 2 లక్షల 63 వేల 13 ఇండ్లకు, పుదుచ్చేరిలో 1 లక్ష 14 వేల 908 ఇండ్లకు తాగు నీటిని అందిస్తూ వంద శాతం లక్ష్యాన్ని చేరుకున్నాయని కేంద్ర నీతి ఆయోగ్ పేర్కొంది.

కేంద్ర నీతి ఆయోగ్ రాష్ట్ర మిషన్ భగీరథ పథకానికి కితాబును ఇవ్వడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందించాలన్న సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్షకు ఈ ప‌థ‌కం నిదర్శనం అని పేర్కొన్నారు. కేంద్ర నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్‌కు రీ ట్వీట్ చేశారు. అనేక అవార్డులు సాధించిన ఈ పథకం కు మరో రూపమే జల్ జీవన్ మిషన్ అనీ, అనేక రాష్ట్రాలు ఈ పథకాన్ని ఆదర్శంగా తీసుకొని తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు.

Advertisement

Next Story