- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వావలంబన కోసమే సంస్కరణలు
దిశ, సెంట్రల్ డెస్క్: ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ కింద ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్లకు సంబంధించి నాలుగో విడత వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం వెల్లడించారు. ప్రపంచ దేశాలతో పోటీ పడేందుకు స్వయం సమృద్ధ, స్వావలంబన భారత్‌గా ఎదగాలని, అందుకోసం మనదేశంలోని పలు రంగాల్లో పాలసీ నిర్ణయాలను సరళీకరించాలని తెలిపారు. తద్వారా ఆర్థికవృద్ధి పెరగడమే కాదు, ఉపాధి సృష్టీ జరుగుతుందని చెప్పారు. ఆమె తన ప్రకటనల్లో ప్రధానంగా ఎనిమిది రంగాలపై దృష్టి సారించారు. రక్షణ ఉత్పత్తులు, గనులు, బొగ్గు, వైమానిక, అంతరిక్ష, అణుశక్తి రంగాలు, ఎంఆర్‌ఓ(మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్), కేంద్రపాలిత ప్రాంతాల్లో డిస్కంల్లో నిర్మాణాత్మక సంస్కరణలను ప్రకటించారు. ఈ సంస్కరణల ద్వారా ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతాయని పేర్కొన్నారు.
పెట్టుబడులపై ఫాస్ట్ ట్రాక్‌లో క్లియరెన్సుల కోసం ప్రత్యేకంగా ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రెటరీ(ఈజీఓఎస్)లను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి తెలిపారు. పెట్టుబడులకు అవకాశం ఉన్న ప్రాజెక్టుల వివరాలను పొందుపరిచి ఇన్వెస్టర్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేసే ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ సెల్‌లను ప్రతి మంత్రిత్వశాఖలో ఏర్పాటు చేయాలని చెప్పారు. కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు పోటీపడుతున్న రాష్ట్రాలకు ర్యాంకులు ఇవ్వడం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్టు తెలిపారు. అలాగే, కొత్త పెట్టుబడుల కోసం ప్రాజెక్టులకు కావాల్సిన సమాచారాన్ని సులువుగా అందుబాటులో ఉండేందుకు, భూమి, ఇతర సౌకర్యాలకు సంబంధించిన వివరాలను జీఐఎస్ మ్యాపింగ్ ద్వారా ఇండస్ట్రియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(ఐఐఎస్)లో యుద్ధ ప్రాతిపదికన పొందుపరచనున్నట్టు పేర్కొన్నారు.
కోల్ మైనింగ్‌లో ప్రభుత్వ ఏకఛత్రాధిపత్యానికి అడ్డుకట్ట
మనదేశంలో సరిపడా బొగ్గు గనులు ఉన్నా ఇప్పటికీ విదేశాల నుంచి దిగుమతులు చేసుకుంటున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అందుకే కోల్ మైనింగ్‌లో ప్రభుత్వ ఏకఛత్రాధిపత్యానికి చెక్ పెడుతూ ప్రైవేటు సెక్టార్‌కు అనుమతులు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. తద్వారా ప్రొడక్షన్ పెరిగి విదేశాలపై ఆధారపడబోమని చెప్పారు. రాబడి పంచుకొనే విధానంలో ప్రైవేటు కంపెనీలతో కమర్షియల్ మైనింగ్‌కు తెర లేపారు. దాదాపు 50 కోల్ మైనింగ్ బ్లాక్‌లకు బిడ్ చేయనున్నట్టు వివరించారు. అంతేకాదు, వెలికితీతకు సంబంధించిన సదుపాయాలు, వసతుల కోసం ప్రభుత్వం రూ. 50వేల కోట్లను ఖర్చు పెట్టబోతున్నట్టు తెలిపారు.
గనుల తవ్వకాల్లో సంస్కరణలు
గనుల తవ్వకాల రంగంలో వ్యవస్థీకృత మార్పుల ద్వారా వృద్ధి పెరుగుతుందని, ఉపాధి కూడా లభిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. నిరంతరాయంగా గనుల అన్వేషణ, తవ్వకాలు జరపనున్నట్టు వివరించారు. కాంపోజిట్ ఎక్స్‌ప్లోరేషన్, మైనింగ్, ప్రొడక్షన్ పద్ధతిలో 500 బ్లాక్‌లను వేలం వేయనున్నట్టు చెప్పారు. బాక్సైట్, కోల్ గనులను సంయుక్తంగా వేలం వేయనున్నట్టు తద్వారా అల్యూమినియం పరిశ్రమల మధ్య పోటీ పెరుగుతుందని వివరించారు. అలాగే, మైనింగ్ లీజుల బదిలీ, ఉపయోగంలో లేని నికర గనుల అమ్మకాలకూ అనుమతినివ్వనున్నట్టు తెలిపారు.
రక్షణరంగ తయారీలో ఎఫ్‌డీఐల పెంపు
రక్షణ రంగంలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. 49శాతం నుంచి 74శాతానికి పెంచుతున్నట్టు కేంద్ర మంత్రి ప్రకటించారు. నిర్దేశించుకున్న కాల పరిమితిలో వేగంగా నిర్ణయాలు తీసుకుని, కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్‌కు సహాయంగా ఉండేందుకు ప్రత్యేకంగా ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్‌లను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. ఈ రంగంలోని ఉత్పత్తులను దేశీయంగానే తయారు చేసుకునే చర్యలను వివరించారు. ఇందులో భాగంగానే విదేశాల నుంచి మన దేశంలోకి దిగుమతి అవుతున్న ఆయుధాల జాబితాను తయారుచేసి వాటిపై నిషేధం విధించి, వాటిని మన దేశమే విక్రయించేలా చర్యలు తీసుకోబోతున్నట్టు తెలిపారు. అలాగే, ప్రతి ఏడాది ఈ జాబితాను పెంచనున్నట్టు వివరించారు.
ఆరు విమానాశ్రయాల వేలానికి నిర్ణయం
దేశంలోని ఆరు విమానాశ్రయాలను పీపీపీ (ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం) పద్ధతిలో వేలం వేయబోతున్నట్టు కేంద్ర మంత్రి వివరించారు. 12 ఎయిర్‌పోర్టుల్లో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు అందుబాటులోకి తేవడానికి అదనంగా పెట్టుబడులు పెట్టబోతున్నట్టు తెలిపారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు డౌన్‌పేమెంట్ పద్ధతిలో రూ. 2,300కోట్లు అందించబోతున్నారని వివరించారు. 12 విమానాశ్రయాల్లో మొదటి, రెండు దశల్లో రూ. 12వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు పేర్కొన్నారు. దేశంలో కేవలం 60శాతం గగనతలం మాత్రమే ఉచితంగా వైమానిక రంగానికి అందుబాటులో ఉన్నదని, తద్వారా విమానాల ప్రయాణ గమ్యాలు దూరమవుతున్నాయని చెప్పారు. అయితే, మిగతా గగనతలంపైనా ఆంక్షలు సడలిస్తే విమాన మార్గాల దూరాలు తగ్గడమే కాదు, ఇంధనమూ ఆదా అవుతుందని వివరించారు.
ప్రైవేటురంగానికి అందుబాటులో అంతరిక్ష సేవలు
అంతరిక్ష సేవలను ప్రైవేటురంగానికి అందుబాటులోకి తేనున్నట్టు కేంద్ర మంత్రి ప్రకటించారు. ప్రైవేటు కంపెనీలు తమ సామర్థ్యాలను పటిష్టం చేసుకోవడానికి ఇస్రో, ఇతర సంస్థల సేవలనూ వినియోగించుకొనేందుకు అనుమతించారు. భవిష్యత్తులో ఇతర గ్రహాల అన్వేషణ, అంతరిక్ష పర్యటనలకు అనుగుణంగా ప్రైవేటురంగానికి సానుకూల నిర్ణయాలను వెల్లడించారు. ఉపగ్రహాల తయారీ, అంతరిక్షంలోకి ప్రయోగం, స్పేస్ సేవల్లోనూ ప్రైవేటురంగం పాలుపంచుకునే అవకాశాన్ని కల్పించారు.
అణుశక్తి రంగంలోనూ ప్రైవేటుకు అనుమతి
అణు శక్తి, సామాజిక మౌలిక ప్రాజెక్టులు, ఎంఆర్‌ఓల్లోనూ సంస్కరణలను కేంద్ర మంత్రి ప్రకటించారు. అణుశక్తి రంగంలోనూ పీపీపీ పద్ధతిలో ప్రైవేటు సెక్టార్‌కు అనుమతినిచ్చారు. మానవాళి ఆరోగ్యానికి ఉపయోగపడేలా మెడికల్ ఐసోటోపుల ఉత్పత్తికి రీసర్చర్ రియాక్టర్‌లో పీపీఈ పద్ధతిని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. ఆహారాన్ని భద్రపరచడంలో ఇర్రేడియేషన్ టెక్నాలజీ సదుపాయాల కల్పనకు పీపీపీ పద్ధతిని అనుసరించనున్నట్టు తెలిపారు. ఆస్పత్రులు వంటి సామాజిక మౌలిక ప్రాజెక్టుల్లో ప్రైవేటు పెట్టుబడులు పెంచుకునేందుకు పలు సరళీకరణలు చేయనున్నట్టు వివరించారు. అందుకోసం వయబిలిటీ ఫండింగ్ స్కీమ్‌లో మార్పులు చేయబోతున్నట్టు తెలిపారు. చాలా వరకు మన ఎయిర్‌క్రాఫ్ట్‌లు(రక్షణ సహా పౌర విమానాలూ) రిపేర్ కోసం విదేశాలకు తరలుతున్నాయని, ఈ వసతిని అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో ఎంఆర్‌ఓ వ్యవస్థను హేతుబద్ధీకరించనున్నట్టు ప్రకటించారు. తద్వారా ఇక్కడే రిపేర్, మెయింటెనెన్స్‌లకు అనువైన వాతావరణాన్ని ఏర్పరుచుకోవచ్చునని తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో డిస్కంలను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులపై భార పడకుండా టారీఫ్ పాలసీని రూపొందించనున్నట్లు చెప్పారు.