తీరాన్ని తాకిన నిసర్గ

by Shamantha N |
తీరాన్ని తాకిన నిసర్గ
X

ముంబయి: అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర తుపాను నిసర్గ ముంబయికి 100కి.మీ.ల దూరంలోని అలీభాగ్‌ వద్ద మధ్యాహ్నం 1గంటల సమయంలో తీరాన్ని తాకింది. తుపాను తీరం దాటడానికి దాదాపు 3గంటల సమయం పడుతుందని వాతావరణశాఖ ప్రకటించింది. ఈ సమయంలో గంటలకు 120 నుంచి 140కి.మీ. వేగంతో ప్రచండ గాలులు వీచాయి. 15 రోజుల వ్యవధిలోనే దేశంలో సంభవించిన రెండో తుపాన్ కావడం గమనార్హం. మహారాష్ట్ర, గుజరాత్, డామన్ అండ్ డయ్యూ, దాద్రా అండ్ నగర్ హవేలిలో హై అలర్ట్ ప్రకటించారు. తుపాను బాధిత ప్రజలను ముందు జాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మహారాష్ట్ర కోస్తా తీర ప్రాంతాల్లోని బీచులు, పార్కులు, విహార స్థలాల్లో ప్రజలు రాకుండా పోకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. రాత్రి 7గంటల వరకు ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలను నియంత్రించారు. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోని కోస్తా తీర ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం 43 నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్‌డీఆర్‌ఎఫ్) బృందాలను రంగంలోకి దించారు. 45 సభ్యులు గల ఒక్కో బృందం బాధితుల తరలింపు ప్రక్రియను పూర్తిచేసింది. ఒక్క మహారాష్ట్రలోనే 40వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్న వారికి ప్రాణాలు కాపాడుకోవడంపై, కరోనా బారిన ఉండటం కోసం సోషల్ డిస్టెన్స్ పాటించడంపై తగిన సూచనలు చేసినట్టు ఎన్‌డీఆర్ఎఫ్ చీఫ్ ఎస్‌ఎన్ ప్రదాన్ వీడియో సందేశంలో తెలిపారు.

Advertisement

Next Story